ఇప్పటి వరకూ ఎన్నో పార్టీ కార్యక్రమాలు చేపట్టినా అన్నీ విఫలం కావడంతో ఏపిలో అధికార వైసీపీ దిక్కు తోచని పరిస్థితికి చేరింది. వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకత కారణంగా వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళదామని ప్రయత్నం చేసినా కూడా కుదరడం లేదు.
పల్లెల్లో ప్రజలు ఎక్కడికక్కడ వైసీపీ నాయకులను నిలదీస్తున్నారు. పాలన పేరుతో దోచుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమిటని అడుగుతున్నారు. దాంతో వైసీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. గతంలో వైసీపీ గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఒక కార్యక్రమం చేపట్టింది. ఇదే మొదటి పార్టీ కార్యక్రమం. ముందుగా ఈ కార్యక్రమాన్ని పార్టీ పరంగా చేపట్టాలని చూశారు… కానీ… అప్పటిలోనే ప్రజా వ్యతిరేకత చూసి దాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చుకున్నారు. అధికారులను, పోలీసులను వెంటపెట్టుకుని తిరిగారు. అయినా నిలదీతలు తప్పలేదు.
దాంతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో దాదాపు 70 మంది వరకూ ఎమ్మెల్యేలు పాల్గొనలేదని జగన్ రెడ్డి తన సమీక్షలో చెప్పారు. వారికి హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వను అని కూడా బెదిరించారు. అయినా వైసీపీ ఎమ్మెల్యేలు గడప గడపకు తిరగలేదు.
ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీకి ఇచ్చిన ఐడియానే జగన్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇక్కడ అమలు చేయాలని చూశారు. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ఇంటింటికి తిరిగి స్టిక్కర్లు అంటించారు. ఈ కార్యక్రమం కూడా ఫెయిల్ అయింది.
ఇలా అన్ని పార్టీ కార్యక్రమాలు ఫెయిల్ అవుతుండటంతో ఇప్పుడు జగన్ ప్రభుత్వం మరో కార్యక్రమం చేపట్టాలని భావిస్తున్నది. ‘పల్లెకు పోదాం’ పేరుతో ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. నెలాఖరులో ఈ కార్యక్రమాన్ని జగన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రకారం ప్రతి మండలంలో పార్టీ మండలాధ్యక్షులు రోజుకో సచివాలయం పరిధిలో తిరిగి, రాత్రికి అక్కడే బసచేస్తారు. లబ్ధిదారులతో సహపంక్తి భోజనాలు కూడా ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ప్రభుత్వ పథకాలు పొందిన లబ్దిదారులను కలిసి జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అందించినవేనని, రానున్న ఎన్నికల్లో మీ సహకారం కావాలని కోరాలని పార్టీ నేతలు విజ్ఞప్తితో కూడిన బెదిరింపులకు దిగనున్నారు. లబ్ధిదారుల జాబితాను తయారు చేస్తున్నారు ఒక్కో కుటుంబానికి ఎన్ని పథకాలు అందాయి? ఎంతమేర లభ్ధి చేకూరింది? అనే విషయాలను నమోదు చేసి లబ్దిదారులకు ఇస్తారు.
అక్కడే జగన్ కు రుణపడి ఉన్నాం అనే పత్రంపైనా సంతకాలు తీసుకోనున్నారు. గ్రామాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో వైసీపీ నేతలకు బాగా తెలుసు. రూపాయి ఇచ్చి పది రూపాయలు దోచుకున్నారన్న ఆగ్రహంతో ప్రజలు ఉన్నారు. దీంతో పార్టీ నేతలు ఎంత మంది జనంలోకి వెళ్తారన్న సస్పెన్సే. నిజానికి ఈ ప్రోగ్రాం ముందుగా జగన్ రెడ్డి కోసం డిజైన్ చేసింది. ఆయన ప్రజల్లోకి వెళ్తారని… చెప్పుకున్నారు. కానీ జగన్ రెడ్డికి జనంలోకి వెళ్లేందుకు ధైర్యం చాలడం లేదు. అందుకే ఆయనను మినహాయించి పార్టీ నేతల్ని పంపించాలనుకుంటున్నారు.