భూ మాఫియా పడగవిప్పింది. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎన్ని సార్లు చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే ఉంటున్నది. ఏం చేయాలి? అందుకే 9 పదుల వయసులో కూడా పోరాటం ఆపలేదు ఆమె. భూ మాఫియాకు నిరసనగా 89 ఏళ్ల ఆ వృద్ధురాలు ఒంటరి పోరాటం చేస్తున్నది. హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలను కూడా ఆమె తన పోరాటానికి వేదికగా ఎంచుకున్నది. హుజూర్ నగర్ కు చెందిన 89 సంవత్సరాల అమరవాది లక్ష్మీ నరసమ్మ దీన గాధ ఇది. ఈ దీన గాథను ఆమె పోరాట చరిత్రగా మార్చబోతున్నది. లక్ష్మీ నర్సమ్మకు చింతలపాలెం మండలం వెల్లటూరు రెవెన్యూ గ్రామంలోని సర్వే నెంబర్ 488లో అనువంశిక భూములు ఉన్నాయి. ఆమెకు ఉన్న సుమారు 180 ఎకరాలలో 1975లో 79 ఎకరాలు సీలింగ్ లో మినహాయించారు. మిగిలిన భూమిని తనతో పాటు తన 12 మంది సంతానానికి సమంగా పంచి ఇవ్వడంతోపాటు తన ఐదుగురు కుమార్తెలకు పసుపు కుంకుమ కింద కొంత భూమి ఇచ్చింది. అయితే ఈ భూములపై భూ మాఫియా కన్ను పడింది. వచ్చారు ఆక్రమించేశారు. ఇదేమిటని అడిగితే వారిని కొట్టారు, పొలం నుంచి వెళ్లగొట్టారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన దళితులకు మూడు ఎకరాలు ఇచ్చే పథకానికి ఈ భూమిని అమ్మేద్దామని అనుకున్నారు. అయితే ప్రభుత్వానికి ఎలా అమ్ముతావంటూ ఈ బామ్మను బెదిరించారు. కొడుకుల్ని చంపుతామన్నారు. ప్రభుత్వానికి కూడా అమ్మనివ్వలేదు. అమ్మితే తమకే అమ్మాలని ఈ భూ మాఫియా బెదిరించింది. ఈ కుటుంబాన్ని బెదిరించిన వారిపై పోలీసులు కేసులు కూడా పెట్టారు. అయినా ఎలాంటి చర్యలు లేవు. ఆమె ఆమె కుమారులు పొలం దున్నితే వచ్చి చెడగొడుతున్నారు. పొలంలో దిగితే చంపేస్తామన్నారు. అప్పటి హోం మంత్రి మహమూద్ అలీకి, ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఎస్ పి దగ్గర నుంచి స్థానిక పోలీస్ స్టేషన్ వరకూ ఫిర్యాదులు ఇచ్చినా ప్రయోజనం లేదు. మాఫియాదే పైచేయి అయింది. ఏం చేయాలి? అందుకే బ్యాలెట్ మాటున తన పోరాటాన్ని కొనసాగిస్తున్నది ఈ బామ్మ. ఇది తన ఒక్క సమస్య కాదని ఎంతోమంది తనలాంటి వారు ఈ భూమి సమస్యలతో ఉన్నారని వారికి స్ఫూర్తి కలిగించడానికే తప్ప ఎలాంటి రాజకీయలబ్ది, ఆర్థిక ప్రయోజనం ఆశించి కాదని హుజూర్ నగర్ కు చెందిన అమరవాది లక్ష్మీ నరసమ్మ అనే వృద్ధురాలు పేర్కొనడం అందరికీ కనువిప్పు కలిగించాలి అని ఆశిద్దాం. సత్యం నూస్ ఓటు అమరవాది లక్ష్మీనరసమ్మకే
previous post