40.2 C
Hyderabad
May 6, 2024 16: 47 PM
Slider ప్రత్యేకం

A big question: అందరూ అలక వీడినట్లేనా….?

#YSJaganmohanReddy

2024 శాసన సభ ఎన్నికలలో మళ్ళీ వై ఎస్ ఆర్ సీపీని అధికారంలోకి తెచ్చే సత్తా కొత్తగా కొలువుతీరిన మంత్రివర్గానికి ఉందా? ఇది రాజకీయ వర్గాలలో ప్రస్తుతం నడుస్తున్న చర్చ. ఒక పార్టీ గెలుపు అనేది ఆ పార్టీ శ్రేణులను నడిపించే నేతలపై ఉంటుంది. క్షేత్ర స్థాయిలో పార్టీ సానుభూతి పరులను ప్రభావితం చేయగల సమర్థత పై ఆ పార్టీ విజయావకాశాలు ముడిపడి ఉంటాయి.

మరి అటువంటి సమర్థుల్ని వై ఎస్ జగన్ తన తాజా మంత్రివర్గంలో చేర్చుకున్నారా లేదా అనేది కొద్దిరోజులలో ఆయా మంత్రుల పనితీరు చెబుతుంది. కొత్త మంత్రివర్గంలో 11 మంది పాత వారిని కూడా కొనసాగించాలని నిర్ణయించడం వెనుక మతలబు ఏమిటనేది చిదంబర రహస్యం. 

తేనెతుట్టెను కదిపిన జగన్

అసమ్మతి రగిలితే  పార్టీకి నష్టం జరుగుతుందని అంచనా వేశారా లేక ఇప్పుడున్న శాసన సభ్యులలో వారితో సమతూగగల సమర్థులు లేరని ముఖ్యమంత్రి భావించారా అన్నది ప్రశ్న. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం అంటేనే తెనేతుట్టెను కదపడం లాంటిది. మాజీలు అలగడం, వారిని సామ దాన భేద దండోపాయాలతో దారికి తెచ్చుకోవడం అన్ని పార్టీలకూ అనుభవమే. ప్రాంతీయ పార్టీల పాలనలో దీని ప్రభావం పాళ్లు మరికాస్త ఎక్కువగా ఉంటాయి.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 26 జిల్లాల ఏర్పాటు కూడా వైకాపా గెలుపోటముల పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. జిల్లాల విభజన కారణంగా ప్రతి జిల్లాకు కొత్తగా హద్దుల నిర్ణయం జరుగుతుంది. సాధారణంగా ఈ తరహా వ్యవ స్థాపరమైన  మార్పుల వల్ల స్థానిక రాజకీయ వర్గాలలో కుదుపు రావడం సహజం.

అదే అధికార పార్టీ విషయంలో స్థానిక నేతల మధ్య పొరపొచ్చాలు వస్తాయి. ఆధిక్యం విషయంలో ఎవరికి ఉండే పట్టు వారికి ఉంటుంది. గత మూడేళ్లుగా ఆయా జిల్లాలలో పార్టీ గెలుపుకు కృషిచేసిన ద్వితీయ శ్రేణి నాయకులు, వారి అనుచరులు ఈ విషయంలో సహజంగా మొండిగా వ్యవహరిస్తారు.

క్షేత్ర స్థాయిలో బలహీన పడితే ఇక అంతే సంగతులు

ఉదాహరణకు ఒక పెద్ద జిల్లా రెండుగా విడిపోతే ఆయా ప్రాంతాలలో అప్పటివరకు బలంగా ఉన్న ఒక వర్గం రెండు జిల్లాలలో సమానంగా పనిచేస్తుందని అనుకోవడం అత్యాశ. క్షేత్ర స్థాయిలో పార్టీ పునాదులు బలహీన పడితే ఆ పార్టీ విజయావకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

అలా కాకుండా ఉండాలంటే మంత్రుల్ని ఆయా జిల్లాలకే పరిమితం చేసి గెలిపించే బాధ్యతలు అప్పగిస్తే కొంతవరకు ఊహించిన నష్టాన్ని నివారించవచ్చు. ఆ ఉద్దేశంతోనే వై ఎస్ జగన్ తాజా మంత్రివర్గ కూర్పుకి సిద్ధపడినట్లు రాజకీయ పరిశీలకుల భావన.

ప్రస్తుత మంత్రివర్గ సభ్యులలో దాదాపు అందరికీ 2024 ఎన్నికలలో పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నదని, అంతే కాకుండా… గెలుపు గుర్రాలను తాజా మాజీ మంత్రులనుంచి కూడా ఎంపికచేసే ఆలోచన వై ఎస్ జగన్ కు ఉండవచ్చని వారు అంటున్నారు. గత మంత్రి వర్గంలో పనిచేసిన వారి పనితీరు కారణంగా ప్రభుత్వ ప్రతిష్ఠ పెరిగిందా, తరిగిందా అనే అంశాల్ని దృష్టిలో పెట్టుకొని అర్హులైన వారికి పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని కూడా పరిశీలకుల అంచనా.

ఓటు బ్యాంకు…. మంత్రి వర్గం కోటా

ఇక కొత్త మంత్రివర్గం   విషయానికి వస్తే…ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పెద్ద పీట వేయడం ఆశ్చర్యం కలిగించలేదు. గతంలో కంటే ఎక్కువగా  ఒకరిద్దరు మంత్రుల్ని ఆయా వర్గాలనుంచి తీసుకొని వై ఎస్ జగన్ తన ఓటు బ్యాంకు వాళ్ళే అనే బలమైన సంకేతాన్ని ఇచ్చారు. 70 శాతం పైగా ఆయా వర్గాలకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే చాలు వాళ్ళే తనను మళ్ళీ అధికారంలోకి తీసుకువస్తారని ఆయన పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ఇదే పంథాలో నడిచింది. ఎన్టీఆర్ హయాంలో అగ్రేతర వర్గాలకు ..ముఖ్యంగా బీసీ లకు రాజకీయ అవకాశాలు కల్పించడం అప్పట్లో ఒక సాహసోపేత నిర్ణయం. అటువంటి మార్గాన్నే గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అనుసరించారు.

అంటే … రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న వర్గాలను మచ్చిక చేసుకునే ఒక రాజకీయ క్రీడగా దీన్ని అర్థం చేసుకోవాలని రాజకీయ విమర్శకులు అంటున్నారు.  తరాలు మారుతున్నా తమను కేవలం ఓటు బ్యాంకు గానే గుర్తిస్తున్నారు కానీ రాజ్యాధికారం చేతికి రావడం లేదని అక్కడక్కడ అసంతృప్తి కనిపించినా ఏదో ఒక రకంగా వారిని శాంతింప చేయడం రాజకీయ పార్టీల అధినేతలకు వెన్నతో పెట్టిన విద్య. విభజించి. ఆనాటి ఆంగ్లేయులు నేర్పిన  విభజించి  పాలించు సూత్రాన్ని ఇప్పటికీ  మన నేతలు తూచ తప్పకుండా పాటించడం మన రాజకీయాలకు పట్టిన చీడ.

ఏది ఏమైనా 2024 ఎన్నికలు వై ఎస్ ఆర్ సీ పీ అలాగే రాష్ట్ర భవితను శాసిస్తాయి. ” దేవుని దయ వల్ల” ఇప్పటికైనా ప్రతి పక్షాలు బలమేదో , వాపు ఏదో గ్రహించి పావులు కదిపితే తప్ప వై ఎస్ జగన్ కు అధికారం దూరం చేయడం అసాధ్యం అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

” ప్రజాస్వామ్యం పునాదులు గట్టిగా ఉండాలంటే… అధికార, ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా, గుణాత్మకమైన ఆలోచనతో వ్యవహరించడం అవసరం.”

పొలమరశెట్టి కృష్ణారావు, రాజకీయ సామాజిక విశ్లేషకుడు

Related posts

తిరుచానూరు లో దర్శన ఏర్పాట్ల పర్యవేక్షణ

Satyam NEWS

సానుకూల స్పందనతో పరుపు నిలుపుకున్న కాంగ్రెస్

Satyam NEWS

వనపర్తిలో జీరో కరంటు బిల్ ప్రారంభం

Satyam NEWS

Leave a Comment