34.2 C
Hyderabad
May 10, 2024 12: 37 PM
Slider సంపాదకీయం

మళ్లీ కోర్టులపై వ్యాఖ్యలు….: దేనికి సంకేతం?

cm jagan

న్యాయమూర్తులపై దారుణ వ్యాఖ్యలు చేసిన కేసులో ఇంకా విచారణ జరుగుతూనే ఉన్నది. ఇప్పటికే కొందరిని అరెస్టు చేయగా మరి కొందరిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీబీఐ అధికారులు ఈ కేసులను త్వరితగతిన ఒక కొలిక్కి తీసుకురావాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

ఈ సమయంలో కూడా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు న్యాయస్థానాలపై దారుణమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిన ప్రతి సారీ న్యాయమూర్తులను విమర్శించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలవాటైపోయింది.

అమరావతిని రాజధానిగా కొనసాగించడంపై వేసిన కేసుల్లో తుది తీర్పును చెబుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు జగన్ ప్రభుత్వానికి శరాఘాతంగా మారింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్లీ న్యాయ స్థానాలపై విరుచుకుపడ్డారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి రాష్ట్ర హైకోర్టుపై తీవ్రమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు అవసరమైన అంశాలను కోర్టులు టేబుల్ మీదకు తీసుకోవడం లేదని ఆయన నేరుగా న్యాయస్థానాలను విమర్శించారు.

తమకు అవసరమైన అంశాలపైనే కోర్టు పరిగణలోకి తీసుకుంటుందని కూడా ఆయన న్యాయస్థానాన్ని తీవ్రంగా విమర్శించారు. న్యాయ వ్యవస్థ , శాసన వ్యవస్థ లలో ఎవరు గొప్పా..? అనేది కూడా తేల్చాలని ఆయన అంటున్నారు. న్యాయ వ్యవస్థ నిద్ర పోతుందా…? అంటూ ఆయన ప్రశ్నలు గుప్పించారు.

రాష్ట్ర విభజన పై వేసిన పిటిషన్ లపై ఎందుకు వాదనలు జరగడం లేదు? అసెంబ్లీ లో చేసిన తీర్మానాలు చెల్లవని కోర్టులు చెప్పడం ఏంటి? మేం మాత్రం మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థను కించపరుస్తూ ఆ పార్టీకి చెందిన ఎంపిలు మాజీ ఎమ్మెల్యేలు కూడా మోదుగుల వేణుగోపాల రెడ్డి తరహాలోనే గతంలో న్యాయస్థానాలపై వ్యాఖ్యలు చేశారు.

ఏ రాజ్యాంగ వ్యవస్థ అయినా సరే తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చినా, చర్యలు తీసుకున్నా కూడా అతి తీవ్రంగా రియాక్ట్ కావడం జగన్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. అనుకూలమైన తీర్పు వచ్చినప్పుడు న్యాయం తమ వైపు ఉంది అంటూ మంత్రులు కూడా ప్రతిస్పందన తెలుపుతుంటారు.

అదే సమయంలో వ్యతిరేక తీర్పులు వచ్చినపుడు ‘‘ఎవరో వెనక ఉండి నడిపిస్తున్నారు’’ అంటూ వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ఒక్క కోర్టుల విషయంలోనే కాదు వివేకానందరెడ్డి మర్డర్ కేసులో సీబీఐ పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇదే విధంగా ప్రతికూలంగా ప్రతిస్పందించారు.

ఆ మర్డర్ కేసు దర్యాప్తు చేసిన సీబీఐ అధికారిపైనే కేసు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర ను సృష్టించింది. తమకు వ్యతిరేకంగా కోర్టు తీర్పులు ఎందుకు వస్తున్నాయి? అనే ప్రశ్న వేసుకుని చట్టాలకు, న్యాయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే ఈ పరిస్థితి రాదు. ఆ పని చేయకుండా న్యాయస్థానాలను ఇతర రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను విమర్శిస్తూ పోతే దీనికి పరిష్కారం దొరకదు.

ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఏ రాజ్యాంగ వ్యవస్థకు నిర్దేశించిన బాధ్యతలను ఆ రాజ్యాంగ వ్యవస్థలు నిర్వర్తిస్తూనే ఉంటాయి. వాటికి అనుగుణంగా పాలన సాగాలి తప్ప ‘‘మా నిర్ణయాలను ప్రశ్నించడానికి వారెవరు?’’ అనే ప్రశ్న వేయకూడదు. ఇలాంటి ప్రశ్న వేస్తే అదే ప్రశ్న రాష్ట్రంలో అధికారంలో ఉన్నవారికి కూడా వర్తిస్తుంది.   

Related posts

స్వీయ నిర్బంధమే కరోనా కు నివారణకు మార్గం

Satyam NEWS

సినిమా సౌథానికి “శంకుస్థాపన” చేసిన అశోకచక్ర మూవీస్

Bhavani

కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్‌లో నోడల్‌ అధికారిపై ఎమ్మెల్యే అనంత ఆగ్రహం

Satyam NEWS

Leave a Comment