23.2 C
Hyderabad
May 7, 2024 19: 39 PM
Slider ప్రత్యేకం

ఒపీనియన్: అరక పట్టిన నీకు అందలమెప్పుడు రైతన్నా

#AgricultureInIndia

కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడి చానా… బుగ్గమీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా.. నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే..  వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో… అంటాడు అప్పుడెప్పుడో, ఆత్రేయ. చలువరాతి మందిరాల్లో తిరిగేవారికి పల్లెరైతు కష్టాలు ఏం తెలుస్తాయి?

కర్షకుడి కష్టాలు రావణ కాష్టంలా కాలుతూనే ఉన్నాయి. తరాలు మారినా  తీరు మారలేదు. ఈరోజు మనం తినే ప్రతి ఆహరం రైతు పండించిందే. మనం బతికిబట్టగట్టి షోకేసుల్లో బొమ్మల్లా ఉన్నామంటే, అది రైతు చలువే. అన్నదాత అని పెద్ద పేరు పెట్టి పిలుస్తాం.

ఒక వైపు ప్రకృతి కోపం మరో వైపు ప్రభుత్వ శాపం

అర్ధాకలి బతుకులు బతుకుతుంది ఆ అన్నదాతలే. ప్రకృతి కోపానికి, ప్రభుత్వాల అనాదరణకు, దళారీల దుర్మార్గానికి బలిపశువుగా మిగిలిపోతోంది ఆ అర్భక రైతే. రైతు రాజుగా ఎప్పుడూ లేడు. రైతు ఎప్పుడూ పేదగానే మిగిలిపోతున్నాడు. ఎవరో వందల ఎకరాల ఆసాములు కొందరు తప్ప, ఎందరో చిన్నకారు, సన్నకారు, కౌలురైతులే దుక్కి దున్ని పొలం పండిస్తున్నారు.

పంటకు గిట్టుబాటు ధర ఎప్పుడూ లభించడం లేదు. ఇప్పుడు కొత్తగా,  కరోనా రూపంలో మరో విపత్తు వచ్చిపడి రైతును చిత్తు చేస్తోంది. మామూలుగా పడుతున్న కష్టాలు, ఎప్పటి నుండో పరిష్కారంకాని సమస్యలు, కరోనా ప్రభావంతో పెరిగిన ఇబ్బందులు అన్నింటినీ దృష్టిలో  పెట్టుకొని, ప్రభుత్వాలు రైతాంగంపై ప్రత్యేక ప్రేమ చూపించాలి.

సాయం లేకపోతే వ్యవసాయం చేయలేడు

రాయితీలు, ప్రయోజనాలు, ఆర్ధికసహాయాలు, తోడ్పాట్లు అందిస్తేకానీ ఈ సంవత్సరం రైతు గట్టెక్కడు. లాక్ డౌన్ వల్ల రవాణా స్థంభన,  మార్కెట్ యార్డులు పనిచెయ్యకపోవడంతో పండించిన పంటలు అమ్ముకోలేని పరిస్థితులు వచ్చాయి. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కొంత వెసులుబాటు వచ్చినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఎప్పుడూ వచ్చినట్లుగానే అకాల వర్షాలు ఈ ఏడు వచ్చేశాయి. దీనికి కరోనా కష్టాలు కూడా తోడయ్యాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతులకు ఋణాల చెల్లింపుల విషయంలో బ్యాంకుల నుండి వెసులుబాటు కల్పించే   విధంగా ప్రభుత్వాలు కలుగజేసుకోవాలి.

సిఫార్సుల్లోనే మిగిలిపోయిన మద్దతు ధర

స్వామినాథన్ సూచించిన మద్దతు ధర అంశం ఇప్పటికీ చర్చనీయాంశంగానే మిగిలిపోయింది. రైతు పెట్టుబడికి రెట్టింపు ఇవ్వాలన్నది స్వామినాధన్ చేసిన సిఫార్సు. ఇది కొంతవరకూ జరుగుతోంది కానీ, పూర్తిగా జరగడంలేదు. ఉదాహరణకు రైతు పెట్టుబడిని లెక్కవేసినప్పుడు, ఆ రైతు కుటుంబ వేతనాన్ని కొన్ని రాష్ట్రాలు కలుపుకోవడం లేదు.

ఇది కూడా కలుపుకుంటే కానీ ఆ రైతుకు గిట్టుబాటు ధర  లభించదు. మన దేశంలో 30- 40 శాతం వరకూ కౌలు రైతులే ఉన్నారు. ప్రభుత్వం నుండి వచ్చే ఆర్ధిక సహాయం వారికి అందడం లేదు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు యజమానులనే పరిగణలోకి తీసుకుంటున్నాయి.

కౌలు రైతు లను తీసుకోవడం లేదు.రైతు ఆత్మహత్యల్లో 80శాతం కౌలు రైతులే ఉంటున్నారు. మద్దతు ధర నిర్ణయించడంలోనూ, ఆర్ధిక సహకారం అందించడంలోనూ రాష్ట్రాలన్నీ ఏకరీతిని పాటించాలి.ఇందిరాగాంధీ కాలం నుండీ కేంద్ర ప్రభుత్వాలు రైతును చిన్నచూపు చూస్తున్నాయనే చెప్పాలి.

పట్టణీకరణపై ఇకనైనా మోజు తగ్గేనా?

కరోనా కల్పించిన పరిస్థితులు వల్ల భవిష్యత్తులో ఎక్కువమంది పల్లెసీమలకు తిరిగి  చేరే పరిణామాలు  ఉంటాయి. వలస కార్మికులు కూడా ఎక్కువమంది పల్లెలకే పరిమితం అవుతారు. పట్టణీకరణ తగ్గుముఖం పట్టి, గ్రామవాసాలు పెరుగుతాయనే భావించాలి. ఈ క్రమంలో వ్యవసాయం ప్రధాన పాత్ర పోషించనుంది.

వ్యవసాయం దండగమారి పని కాదు, చాలా లాభసాటి రంగం అనే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. పట్టణీకరణ నుండి గ్రామీకరణ వైపు ప్రభుత్వాలు, ప్రజలు దృష్టి సారించాలి. అటు ఆహార ఉత్పత్తి, వ్యవసాయ ఆర్ధిక ప్రగతి, ఇటు ఉపాధి పెద్ద ఎత్తున పెరుగుతుంది.

ప్రాణాలు హరిస్తున్న కల్తీ, కాలుష్యం

లాక్ డౌన్, కరోనా ప్రభావంతో కుదేలైన రంగాలు వ్యవసాయం వైపు మళ్లే అవకాశాలు ఎక్కువ గా కనిపిస్తున్నాయి. ఈరోజు మన ఆరోగ్యాలు దెబ్బతిని, రోగ నిరోధక శక్తి తగ్గి, కొత్త కొత్త వ్యాధుల బారిన పాడటానికి కారణాలు (1) కల్తీ ఆహారం (2) కాలుష్య వాతావరణం (3) శారీరక శ్రమ లేకపోవడం (4) ఉరుకు పరుగుల జీవితాల వల్ల వచ్చిన ఒత్తిళ్లు. ప్రజలు పల్లెల్లో ఎక్కువకాలం ఉన్నంతకాలం ఇటువంటి  అనారోగ్య పరిస్థితులు మనిషిని  దరిచేరలేదు.

డబ్బుజబ్బు, దళారీల పెత్తనం, పాశ్చాత్య పోకడల దుష్ప్రభావం మొదలైనవి  మన వ్యవసాయ రంగాన్ని చాలావరకు కలుషితం చేశాయి. ప్రకృతి వ్యవసాయ విధానానికి దూరమయ్యాం. కాలుష్య కాసారాల వంటి మందులతో పంటలు పండించుకుంటూ వచ్చాం. ఆ ఆహారాన్నే తీసుకుంటున్నాం.

అదే, నేటి అనారోగ్య భారతానికి మూలమై నిలిచింది. ఇప్పుడిప్పుడే అక్కడక్కడా, కొందరు ప్రకృతి వ్యవసాయం వైపు ఆకర్షితులై, ఆ మార్గంలో పండించడం ప్రారంభించారు. అది ఖరీదైన విధంగా ఉంటోందని చెబుతున్నారు. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేసి అనుకూల పరిస్థితులు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సమగ్ర వ్యవసాయ విధానం అత్యావశ్యకం

ఏ నేలలో, ఏ సీజన్ లో, ఏ ప్రాంతంలో ఏవేవి బాగా పండుతాయో, వాటిపై దృష్టి పెట్టే వ్యవస్థలపై ప్రభుత్వాల కృషి పెరగాలి. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఎక్కువగా ఉన్నవి, ఎక్కువ లాభాలు తెచ్చి పెట్టేవి, తక్కువ ఖర్చుతో చెయ్యగలిగిన అంశాలను పరిగణలోకి తీసుకొని సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించాలి.

నగరీకరణ,  పట్టణీకరణ, గ్రామీకరణపై విస్తృత అధ్యయనాలు, పరిశోధనలు చేస్తూ వ్యవసాయానికి పెద్దపీట వెయ్యాలి. రైతుల సమస్యలకు ఇకనైనా సంపూర్ణ పరిష్కారాలు కనిపెట్టాలి. రైతుకంట కన్నీరు రాకుండా చూడాలి. వ్యవసాయం గొప్ప ఆకర్షణీయ రంగంగా ప్రభుత్వాలు తీర్చిదిద్దాలి. అప్పుడు దేశం సస్యశ్యామలం అవుతుంది.

వ్యవసాయం ఒక్కటే దేశాన్ని కాపాడేది

నదుల అనుసంధానం, అవసరాల మేరకు ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టాలి. అనుకున్న సమయంలోనే ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలి. వ్యవసాయం ఎంత అభివృద్ధి చెందితే దేశం అంత ప్రగతి సాధిస్తుంది. భారతదేశపు సంస్కృతి, వైభవం  మూలాలు పల్లెల్లోనే ఉన్నాయి.

ఇటు వ్యవసాయం, అటు గ్రామీణభారతంపై ఇకనుండైనా ప్రభుత్వాల దృష్టి పెరగాలి. ప్రజల ఆలోచనా విధానం కూడా మారాలి. అప్పుడే ఆరోగ్యభారత నిర్మాణం జరుగుతుంది. మన జీవన విధానంలో మార్పులు వస్తే, పదివేల కరోనాలు కూడా మనిషిని ఏమీ చేయలేవు.

మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

వడదెబ్బ తగులుతుంది అప్రమత్తంగా ఉండండి

Satyam NEWS

హెల్ప్ లైన్ :తల్లీకొడుకుల ప్రాణాలు కాపాడిన డయల్‌ 100

Satyam NEWS

బాలలు ఉత్తమ పౌరులుగా ఎదగాలి

Bhavani

Leave a Comment