31.7 C
Hyderabad
May 2, 2024 09: 28 AM
Slider జాతీయం

Analysis: రూపాయీ, ఇక లే, కరోనాను వదిలించుకో

#UnlockStarts1

కరోనా వచ్చినప్పటి నుండీ దేశంలో లాక్ డౌన్ ప్రకటించారు. కొన్ని నెలలపాటు సంపూర్ణ లాక్ డౌన్ విధించారు. గడచిన కొన్ని నెలల నుండీ నిబంధనలు సడలిస్తూ, అన్ లాక్ ప్రక్రియ చేపట్టారు. తాజాగా అన్ లాక్ -3 ప్రకటించారు. దీనికి ముందుగా,  ప్రజా రవాణా, ప్రజల రాకపోకలపై రాష్ట్రాల మధ్య ఎటువంటి ఆంక్షలు విధించ వద్దని కేంద్ర హోమ్ సెక్రటరీ అజయ్ భల్లా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చారు.

అన్ లాక్-3లో భాగంగా మూతపడిన సినిమా థియేటర్లు తిరిగి తెరవవచ్చు. సినిమా, టీవీ షూటింగులు చేసుకోవచ్చు. లాక్ డౌన్ నిబంధనలను  సడలించడం అనివార్యం. దురదృష్టవశాత్తు సడలింపులు ప్రారంభమైన నాటి నుండి కరోనా వ్యాప్తి తీవ్రంగా పెరిగింది.

కరోనా వస్తున్నది…. కానీ కోలుకుంటున్నారు

రోజుకు 3వేల కేసులు నమోదయ్యే దశ నుండి సుమారు 70వేల కేసులకు వ్యాప్తి తీవ్రత పెరిగింది. మరణాలు కూడా బాగా పెరిగాయి. సామాన్యుడి నుండి సెలెబ్రిటీల వరకూ కరోనా బారిన పడుతున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఇంకా కోమా నుండి బయటకు రాలేదు.

ఈ మధ్య కాలంలో  కొంతమంది సినిమా నటులు, కళాకారులు, జర్నలిస్టులు కూడా కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఎందరో కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారు. భారతీయ సినిమా దిగ్గజం అమితాబ్ బచ్చన్ కుటుంబ సభ్యులు కరోనాకు గురయ్యారు.

అమితాబ్ కోలుకొని బయటకు వచ్చి, జాగ్రత్తలు పాటిస్తున్నారు. అదే విధంగా, కేంద్రమంత్రులు, అధికారులు, నాయకులకు  కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ కు కూడా కరోనా సోకింది.

వ్యాక్సిన్ ఎప్పుడు వస్తున్నదో ఏమిటో

ఇలా, కరోనా సోకిన వారి జాబితా చాలా పెద్దది. కరోనాను జయించినవారు చాలామంది ఉన్నారు. ఎందరికో కరోనా నిశ్శబ్దంగా  వచ్చి, వెళ్ళిపోయిందనే సమాచారం కూడా వింటున్నాం. పరీక్షలు పూర్తిస్థాయిలో అందరికీ చేస్తే, చాలామందికి కరోనా ఉంటుందనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి.

వ్యాక్సిన్ రావడానికి ఇంకా కొన్ని నెలల సమయం పడుతుంది. ఇదమిద్ధంగా, ఏ రోజుకు అందుబాటులోకి వస్తుందో, ఎవ్వరూ చెప్పలేని పరిస్థితుల్లోనే కరోనా వ్యాక్సిన్ వుంది. కరోనా వల్ల, లాక్ డౌన్ నిబంధనల  వల్ల ఎన్నో రంగాలు స్థంభించి పోయాయి.

ఆంక్షలు ఎత్తివేస్తే పుంజుకునే ఆర్ధికం

సడలింపుల తర్వాత, కొన్ని రంగాల కార్యకలాపాలు ప్రారంభమైనా, నత్తనడకలోనే ఉన్నాయి. నిజంగా, రాష్ట్రాల మధ్య రాకపోకలకు కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేసి, చాలాకాలమైంది. కానీ,వ్యాప్తి భయంతో చాలా రాష్ట్రప్రభుత్వాలు ఆంక్షలు కొనసాగించాయి. ప్రజల రాకపోకలు చాలా వరకూ స్థంభించాయి.

పోలీస్ అనుమతులతోనే ప్రయాణాలు చేయాలనే ఆంక్షలే కొనసాగాయి. వీటన్నిటి నేపథ్యంలో, కేంద్రప్రభుత్వం తాజాగా,  ఆంక్షలు ఎత్తివేయమని, ప్రజలకు స్వేచ్ఛగా తిరిగే వెసులుబాటు కల్పించమని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలు ఏ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాటిస్తాయన్నది అనుమానమే.

ఆకలితో ఉన్న కళాకారులు

రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు ఎత్తివేయడమే సరియైన చర్య. ఈ నిబంధనలతో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. చాలా రంగాల కార్యకలాపాలు వేగం పుంజుకోకపోవడానికి ఈ ఆంక్షలు కూడా ముఖ్యమైన కారణమే. సినిమా, టీవీ పరిశ్రమ వినోదరంగానికి చెందినదయినా, ఎంతోమంది జీవనోపాధి ముడిపడి వుంది.

సాంకేతిక సిబ్బంది, చిన్న కళాకారులు చాలా చాలా కష్టాలు పడుతున్నారు. డబ్బులు సంపాయించుకుని, ఆర్ధికంగా స్థిరపడినవారి సంఖ్య చాలా తక్కువ. ఎక్కువ మందికి రెక్కాడితే కానీ డొక్కాడదు. ఎంతోమంది ఆకలి చావులకు బలి అవుతున్నారు. రోగాలబారిన పడి, నరకయాతన అనుభవిస్తున్నారు. థియేటర్లు మూతపడడంతో, అక్కడ పనిచేసే వేలాది సిబ్బంది కఠోరమైన కష్టాలు అనుభవిస్తున్నారు.

సవాళ్లు ఎన్నో ఉన్నాయి

థియేటర్లు తెరవడం, షూటింగులు తిరిగి ప్రారంభమవ్వడం కొంత ఊరట ఇచ్చే అంశం. ఈ రంగంలో వ్యాపారం, వినోదంతో పాటు ఎంతో ఉపాధి కూడా దాగి ఉందన్నది వాస్తవం. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, థియేటర్లు నడపడం, షూటింగులు చెయ్యడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు.

ఇది అతిపెద్ద సవాల్. నిబంధనలు పాటిస్తూనే, కార్యకలాపాలు సాగించినా, కరోనా బారిన పడకుండా చేయడమనేది చాలా కష్టమైన అంశం. ఆచరణలోనే ఇది అర్ధమవుతుంది. వ్యాధికి -జీవనోపాధికి జరుగుతున్న ఈ పోరాటంలో, ఎవ్వరికీ ఎటువంటి కష్ట నష్టాలు రాకుండా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

రాష్ట్ర ప్రభుత్వాలు సాధ్యాసాధ్యాలతో పాటు,  ప్రజల అవసరాలను గుర్తెరిగి ప్రవర్తించడం వివేకం. ప్రజారంగం, కళారంగం త్వరలో కళకళలాడాలని అభిలషిద్దాం. అదే సమయంలో,  థియేటర్లకు వెళ్లేవారు, ప్రయాణాలు చేసేవారు  ఎంతో జాగ్రత్తగా, బాధ్యతగా ప్రవర్తించాలని  కోరుకుందాం.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి కృషి చేస్తా

Satyam NEWS

బెజవాడ వైసీపీకి మరో షాక్..

Satyam NEWS

నెవర్ కంప్రమైస్:ఆంధ్రలో తిరగాలంటే వీసా కావాలా

Satyam NEWS

Leave a Comment