38.2 C
Hyderabad
May 5, 2024 19: 54 PM
Slider ప్రత్యేకం

మాట తప్ప సాయం చేయని ప్రధాని మోడీ

pm-modi-11

భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చారు. వెళ్ళారు. అయితే ప్రధాని పర్యటన వల్ల ఇటు తెలంగాణకు గానీ,అటు ఆంధ్ర ప్రదేశ్ కు గానీ కొత్తగా ఒనగూరే ప్రయోజనం ఏమైనా ఉంటుందేమోనని ఆశించిన వారికి ఆశాభంగం మిగిలింది.

భారతీయ జనతాపార్టీ అట్టహాసంగా హైదరాబాద్ లో నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజల మద్దతు పొందడానికి కీలక ప్రకటన  చేస్తారని రాజకీయ పరిశీలకులు భావించారు. కానీ..ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ సమాజానికి మేలు చేయగల ప్రకటన ఏమీ చేయలేదు.

కేసీఆర్ పై కాలు దువ్విన కేంద్ర మంత్రులు

అంతే కాదు.. తెలంగాణ రాష్ట్ర సమితి, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు పేర్లను కూడా తన ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు.  విజయ సంకల్ప సభలో పాల్గొని ప్రసంగించిన ప్రముఖులు దాదాపు ప్రతి ఒక్కరూ తెరాస ముఖ్యమంత్రిపై, ఆయన పాలనా తీరుపై తీవ్ర పదజాలంతో విమర్శలు ఎక్కుపెట్టారు.

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తన ప్రసంగంలో తెలంగాణ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు పెట్టినా వచ్చేది కమలం సర్కారే అని ధీమా వ్యక్తంచేశారు. ఎనిమిదేళ్ళుగా  అధికారంలో ఉన్నా కేసీఆర్ తెలంగాణ సమాజం ఆశించిన నీళ్ళు,నిధులు,నియామకాల విషయంలో ఇచ్చిన హామీలు నేటికీ నెరవేరలేదని ఆయన అన్నారు.

కొడుకును అందలమెక్కించేందుకే కేసీఆర్ పాట్లు

మజ్లిస్ వైపు మొగ్గు చూపుతూ తన కొడుకును ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలనే ఏకైక లక్ష్యం కేసీఆర్ ది అని హోమ్ మంత్రి విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షను బీజేపీ సమర్థించినట్లు ఆయన తెలిపారు. 2014 లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని గ్రహించి, ఎన్నో ఏళ్ళుగా పెండింగ్ లో ఉంచిన కాంగ్రెస్.. వివాదాలు,విభేదాలు సృష్టించి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ను విభజించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసినట్లు ఆయన కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు.

తెరాస పార్టీ గుర్తు కారు అయినా స్టీరింగ్ మాత్రం ఓవైసీ చేతిలోనే ఉందని అమిత్ షా ఎద్దేవాచేశారు. కేవలం ఓవైసీ కి భయపడే తెలంగాణ విమోచన దినం నిర్వహించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇదే సభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, రాష్ట్రంలో చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరుగుతోందని, ఓ పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయాన్ని ఒక్కసారిగా రూ.40 వేల కోట్లు నుంచి రూ.లక్షా 30 వేల కోట్లకు పెంచారని గోయెల్ ఆరోపించారు.

ఈ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్ళిందో సీఎం కేసీఆర్,మంత్రులు, ఎమ్మెల్ల్యేలు సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని,అవినీతి, కుటుంబ పాలన పట్ల విసిగి పోయారని కేంద్ర మంత్రి అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బిజెపి కి పట్టం కట్టడానికి తెలంగాణకు చెందిన అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

కమలం వికసించాలి…కష్టం తీరాలి

ప్రధాని నరేంద్ర మోదీ మార్గ దర్శకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కమలం వికసిస్తుంది అని ఉత్తర ప్రదేశ్ ముఖ్య మంత్రి యోగి ఆదిత్య నాథ్ దాస్ అన్నారు. విజయ సంకల్ప సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా తన ప్రసంగంలో తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ కోరుకుంటున్నారని అన్నారు.2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ రాజకీయ వాతావరణానికి, ప్రస్తుత వాతావరణానికి ఎంతో తేడా ఉన్నట్లు ఆయన తెలిపారు.

ప్రధాన మంత్రి ప్రకటించిన పథకాలు ఏవీ  తెలంగాణ లో అమకుకావడం లేదని నడ్డా స్పష్టంచేశారు.కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తున్నా కేసీఆర్ అసమర్థ పాలన ఫలితంగా తెలంగాణ రూ.4 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని ఆయన తీవ్రంగా విమర్శించారు.ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని బీజేపీని గెలిపించేందుకు తెలంగాణ ఎదురుచూస్తోంది అని పార్టీ జాతీయ అధ్యక్షుడు అన్నారు.

ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం తన ప్రసంగంలో  తెలంగాణ సమగ్ర అభివృద్ధికోసం నిర్విరామ కృషి చేస్తున్నట్లు వివరించారు. 2019 నుంచి తెలంగాణ లో బీజెపీ బలపడుతోందని, పార్టీ యంత్రాంగం కృషి ప్రతి విజయంలో కనిపించిందని అన్నారు. దేశ ఆత్మ నిర్భరత, ఆత్మ విశ్వాసానికి హైదరాబాద్ ముఖ్య కేంద్రం అని, తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని రైతులు, యువత వద్ద దేశానికి, ప్రపంచానికి ఉపయోగ పడే సామర్థ్యం ఉందని ప్రశంసించారు.

మారుమూల గిరిజనులకు సైతం అభివృద్ధి ఫలాలు

తెలంగాణ లోని ప్రతి దళిత,గిరిజన, వెనుకబడిన వర్గాల కుటుంబాలకు బీజేపే ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు దక్కినట్లు ప్రధాని తెలిపారు. ఆత్మ నిర్భర్ లో భాగంగా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని రూ.6,500 కోట్లతో పునరుద్ధరణ కు వ్యయం చేసినట్లు ఆయన చెప్పారు. అలాగే.. తెలంగాణ లో రూ.35 వేల కోట్లతో ఐదు పెద్ద సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ప్రధాని సభకు వివరించారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల మోదీ తన ప్రభుత్వానికి ఉన్న కార్యాచరణ పై దృష్టి సారించినట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.కానీ..ఎంతో కాలంగా కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న అనేక ఆర్థిక,సాంకేతిక విషయాలపై ఎటువంటి ప్రకటన చేయక పోవడం రాజకీయ ఎత్తుగడగా వారు అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన కాలంనాటి సమస్యల పరిష్కారం కోసం ఎటువంటి సంకేతం ఇవ్వక పోవడం ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ చతురత అని వారు అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా గెలుపు బీజెపే దే నని ప్రధాని, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు , హోమ్ మంత్రి తో సహా విజయ సంకల్ప సభలో మాట్లాడిన ప్రతి ఒక్కరూ ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఎన్నికలకు ముందు తెలంగాణ కు వరాలు ఇచ్చేందుకు కేంద్రం ఆచి తూచి అడుగులు వేస్తోంది.దక్షిణ భారత దేశంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అనుకూల పవనాలు వీస్తున్నాయనే ఉద్దేశంతోనే హైదారాబాద్ లో విజయ సంకల్ప సభను నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఈ సభకు ముందు అధికార తెరాస సంధించిన అనేక ప్రశ్నలకు బీజేపీ నుంచి కనీస స్పందన కూడా లేదు. కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి ప్రధాన అంశాలుగా మొత్తం భాజపా జాతీయ కార్యవర్గ సమావేశం జరిగినట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జాతీయ స్థాయిలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశం కేవలం తెలంగాణ అంశానికే పరిమితం కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఏపీలోనూ ఇదే తీరు

అటు..ఆంధ్రప్రదేశ్ పర్యటన అధికారికంగా జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమం కావడంతో రాజకీయ ప్రస్తావనలు ఏమీ లేకుండానే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సాగిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలలో కాషాయ దళం పాగా వేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయి అనుకూల వాతావరణం ఉన్నట్లు భాజపా జాతీయ స్థాయి నాయకులు అంచనాకు వచ్చారు. ఇటీవల తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ కేంద్రానికి, ప్రధాని నరేంద్ర మోదీ కి వ్యతిరేకంగా చేస్తున్న ప్రసంగాలు, వ్యాఖ్యలు భాజపా పార్టీలో వేడి పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం జరుగనున్న  రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా కేసీఆర్ వైఖరిపై కేంద్రం గుర్రుగా ఉంది. దమ్ముంటే తనను జైల్లో పెట్టమని తెరాస అధినేత కేంద్ర ప్రభుత్వానికి సవాల్ చేయడంతో బీజేపీ జాతీయ నాయకత్వం తుపాన్ ముందు వచ్చే ప్రశాంతం లా నిరీక్షిస్తోంది.

ఏదో ఒక రోజు..కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయం లో లెక్కలు తేల్చాలని ముఖ్య మంత్రి కేసీఆర్, ఆయన మంత్రి వర్గంపై ఒత్తిడి చేసే ఆలోచనలో ఉన్నట్లు, అందుకు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ఈ డీ లకు, సీ ఐ డి లకు బెదిరేది లేదని కేసీఆర్ ధీమాగా ఉన్నారు. తెలంగాణలో భాజపా క్షేత్ర స్థాయిలో వేళ్ళూ నుకోవడానికి ఎటువంటి ఎత్తుగడలు వేస్తుందనేది కాలమే నిర్ణయిస్తుంది.

టీ.కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు తెరాస, భాజపా ల మధ్య ఉన్న అనైతిక పొత్తు కారణం గానే కేంద్రం కేసీఆర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకంజవేస్తోంది అని వినిపిస్తున్న మాటకు మోదీ ప్రభుత్వం ఏ విధమైన సమాధానం ఇస్తుందో వేచి చూడాలి. మొత్తానికి ప్రధాని నరేంద్ర మోదీ రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చారు.వెళ్ళారు. కానీ ఏ రాష్ట్రానికీ ఆశించిన వరాలు ఇవ్వకుండానే  వెనుతిరిగారు.

పొలమరశెట్టి కృష్ణారావు, రాజకీయ, సామాజిక విశ్లేషకుడు

Related posts

మంత్రి అల్లోలకు బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవీ ప్రసాదం

Satyam NEWS

డబుల్ ఇంటి దరఖాస్తుదారులకు సవరణ ఛాన్సు

Satyam NEWS

మహా మంత్రి నవాబ్ మాలిక్ పై డిఫమేషన్ కేసు

Sub Editor

Leave a Comment