29.7 C
Hyderabad
May 6, 2024 06: 20 AM
Slider సంపాదకీయం

వారిద్దరిని కలిపింది జగన్ రాజకీయ అపరిపక్వతే

#chandrababu

భారతీయ జనతా పార్టీ మిత్రపక్షమైన జనసేన అధినేత నేడు తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. రెండో సారి వీరిద్దరూ కలవడంతో ఒక్క సారిగా అధికార వైసీపీలో కలకల రేగింది. వీరిద్దరి భేటీ అత్యంత గోప్యంగా ఉంచి ఆఖరు నిమిషంలో వెల్లడించారు. ఇద్దరు నాయకులు గతంలో ఒక సారి సమావేశమయ్యారు. విశాఖపట్నంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను పోలీసులు అడ్డుకున్నప్పుడు చంద్రబాబునాయుడు ఆయనను పరామర్శించారు.

తాజాగా కుప్పంలో చంద్రబాబునాయుడిని పోలీసులు అడ్డుకోవడంతో చంద్రబాబునాయుడిని పవన్ కల్యాణ్ కలిశారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీకి రాజకీయంగా తదితర విషయాల్లోనూ సహకరిస్తున్నదనేది బహిరంగ రహస్యం. రాష్ట్రంలో ప్రతిపక్షాలను అణచివేసేందుకు నిర్దేశించిన జీవో నెంబర్ వన్ ను కూడా బీజేపీ సపోర్టు చేసింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు జీవో జారీ చేయాల్సిందేనని గట్టిగా చెప్పారు.

అదే జీవోకు వ్యతిరేకంగా చర్చించేందుకు బీజేపీ మిత్ర పక్షమైన జనసేన పార్టీ అధినేత నేడు తెలుగుదేశం పార్టీ అధినేతను కలిశారు. ఆ ప్రజావ్యతిరేక జీవోపై పోరాటం చేయాల్సిందేనని జనసేన తెలుగుదేశం పార్టీలు కలిసి నిర్ణయించాయి. ఈ ఇద్దరు నాయకులు కలవకూడదని అధికార వైసీపీ ముక్కోటి దేవతలను ప్రార్ధిస్తున్నది. ఈ రెండు పార్టీలు కలవకూడదని బీజేపీలోని కొందరు వైసీపీ అనుకూల నాయకులు కూడా దేవుళ్లను ప్రార్థించారు.

తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిస్తే ఏం జరుగుతుందో వైసీపీ నాయకులకు బాగా తెలుసు. వైసీపీ నాయకులకే కాకుండా వైసీపీ రెండో సారి అధికారంలోకి రావాలని కోరుకుంటున్న బీజేపీ నాయకులకు కూడా చంద్రబాబు, పవన్ కలయిక రుచించదు. ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాలలో బీజేపీ ఎదగడం లేదని అందువల్ల ప్రాంతీయ పార్టీలు తుడిచిపెట్టుకుపోవాల్సిందేనని బీజేపీ నాయకులు బహిరంగంగా చెబుతున్నారు.

ఈ సారి ఏపిలో మళ్లీ జగన్ గెలిస్తే తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని, ఆ తర్వాతి ఎన్నికల్లో తమదే హవా అని బీజేపీ నాయకులు లెక్కేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీతో బాటు జనసేన కూడా ప్రాంతీయ పార్టీయేనని, తమ కోరిక జనసేన కు కూడా కోపం తెప్పిస్తుందని బీజేపీ నాయకులు అంచనా వేయలేదు. ప్రాంతీయ పార్టీలు తుడిచిపెట్టుకుపోవాలనే కోరిక ఉన్న బీజేపీ నాయకులు జనసేనను మాత్రం ఎందుకు ఆదరిస్తారు?

బహుశ ఇదే లాజిక్ తో పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తున్నది. అంతే కాకుండా తాను మిత్రత్వం నెరపుతున్న బీజేపీ నాయకులు తరచూ అధికార వైసీపీకి అనుకూలంగా మాట్లాడటం కూడా పవన్ కల్యాణ్ కు నచ్చడం లేదు. తనను అణచివేయాలని చూస్తున్న వైసీపీని పొగుడుతుంటే లేదా దానికి అనుకూలంగా మాట్లాడుతుంటే ఆ పార్టీని ఎందుకు గౌరవించాలి అనేది కూడా పవన్ మనసులో మెదిలి ఉంటుంది. పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేసిన వైసీపీని బీజేపీ నాయకులు ఖండించిన పాపాన పోలేదు.

జనసేన నాయకులను పోలీసులు వేధించినా బీజేపీ నాయకులు రియాక్టు కావడం లేదు. అందుకే కొత్త మిత్రులను వెతుక్కోవాల్సిన పరిస్థితిని బీజేపీనే పవన్ కల్యాణ్ కు కల్పించింది. దానికి తోడు అధికార వైసీపీ కూడా చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ ప్రతి సారీ కలిపి మాట్లాడటం, వ్యక్తిగత విషయాల గురించి దాడులు చేయడంతో కూడా పవన్ కల్యాణ్ చంద్రబాబు వైపు మొగ్గారు. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కల్యాణ్, చంద్రబాబునాయుడులను కలిపింది జగన్ రాజకీయ అపరిపక్వత, వైసీపీకి లొంగిపోయిన బీజేపీ నేతల అతి ఉత్సాహం మాత్రమే.

Related posts

హిందీపై కారాలు మిరియాలు

Satyam NEWS

ఎన్ ఎస్ యు ఐ కార్యకర్తల అసెంబ్లీ ముట్టడి

Satyam NEWS

ఎజెండా: ప్రభుత్వ పథకాలు ప్రజల దరికి చేరాలి

Satyam NEWS

Leave a Comment