27.7 C
Hyderabad
May 4, 2024 07: 40 AM
Slider ముఖ్యంశాలు

ఎనాలసిస్: సారూ ఇంకా ఉంచుతారా? ఇక ఎత్తుతారా?

#Narendra Modi

ప్రధానమంత్రి నరేంద్రమోదీ  ముఖ్యమంత్రులతో వీడియో సమావేశం అనంతరం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపౌ  అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో వారం రోజుల్లో, మే 3వ తేదీ నాటికి రెండవ దశ లాక్ డౌన్ విధించిన కాలం ముగుస్తుంది.

మొత్తం 40 రోజులగా సాగిన ఈ  నిర్బంధానికి తెరపడుతుందా? కొన్ని కొత్త సడలింపులతో మరికొంతకాలం కొనసాగుతుందా? వేచి చూడాల్సిందే.  ఆదివారం నాటి తాజా “మన్ కీ బాత్”  లో  ప్రధాని వ్యాఖ్యలను సూక్ష్మంగా పరిశీలిద్దాం. ప్రస్తుతం యుద్ధం మధ్యలో ఉన్నామని, మరింత అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈద్ వచ్చేలోగా కరోనాను ఖతం చేద్దామన్నారు. మే 23 వ తేదీకి ఈద్ వస్తుంది. ఈ లోపే ఖతం చేద్దాం అంటున్నారు. ఈ వ్యాఖ్యలను జాగ్రత్తగా పరిశీలిస్తే, మే 3 వ తేదీ తర్వాత కూడా మరి కొంతకాలం లాక్ డౌన్ కొనసాగే అవకాశాలే కన్పిస్తున్నాయి. యుద్ధం మధ్యలో ఉన్నామంటున్నారు.

బహుశా! మే 23 కు కొంచెం ముందు, ఇంకొన్ని ఎక్కువ సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది లేదా  లాక్ డౌన్ సంపూర్ణంగా ఎత్తివేయవచ్చు. ఢిల్లీలో మే 16 వ తేదీ వరకూ లాక్ డౌన్ కొనసాగించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు.

దేశ రాజధానిలో ఉన్న కేజ్రీవాల్ కు కేంద్ర ప్రభుత్వ భవిష్య వ్యూహాలపై కొంత ఎక్కువ సమాచారం అందే అవకాశం ఉంది. నరేంద్రమోదీ మన్ కీ బాత్ వ్యాఖ్యలు, కేజ్రీవాల్ తాజా నిర్ణయం కలిపి చూస్తే, మే 16 వరకూ లాక్ డౌన్  తప్పకుండా పొడిగించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ఒక అంచనా వెయ్యవచ్చు.

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఒడిశా రాష్ట్రాలు మే 3 వ తేదీ తర్వాత కూడా హాట్ స్పాట్ లలో లాక్ డౌన్ కొనసాగించాలని చూస్తున్నాయి. తెలంగాణా ప్రభుత్వం మే 7 వ తేదీ వరకూ కొనసాగిస్తామని ఇప్పటికే ప్రకటించింది.

గుజరాత్, తమిళనాడు, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలనే పాటిస్తామని స్పష్టం చేశాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుండి అదే వ్యాఖ్య చేస్తున్నారు. ప్రమాదం, ప్రభావాలు లేని ఏరియాల్లో లాక్ డౌన్ ఎత్తివేయడమే మంచిదనే  ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్టుగా చెప్పాలి.

గతంలో ప్రధానమంత్రితో జరిగిన సమావేశాలలోనూ ఇదే స్వరం వినపడింది. ఈ దశలో,  ప్రధానమంత్రి , ముఖ్యమంత్రుల మధ్య సాగే  ఈ  సమావేశం చాలా కీలకమైంది. కరోనా నియంత్రణ, లాక్ డౌన్  ప్రధానమైన చర్చనీయాంశాలు. కరోనా పరిణామాలలో ఇది మూడవ భేటీ.

కేంద్ర ప్రభుత్వం 20 వ తేదీ నుండి ఇచ్చిన కొన్ని  సడలింపుల తర్వాత, మొన్ననే మరికొన్ని రంగాలపై సడలింపులు ఇచ్చింది. ఈ సడలింపులు స్పష్టంగా లేవని, కొంత గందరగోళంగా ఉందని వ్యాపార వర్గాలు గొడవచేస్తున్నాయి. సమీపంలో ఏ దుకాణాలు లేని మొబైల్ షాపులు, గార్మెంట్స్, హార్డ్ వేర్, స్టేషనరీ దుకాణాలు తెరవవచ్చు.

హాట్ స్పాట్లు, కట్టడిఉన్న ప్రాంతాల్లో అనుమతులు లేవు. షాప్స్ మరియు ఎస్టాబ్లిష్మెంట్ చట్టంలో నమోదైన వాటికి వర్తిస్తాయని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. షాపింగ్ మాల్స్ కు ఎక్కడా అవకాశం లేదు. మార్కెట్ కాంప్లెక్స్ లు వంటి పదాలను ఎలా అర్ధం చేసుకోవాలంటూ భారత చిల్లర వర్తకుల సంఘాలు స్పష్టతను కోరుకుంటున్నాయి.

అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు విడిగా ఉత్తర్వులు ఇవ్వాలని సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాయి. దుస్తులు, ఆభరణాలు, పాదరక్షలు, క్రీడా సామాగ్రి, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ మొదలైన వన్నీ రిటైలింగ్ రంగం కిందకే వస్తాయి. ఈ విభాగాల్లో చిన్న, మధ్య తరగతి వర్తకులు కోలుకోవడం కష్టమే.

కరోనా ప్రభావంతో 25 శాతం మంది ఈ రంగం నుండి బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయని రిటైల్ రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మే నెల చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తోంది. జులైలో మరోసారి కరోనా విజృంభించే అవకాశం ఉందని ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ, కరోనా నియంత్రణా  చర్యల అమలులో ఎట్టిపరిస్థితుల్లో రాజీపడవద్దని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ   ఇప్పటికే స్పష్టం చేశారు. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో మొన్న నిర్వహించిన సమావేశంలో అయన చేసిన వ్యాఖ్యలను గమనిస్తే, లాక్ డౌన్ అమలు మరికొంతకాలం తప్పదని అర్ధమవుతోంది.

దేశవ్యాప్తంగా కరోనా తీరు ప్రమాదకరంగానే సాగుతోంది. మే 3వ తేదీ తర్వాత, లాక్ డౌన్  కొనసాగింపులో, మరో విడత  సడలింపులు మాత్రం ఉండవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రజలకు ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తారో వేచిచూడాల్సిందే.మోదీ కీ బాత్ జాన్  వైపా?  జహాన్ వైపా? 

ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం కొంత అంచనా వెయ్య వచ్చు. వర్షాకాలం, విద్యా సంవత్సరం త్వరలో ప్రారంభం కానున్నాయి.  కొత్త ఆర్ధిక సంవత్సరం ఇప్పటికే ప్రారంభమైంది. ప్రభుత్వాలకు ఆరోగ్యం, ఆర్ధికం రెండు కళ్ళు కావాలి. మనిషి మనుగడకు రెండూ ముఖ్యమే.

మహాభారతంలో,  మానభంగ పర్వంలో ” నన్నోడి తన్నోడెనా?  లేక, తన్నోడి నన్నోడెనా? ” అని ద్రౌపది ధర్మరాజును ప్రశ్నించినట్లు, ఈ కరోనా కీచక పర్వంలో  ఏది ఓడిపోతామో, ఏది గెలుస్తామో…. కాలమే సమాధానం చెప్పాలి.

మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

జాస్తి చలమేశ్వర్ కుమారుడికి కీలక పదవి ఇచ్చిన జగన్

Satyam NEWS

ఓ వైపు చ‌ర్చ‌లు..మ‌రోవైపు ఆందోళ‌న‌లు…!

Satyam NEWS

ఓట్లు వేయించుకున్న వాళ్లు కోట్లు సంపాదిస్తున్నారు… మేం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం

Satyam NEWS

Leave a Comment