27.7 C
Hyderabad
May 4, 2024 08: 34 AM
Slider ప్రత్యేకం

ఎనాలసిస్: నీరస పడ్డ దేశానికి మళ్లీ మోడీ టానిక్

(సత్యం న్యూస్ ప్రత్యేకం)

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తాజా ప్రసంగంలో 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి భారత దేశ ప్రజలలో కొత్త ఆశలు ఊపిరి పోసుకునేలా చేసేందుకు ప్రయత్నం చేశారు. కరోనా సంక్షోభాన్నిసమర్ధవంతంగా ఎదుర్కునే ప్రయత్నంలో భారత దేశాన్ని ప్రపంచదేశాలు మెచ్చుకుంటున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

21వ శతాబ్దం భారత్ దేనని కరోనా అనుభవం నుంచి నూతన అధ్యాయం ఆవిష్కృతం కానున్నదని ఆయన తనదైన శైలిలో ప్రజలను ఉత్తేజ పరిచారు. ప్రసంగ సమ్మోహన శక్తితో ప్రజలకు దిశానిర్దేశం చేయడంలో నేటి తరం నేతల లో మోదీ స్థానం ప్రధానమైనది. అంతటి వాక్చాతుర్యం అనితరసాధ్యం.

దేశ ప్రజలపై మళ్లీ మోడీ సమ్మోహనాస్త్రం

సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యే రీతిలో చెప్పదలచిన  విషయాన్ని సూటిగా అందించడంలో ఆయనది విభిన్న విధానం. ఎత్తుగడ మొదలు ముగించే వరకు మోదీ ప్రసంగం సాఫీగా సాగుతుంది. సామూహిక ట్రాన్స్ లోకి ప్రజాబాహుళ్యాన్ని తీసుకువెళ్ళడం ఆయన అసమాన  వాక్చాతుర్యానికి అద్దంపడుతుంది.

దృశ్య మాధ్యమాల సాంకేతిక పరిజ్ఞానం సహకారం కారణంగా దేశ ప్రధాని ప్రజలతో నేరుగా మాట్లాడుతున్న అనుభూతి కలుగుతుంది. ప్రధాని ప్రకటించిన భారీ ఆర్ధిక ప్యాకేజీ వివరాలు తెలియాల్సి ఉంది. కరోనా ప్రభావానికి గురై సంక్షోభం లో ఉన్న ప్రతి వర్గాన్ని ఉదహరించి ఆయా వర్గాల ప్రజలకు భరోసా కల్పిస్తున్నట్లు ప్రధాని సూచించడం ముదావహం.

ఆర్ధిక తోడ్పాటుపై మరింత స్పష్టత రావాలి

ఐతే, లబ్ధిదారులకు ఆర్ధిక తోడ్పాటు ఏ విధంగా ఉంటుందో స్పష్టత రావాల్సి ఉంది. మౌలిక సదుపాయాలు కల్పన, ఉపాధి అవకాశాల మెరుగుదల, మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా ఆదరణ, వస్తు, సేవల రంగాల అవిచ్ఛిన్న సరఫరా వ్యవస్థను పటిష్ట పరచాల్సిన అవసరాన్ని గుర్తిచాలని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు.

ఈ ప్రసంగంలో అసలైన అంశం లాక్ డౌన్ 4.0 పొడిగింపు పై కీలక ప్రకటన. ప్రజలు మరో దశ లాక్ డవున్ కి సిద్ధపడడం తప్పదని….దానికి సంబంధించిన మార్గదర్శకాలు ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు.

కొత్త నిబంధనలు ఏ తీరుగా ఉంటాయనేది తేలాల్సివుంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలను పరిగణనలోకి తీసుకొని లాక్ డౌన్ పొడిగింపు…ఆంక్షల సడలింపుల విషయంలో లోతుగా అధ్యయనం చేయాలని పలు రంగాలకు చెందిన నిపుణులు, మేధావులు కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

రాష్ట్రాల డిమాండ్లపై కూడా తేల్చాల్సి ఉంది

ఇదిలా ఉంటే… వివిధ రాష్ట్రాల అభ్యర్ధనలపై ప్రధానమంత్రి స్పందించాల్సి ఉంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విడుదల, మాఫీ చేయాల్సిన కొన్ని రకాల రుణాలు, ఎఫ్ ఆర్ బి ఎం పెంపు వంటి సాంత్వన ప్రక్రియలు అనేక అంశాలపై కేంద్రప్రభుత్వ స్పష్టతకోసం నిరీక్షిస్తున్నాయి.

సమీప భవిష్యత్తులో భారత్ అగ్రగామిగా నిలువనుందని, రానున్న 21వ శతాబ్దం మనదేనని ప్రధాని సాధికారంగా ప్రకటించారు. 4.0 లాక్ డౌన్ తో సామాన్యులకు ఒరిగేది ఏమిటో కాలమే నిర్ణయిస్తుంది. దశలవారీ లాక్ డౌన్ లతో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన ప్రజలలో ఎక్కువ శాతం పేద, మధ్య తరగతికి చెందిన వారు కావడంతో ఆయా వర్గాలకు న్యాయం చేయాలని సూచిస్తున్న సామాజిక శాస్త్రవేత్తల సలహా అనుసరణీయం.

కృష్ణారావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశ్రాంత ఉన్నతాధికారి

Related posts

అనాధ వృద్ధుడిని ఆశ్రమంలో చేర్పించి మానవత్వం చాటుకున్న డి.ఎస్.ఆర్.ట్రస్ట్

Satyam NEWS

దొంగతనానికి పాల్పడిన ఎస్ ఐ పై పోలీసు కేసు నమోదు

Satyam NEWS

జడ్జిమెంట్: బహిరంగ ప్రదేశంలో తాగినందుకు జైలు శిక్ష

Satyam NEWS

Leave a Comment