Slider ప్రపంచం

Analysis: భారత్ వైపు చూస్తున్న అమెరికా పెద్దన్న

#USElections

నవంబర్ 3న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. సాధారణంగా ఎన్నికల సమయంలో అన్ని దేశాలూ అమెరికా వైపు చూస్తాయి. అయితే ఈ సారి ప్రపంచ దేశాలన్నీ అమెరికావైపే కాకుండా ఇటు భారత్ వైపు కూడా ఆసక్తిగా  చూస్తున్నాయి.

గతంలో ఎప్పుడూ లేనట్లుగా, ఈసారి జరుగుతున్న అమెరికా ఎన్నికల్లో భారత్ పాత్ర విశిష్టమై, విభిన్నమై నిలుస్తోంది. రెండు దేశాల సంబంధాల్లో కొత్త చరిత్ర లేఖనం కానుంది. ఉపాధ్యక్ష రేసులో ఉన్న ఇద్దరూ భారతీయ సంతతికి చెందినవారే కావడం ఈ ఎన్నికల్లో  విశేషం.

భారత సంతతి వారికే అందలం

ప్రస్తుతం అధికారంలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అధికారంలోకి వచ్చినా, డెమోక్రాటిక్ పార్టీ అధికారంలోకి వచ్చినా, భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఉపాధ్యక్ష పదవిలో కూర్చోడం తప్పనిసరిగా జరిగే పరిణామం. ఇది ప్రపంచ దేశాలకు  ఆసక్తిదాయకం, భారతీయులకు ఆనందదాయకం.

డెమోక్రాటిక్ పార్టీ నుండి అధ్యక్ష రేసులో ఉన్న జో బైడెన్ వ్యూహాత్మకంగా భారతీయ మూలాలు ఉన్న కమలా హ్యారిస్ ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేయడం రాజకీయ లోకంలో పెను సంచలనం రేపింది. ఈ పరిణామానికి ఎక్కువమంది భారతీయులతో పాటు, నల్ల జాతీయులు ఎక్కువగా ఆనందించారు.

కమలా హ్యారిస్ తండ్రి జమైకా దేశస్థుడు, తల్లి భారతీయురాలు కావడం,  జోబైడెన్ కు, తద్వారా డెమోక్రాటిక్ పార్టీకి కలిసొచ్చే అంశమని ప్రపంచ మీడియాలో ప్రత్యేకమైన కథనాలు వచ్చాయి. జో బైడెన్ వేసిన ఈ ఎత్తు డోనాల్డ్ ట్రంప్ ను కదిలించింది.

భారతీయ సంతతిపైనే ట్రంప్ ఆశలు

ప్రతివ్యూహంలో భాగంగా,   ట్రంప్ కూడా భారతీయ కార్డు ఫ్లే చేసి ఎత్తుకు పైఎత్తు వేశారు. తమ రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా పూర్తి భారతీయ మూలాలు కలిగిన నిక్కీ హేలీని ఎంపిక చేసి, జో బైడెన్ కు ట్రంప్ షాక్ ఇచ్చారు. నిక్కీ హేలీ తల్లిదండ్రులు ఇద్దరూ పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు.

సంపూర్ణమైన భారతీయ మూలలు నిక్కీకి ఉన్నాయి. నిక్కీ నేపథ్యం కూడా ఆకర్షణీయంగా ఉంది. రాజకీయవేత్తగా, దౌత్యవేత్తగా, వ్యాపారవేత్తగా, రచయితగా నాలుగు రంగాల్లోనూ విజయవంతంగా తన ముద్ర వేసుకున్నారు. సౌత్ కరోలీనాకు మొట్టమొదటి మహిళా గవర్నర్.

మంచి పేరున్న నిక్కీ హేలీ

సంయుక్త అమెరికాలో, మొట్టమొదటి భారతీయ అమెరికన్ గవర్నర్ గా చరిత్రకెక్కారు. రేపు జరిగే ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి ఎంపికైతే, మొట్టమొదటి భారతీయ అమెరికన్ గా నిక్కీ హేలీ చరిత్ర సృష్టిస్తారు. ట్రంప్ టీమ్ లో నిక్కీకి మంచిపేరు  ఉంది. మితవాదిగా, ఆచరణశీలిగా ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది.

2024లో జరగబోయే ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థి అయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు. నిజంగా ఇది జరిగితే, ఒక భారతీయ సంతతి అమెరికాకు అధ్యక్షులుగా సింహాసనంపై కూర్చున్న గొప్ప ఘనత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమవుతుంది.

ఓటర్ రిజిస్ట్రేషన్ లో నిక్కీ శ్వేత జాతీయురాలిగా నమోదు చేసుకున్నారు. ఇది నల్లజాతీయుల నుండి వ్యతిరేక భావాన్ని కలిగించే అంశం. ట్రంప్ కు ఎలాగూ నల్లజాతీయుల వ్యతిరేకిగా, తెల్లజాతీయవాద ప్రచారకర్తగా ముద్రపడింది ట్రంప్ వ్యవహారశైలికి సొంతపార్టీలోనూ కొంత వ్యతిరేకత ఉంది.

మోడీ హవా కొనసాగితే ట్రంప్ కు లాభం

భారతీయ ఓటర్లు సుమారు ఒక శాతంమంది ఉంటారు. సహజంగా వీరిలో ఎక్కువ మంది డెమోక్రాటిక్ పార్టీ మద్దతుదారులుగానే ఉంటారు. భారత ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికే హౌడీ మోదీ వేదికలోనూ, తాజాగా ట్రంప్ గుజరాత్ పర్యటనలోనూ, ట్రంప్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించారు.

దీనివల్ల భారతీయుల ఓట్లు చీలిపోయి, కొన్ని ఓట్లు ట్రంప్ కు పడే అవకాశం ఉంది. కొంతకాలం నుండీ అమెరికాలో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల్లో అధికారంలో ఉన్న అభ్యర్థికి రెండవసారి కూడా ఓటర్లు అవకాశం ఇస్తున్నారు. ఈ అంశానికి తోడు, నవ్య శ్వేత జాతీయవాదం, కొంత నరేంద్రమోదీ ప్రభావం, లిబరల్ ఓటర్ల సరళి మొదలైనవి డోనాల్డ్ ట్రంప్ కు కలిసి వచ్చే అంశాలు.

ట్రంప్ కు గడ్డు కాలమేనా?

ఇటీవల వచ్చిన ఎన్నికల విశ్లేషణా నివేదికలు  ఈసారి డోనాల్డ్ ట్రంప్ గెలుపు  కష్టమని చెబుతున్నాయి. ఉపాధ్యక్ష పదవి రేసులో ఉన్న నిక్కీ హేలీకి శ్వేత జాతీయ ముద్ర కొంత వ్యతిరేకత తెచ్చే అంశంగానూ పరిగణించవచ్చు. జో బైడెన్ శైలి డోనాల్డ్ ట్రంప్ కు పూర్తి భిన్నంగా ఉంది.

భారతదేశానికి అన్నిరకాలుగా తమ మద్దతు ఇస్తామని  ఇప్పటికే ప్రకటించారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులతోపాటు  ఆఫ్రికా మొదలైన ఇతరదేశాలవారికి కూడా ఎంతో అనుకూలమైన ప్రకటనలు బైడెన్ చేశారు. ఇవన్నీ డెమోక్రాటిక్ పార్టీకి కలిసి వస్తాయి.

బైడెన్ వైపే కనిపిస్తున్న మొగ్గు

ట్రంప్ పై ఉన్న వ్యతిరేకత, డెమోక్రాటిక్ పార్టీ అభిమానుల మద్దతు , నల్లజాతీయులు, కొంత భారతీయుల సహకారం జో బైడెన్ కు కలిసి వచ్చే అంశాలు. తాజా నివేదికలు కూడా బైడెన్ కు అనుకూలంగా ఉన్నాయి. అమెరికాలో జరుగబోయే అధ్యక్ష ఎన్నికలు ట్రంప్ – బైడెన్ మధ్య నువ్వా- నేనా అన్నట్లు ఉన్నాయి.

ఇప్పటి వరకూ ఉన్న సమాచారం మేరకు జో బైడెన్ వైపు కాస్త మొగ్గుగా ఉంది. డోనాల్డ్ ట్రంప్ టీమ్ వచ్చినా, జో బైడెన్ బృందం వచ్చినా భారతీయ అమెరికన్లకు  -భారతదేశానికి మేలే జరుగుతుంది. ఉపాధ్యక్షులు ఎలాగూ భారత్ కు సంపూర్ణ సహకారం అందిస్తారు. ఎవరు వచ్చినా, ఏమి  జరిగినా భారత్ కు మంచే జరుగుతుంది. ఈసారి అమెరికా ఎన్నికల్లో అంతా భారతీయమే.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

స్థానిక ఎన్నికలంటే ఎందుకు ఇంత భయం???

Satyam NEWS

10న జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం

Satyam NEWS

రాజధాని నుంచి తరలించిన అన్ని కార్యాలయాలను వెనక్కి తెస్తాం

Satyam NEWS

Leave a Comment