ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అకస్మాత్తుగా ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఎందుకు వెళుతున్నారో తెలియదు కానీ రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉంటారు. అకస్మాత్తుగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన పలువురిని ఆశ్చర్య పరిచింది. ప్రధాని మోదీతో భేటి అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు కానీ అది ఇప్పటి వరకూ ఖరారు కాలేదు.
ప్రధాని మోదీతో సమావేశం అయితే పోలవరం ప్రాజెక్టుపై, రాజధాని విషయంపై చర్చించనున్నారని సమాచారం. జనసేన, బిజెపి సంబంధాలపై గత రెండు రోజుల నుంచి గొడవ జరుగుతున్న నేపథ్యంలో సిఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తి కలిగిస్తున్నది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను బహిరంగంగా బాగా పొగిడిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బిజెపి జన సేన సంబంధాలపై పలు రకాల ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా ఏపి సిఎం జగన్ ఢిల్లీ వెళ్లడం, బిజెపి పెద్దలను కలవబోతుండటం గమనార్హం.