41.2 C
Hyderabad
May 4, 2024 15: 24 PM
Slider ఖమ్మం

రెండో విడత పంపిణీ కి ఏర్పాట్లు

#District Collector

జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో రెండవ విడత గొర్రెల పంపిణీ పథకం అమలుకు విధి విధానాలపై అధికారులతో కలిసి గొర్రెల పెంపకందారుల సంఘాల అధ్యక్షులు, ప్రమోటర్స్ లకు కలెక్టర్ అవగాహనా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తుందని అన్నారు. జిల్లాలో మొదటి విడత క్రింద 15,660 మందికి గొర్రెల యూనిట్లు ఆందజేసినట్లు ఆయన తెలిపారు.

16,639 మంది లబ్ధిదారులకు రెండో విడత క్రింద పథకం అమలు చేయాల్సి ఉందని, దీనికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి ప్రభుత్వం ప్రారంభించిన వెంటనే జిల్లాలో గొర్రెల పంపిణీ అమలు జరిగేలా సన్నద్ధం కావాలని కలెక్టర్ అన్నారు. గొర్రెల యూనిట్ పంపిణీ లబ్దిదారులకు సంబంధించిన కుల ధృవీకరణ పత్రం, బ్యాంక్ ఖాతా జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ, నామినీ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ మొదలైన సర్టిఫికెట్స్ లను దరఖాస్తుతో పాటు సంబంధిత పశు సంవర్థక అధికారికి సమర్పించాలన్నారు.

లబ్దిదారుని వాటా క్రింద 43 వేల 750 లను వాళ్ళ వర్చువల్ అక్కౌంట్ లో జమ చేయాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 9,000 మంది లబ్దిదారులు తమ వాటా ధనం జమ చేశారని, వారు డాక్యుమెంట్లను పశువైద్య అధికారికి సమర్పించాలని, లబ్దిదారుని వాటా ధనం ఇంకా చెల్లించని వారు, వారి వాటా ధనం , పైన తెలిపిన ధృవ పత్రాలను సంబంధిత పశు వైద్యాధికారికి సమర్పించాలని కలెక్టర్ అన్నారు. గొర్రెల పంపిణీ యూనిట్ల లబ్ధిదారులకు కుల ధ్రువీకరణ పత్రాల జారీకి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. 2022 ఆగష్ట్ నెలలో గొర్రెల పంపిణీ పథకం అమలుకి సంబంధించి గ్రామాల ప్రాధాన్యతా క్రమం నిర్ణయించామని, దాని ప్రకారమే పథకం అమలు జరుగుతుందని, రాబోయే కొన్ని వారాలలోనే రెండవ విడత గొర్రెల పంపిణీ ప్రారంభం అవుతుందని, అందరూ

ఈ విషయాన్ని పరిగణించి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. రెండవవిడత గొర్రెల పంపిణీ కోసం ఎంపికైన లబ్దిదారులలో మరణించిన వారి స్థానంలో వారి నామినీలకు యూనిట్ అందించడం జరుగుతుందని, సదరు నామినీలు చనిపోయిన లబ్దిదారుల మరణ ధృవీకరణ పత్రం, నామినీ ధృవీకరణ పత్రం, నామినీ ఆధార్ కార్డ్, నామినీ కులధృవీ కరణ పత్రం లను, నామినీ బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ కాపీలను వారి సంఘ అధ్యక్షుల ద్వారా, సంబంధిత పశు వైద్యాధికారికి సమర్పించాలని అలాగే ఆ నామినీలు చనిపోయిన లబ్దిదారుల కుటుంబ సభ్యులు అయ్యి ఉండాలని, వీరు గతంలో గొర్రెలను పొంది ఉండకూడదని కలెక్టర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు, ప్రకాశం, కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లాల్లో ఖమ్మం జిల్లాకు సంబంధించి గొర్రెల కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు, లబ్ధిదారులు పై జిల్లాల నుండి కొనుగోలు ప్రక్రియ చేయాలన్నారు.

రవాణాకు సంబంధించి టెండర్లు ఫైనల్ చేసినట్లు, కొనుగోలుకు లబ్దిదారుడి వెంట అధికారులు వెళ్తారని ఆయన తెలిపారు. గొర్రెలు లబ్దిదారుడి గ్రామానికి చేరుకునే ముందే దాణా సిద్ధం చేస్తామని, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుతామని ఆయన అన్నారు. గొర్రెల షెడ్ ల నిర్మాణానికి ఉపాధి హామీ నుండి మంజూరుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మొదటి విడతలో జరిగిన అనుభవాలను, సమస్యలను అధిగమించి ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా అన్ని చర్యలు చేపట్టనున్నట్లు ఆయన అన్నారు. సమావేశంలో గొర్రెల పెంపకందారుల సంఘ అధ్యక్షులు అడిగిన సందేహాలను నివృత్తి చేసి, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

ఈ అవగాహన సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డా. వేణు మనోహర్, అసిస్టెంట్ డైరెక్టర్లు డా. భాను చౌదరి, డా. రమణి, గొర్రెల పెంపకందారుల సంఘాల అధ్యక్షులు, ప్రమోటర్లు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎలుగుబంటి దాడిలో మరణించిన వ్యక్తికి పరిహారం

Satyam NEWS

రెండవ రోజు ఒంటిమిట్ట కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

భారత్ జపాన్ ల మధ్య సైనిక సహాకార ఒప్పందం

Satyam NEWS

Leave a Comment