34.7 C
Hyderabad
May 5, 2024 01: 17 AM
Slider సంపాదకీయం

రాజ్యసభ ఎన్నికలతో పాటు బడ్జెట్ సమావేశాలు

cm jagan

శాసనసభ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నది. మార్చి 31లోపు బడ్జెట్ ఆమోదించుకోవాల్సి ఉన్నా అప్పటి పరిస్థితుల ప్రభావం కారణంగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించలేకపోయారు.

ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినందున వాటితో బాటు బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించుకోవాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఖాళీ అయిన 18 రాజ్యసభ స్థానాలకు జూన్ 19న ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఆమోదం పొందిన బడ్జెట్ గడువు ఈ నెల 30 వరకే

ఇందులో భాగంగా ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఎన్నికలు ఇప్పటికే జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఈ ఎన్నికల సందర్భంగా అసెంబ్లీని సమావేశ పరచాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.

మార్చిలో నిర్వహించాల్సిన బడ్జెట్‌ సమావేశాల కరోనా వైరస్‌ కారణంగా వాయిదాపడినందున మూడు నెలల బడ్జెట్‌ను ఆర్డినెన్స్‌ ద్వారా ఆమోదం పొందింది. ఈ గడువు కూడా జూన్‌ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్‌కు శాసనసభ నుండి ఆమోదం పొందాల్సి వుంది.

వైరస్‌ ఉధృతి తగ్గకపోయినా అవసరమైన జాగ్రత్తలతో జూన్‌లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని  తొలుత ప్రభుత్వం భావించినట్లు సమాచారం. అయితే కేంద్రం రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం ప్రభుత్వానికి కలిసి వచ్చిన అంశంగా మారింది.

శాసన మండలి సంగతి ఏమిటి?

కాగా శాసన మండలిని రద్దు చేయాలని శాసనసభ తీర్మానం చేసి పంపినప్పటికీ కేంద్రం ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. ఇదే వైఖరితో కేంద్రం ఉంటే, మండలిని కూడా సమావేశపరచాల్సి ఉంటుంది. మరోవైపు సిఆర్‌డిఎ రద్దు బిల్లును శాసనసభ ఆమోదించినా, మండలి తిరస్కరించడంతో సెలక్ట్‌ కమిటీకి పంపింది. సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేయడంలో కావాలని జాప్యం చేస్తున్నారని టీడీపీ సభ్యుడు దీపక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా సీఎస్, అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు.

ప్రస్తుతం సెలెక్ట్ కమిటీ బంతి కోర్టులో ఉంది. ఈ నేపధ్యంలో బడ్జెట్‌ తో పాటు కరోనా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారం, స్థానిక సంస్థల ఎన్నికల గొడవలు, విశాఖ విష వాయువు తదితర అంశాలు  అసెంబ్లీ ముందుకు రానున్నాయి. మండలి పట్ల ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

రాజ్యసభకు అభ్యర్థుల ప్రకటన పూర్తి

రాజ్యసభకు వైసీపీ అభ్యర్థులను ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించింది. వైసీపీ అభ్యర్థులుగా మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ తో పాటు పారిశ్రామిక వేత్తలు అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీలను అధిష్టానం ప్రకటించింది. అయితే అసెంబ్లీలో బలం లేకున్నా టీడీపీ కూడా ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్యను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కనున్నాయి.

Related posts

రైతు రుణమాఫీ చేయాలని బిజెపి డిమాండ్

Satyam NEWS

మహారాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా నార్వేకర్ ఎన్నిక

Satyam NEWS

‘‘యువగళం’’పాదయాత్రతో తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయం

Bhavani

Leave a Comment