రాజ్యసభ సభ్యుడు జె. సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్ లో భాగంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మొక్కలను నాటి విసిరిన చాలెంజ్ ను స్వీకరించిన అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఈరోజు అసెంబ్లీ ఆవరణలో 6 మొక్కలను నాటారు. అదేవిధంగా గ్రీన్ చాలెంజ్ కు కొనసాగింపుగా రాజ్యసభ సభ్యులు కె. కేశవరావుకు, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మకు, ఇన్ఫోటెక్ చైర్మన్ మోహన్ రెడ్డి కి స్పీకర్ గ్రీన్ చాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కు హరితహారం మహత్తరమైన యజ్ఞం. రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం. ఇప్పటికే177 కోట్ల మొక్కలను నాటడం జరిగింది. రాష్ర్టవిస్తీర్ణంలో 33 శాతం అడవులను పెంచడమే లక్ష్యం అని అన్నారు. గ్రీన్ చాలెంజ్ మంచి కార్యక్రమం. దీనిని ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ను అభినందిస్తున్నాను అని ఆయన అన్నారు. ప్రతి మనిషికి ఏడాదికి 300 కిలోల ఆక్సిజన్ అవసరం. ప్రతి చెట్టు ఏడాదికి సుమారు 100 కిలోల ఆక్సిజన్ అందిస్తుంది. స్వచ్ఛమైన ప్రాణవాయువును అందిస్తున్నవి చెట్లు. అటవీప్రాంతాలలోని ఖాళీ ప్రదేశాలలో పండ్ల చెట్లను పెంచుతున్నారు. దేశమంతటా వర్షాలు పుష్కలంగా కురుస్తుంటే, అడవులు, చెట్లు లేకపోవడంతో మంజీర నది పరివాహకంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. మొక్కలు నాటడంతో పాటు వాటిని బతికించడం ఎంతో ముఖ్యం అని స్పీకర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనసభ కార్యదర్శి డా. వి. నరసింహా చార్యులు, గ్రీన్ చాలెంజ్ టీం మెంబర్ రాఘవ, శాసనసభ సిబ్బంది పాల్గొన్నారు.
previous post