38.2 C
Hyderabad
April 29, 2024 21: 49 PM
Slider ఖమ్మం

డెంగ్యూ పట్ల అప్రమత్తంగా ఉండాలి

#Collector V.P

వర్షాల దృష్ట్యా డెంగ్యూ పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో డెంగ్యూ నియంత్రణపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు ప్రధానమని, తదనుగుణంగా జిల్లాలో డెంగ్యూ నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు.

గతంలో నమోదైన కేసులపై సమీక్షించి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. జిల్లాలో గత రెండు మూడు సంవత్సరాలుగా కేసులు అధికంగా నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి నియంత్రణ చర్యలు చేపట్టాలని, ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సంవత్సరం జనవరి నుండి ఇప్పటి వరకు జిల్లాలో 101 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు.

రోజుకు కనీసం 300 పరీక్షలు చేపట్టాలని, గుర్తించిన పాజిటివ్ కేసులకు మెరుగైన వైద్యం అందించి, వ్యాప్తి చెందకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆయన అన్నారు. పాఠశాలల్లో పిల్లలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించి, డెంగ్యూ పట్ల చైతన్యం తేవాలన్నారు.

ప్రధానంగా నీటి నిల్వలు లేకుండా చూడడం ద్వారా డెంగ్యూ ను పూర్తిగా అరికట్టవచ్చని ఆయన తెలిపారు. జిల్లాలో ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని, మున్సిపాలిటీ పరిధిలో కార్పొరేటర్లు, పంచాయతీ పరిధిలో సర్పంచులు, వార్డ్ మెంబర్ లను భాగస్వాములు చేయాలని అన్నారు.

ప్రతి ఆదివారం ఇంటితోపాటు ఇంటి పరిసరాల లో నీటి నిల్వలు లేకుండా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి, డ్రై డే చేపట్టేలా చైతన్య పరచాలని కలెక్టర్ అన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో జిల్లా కలెక్టరేట్ నుండి గ్రామ స్థాయి కార్యాలయం వరకు గురువారం డ్రైడే తప్పనిసరిగా చేపట్టాలని ఆయన అన్నారు.

గ్రామాలలో నీటి నిల్వలను తొలగించాలని, నీటి నిల్వలలో ఆయిల్ బాల్స్, గంబూషియ చేప పిల్లలను వదలాలని, యాంటీ లార్వా స్ప్రేయింగ్, ఫాగింగ్ పనులు ముమ్మరంగా జరగాలని, పారిశుద్ధ్య పనులు, మురుగు కాలువల పూడికతీత పనులు నిరంతరాయంగా కొనసాగాలని ఆయన తెలిపారు.

నీటి ట్యాoకులను ప్రతి 15 రోజులకు క్లోరినేషన్ చేయాలని, దీనికి లాగ్ బుక్ నిర్వహించాలని ఆయన అన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన తయారు వర్కర్లు, హాస్టల్ కుక్ లకు, రెస్టారెంట్లు, వీధివ్యాపారుల్లో భోజనం, తినుబండారాలు తయారు, సహాయకులు, వడ్డించే వారికి టైఫాయిడ్ పరీక్షలు చేపట్టాలన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శి, ఏ.ఎన్.ఎంలు సమన్వయంతో సబ్ సెంటర్ల ద్వారా పారిశుధ్య ఆరోగ్య పరిరక్షణ చర్యలు పటిష్టంగా జరగాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పకడ్బందీగా చేపట్టాలని, పాఠశాలలు, కార్యాలయాల్లో ప్రతిఒక్కరికి అందేలా పటిష్ట కార్యాచరణ చేయాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం నగర పాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, జెడ్పి సిఇఓ అప్పారావు, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.

రాజేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, డిసిహెచ్ఎస్ రాజశేఖర్, ప్రాజెక్ట్ అధికారి డా. సైదులు, సత్తుపల్లి మునిసిపల్ కమీషనర్ సుజాత, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

విజయనగరం పైడితల్లి ఆలయ అభివృద్ధి విస్తరణ కు చర్యలు

Bhavani

టీడీపీ అభ్యర్ధి బైక్ లు తగలబెట్టిన రాజకీయ ప్రత్యర్ధులు

Satyam NEWS

జర్నలిస్టుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి

Satyam NEWS

Leave a Comment