రాజధాని, ప్రభుత్వ పనితీరు అంశాలపై బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఎంపికైన పురందేశ్వరి ఈరోజు ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆమె జాతీయ నాయకురాలో, జాతి నాయకురాలో పూర్తిగా స్పష్టమైంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి విమర్శించడం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నది.
ఇంతకాలం తెలుగుదేశం పార్టీపై కలిసి దాడి చేసిన బిజెపి, వైసీపీల మధ్య ఇప్పుడు ఇలాంటి వివాదాలు తరచూ వస్తున్నాయి.
పురందేశ్వరిపై విజయసాయి తీవ్ర వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కులంపేరుతో దాడి చేస్తారా అని ఏపీ బీజేపీ ఇన్చార్జ్ సునీల్ దేవధర్ వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీ కుల, మతాలకు అతీతంగా పని చేస్తుందని ఆయన అన్నారు.
మీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే కులం పేరుతో దాడి చేస్తారా? అని ప్రశ్నించారు. అర్హతను చూసి ఆమెకు ఇచ్చిన బాధ్యతను కులంతో ముడిపెడతారా? అని అడిగారు.
అన్నింటినీ కులమయం చేసిన వైసీపీ కులాల గురించి మాట్లాడటం చాలా ఎబ్బెట్టుగా ఉంది విజయసాయిగారూ అని మండిపడ్డారు.