39.2 C
Hyderabad
May 3, 2024 11: 25 AM
Slider సంపాదకీయం

సర్వం సమాప్తం: బీజేపీకి ఇక నూకలు చెల్లినట్లే

#bandi

ఏపిలో జగన్ కు, తెలంగాణ లో కేసీఆర్ కు ఏ మాత్రం నష్టం కలగని రీతిలో బీజేపీ తన రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక చేసుకున్నది. తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఒంటికాలిపై లేచే బండి సంజయ్ ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడం కచ్చితంగా కేసీఆర్ కు మేలు చేసేదే.

అంతే కాకుండా తెలంగాణ లో మున్నూరు కాపు కులస్తులు బలమైన సంఖ్యలో ఉన్నారు. వీరంతా వచ్చే ఎన్నికల్లో బీజేపీ వైపు చూస్తున్న సమయంలో అదే కులానికి చెందిన బండి సంజయ్ ని పార్టీ అధ్యక్షుడుగా బీజేపీ తీసేసింది. తెలంగాణ లో రెడ్డి కులస్తులు అందరూ కాంగ్రెస్ వైపు వెళుతున్నందున వారిని కట్టడి చేసి కేసీఆర్ కు మేలు చేసే విధంగా రెడ్డి కులస్తుడిని బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడుగా పెట్టింది.

అదే విధంగా ఆంధ్రాలో కాపు కులానికి చెందిన సోము వీర్రాజును తీసేసింది. కన్నా లక్ష్మీనారాయణ తర్వాత మళ్లీ అదే కులానికి చెందిన వ్యక్తికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడంతో కాపులు బీజేపీని తమ పార్టీగా లెక్క వేసుకున్నారు. అయితే ఇది జగన్ కు నష్టం చేకూర్చే అవకాశం ఉంది. జగన్ కు నష్టం చేకూర్చకుండా చూడాలంటే కమ్మ కులానికి చెందిన వ్యక్తిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పెడితే సరిపోతుంది.

కమ్మ ఓట్లను చీల్చి జగన్ కు మేలు చేసే విధంగా బీజేపీ నిర్ణయం తీసుకున్నది. ఇలా చదవేస్తే ఉన్నమతి పోయినట్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలుగు రాష్ట్రాలకు వచ్చే సరికి ఎనలేని తప్పులు చేస్తున్నది. నోటా కన్న తక్కువ ఓట్లు వచ్చే ఆంధ్రప్రదేశ్ లో, పైదాకా వచ్చి చతికిల పడ్డ తెలంగాణ లో కూడా…. బీజేపీ అధిష్టానం తీవ్రమైన తప్పులు చేస్తున్నది.

తెలంగాణ లో కేసీఆర్ ను నువ్వా నేనా అన్న స్థాయికి బీజేపీని తెచ్చిన బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. అదే విధంగా ఏపిలో కూడా సోము వీర్రాజును పదవి నుంచి తప్పించింది. బండి సంజయ్ ని తప్పించడం ఒక తప్పు అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా చేయడం మరొక తప్పుగా భావిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను జైల్లో వేయిస్తానని, తెలంగాణ నుంచి కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొడతానని సవాల్ చేసిన బండి సంజయ్ ని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు తొలగించడం బీజేపీ చేసిన అతిపెద్ద తప్పిదంగా కనిపిస్తున్నది.

కిషన్ రెడ్డి స్వతహాగా మంచి మనిషే అయినా మెతక వ్యక్తి. ఎన్నికల సమయంలో కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ పై ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోవచ్చు. తెలంగాణ లో కేసీఆర్ తో బీజేపీ సఖ్యత కోరుకుంటున్నదని చాలా కాలంగా వినిపిస్తున్న వాదన. ఈ వాదనకు అనుగుణంగానే బీజేపీ అధిష్టానం కూడా నిర్ణయం తీసుకోవడం పలువుర్ని ఆశ్చర్య పరిచింది.

బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయంతో బీఆర్ఎస్ బీజేపి ఒకే నాణానికి వేరు వేరు ముఖాలు అన్న చందంగా మారిపోయింది. చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ ఇదే చెబుతున్నది. కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్లుగానే బీజేపీ వ్యవహరించడంతో ఇక తెలంగాణ లో బీజేపీకి నూకలు చెల్లినట్లే అనిపిస్తున్నది.  దీనికి తోడు తెలంగాణ బీజేపీలో వర్గ పోరు కాంగ్రెస్ ను మించి పోవడం ఆశ్చర్యం కలిగించే పరిణామం.

తెలంగాణ బీజేపీలో ఇటీవల చేరిన వారు, గతం నుంచి ఉన్న వారు అంటూ తేడా స్పష్టంగా కనిపిస్తున్నది. ఇటీవల చేరిన వారు ఎంత పెద్ద నాయకులు అయినా కూడా బయటే నిలబెడుతున్నారనే వార్తలు గుప్పు మన్నాయి. దాంతో బీజేపీలో కొత్త వారి చేరిక ఆగిపోయింది. ఉన్న వారు కూడా పోయే పరిస్థితి ఏర్పడింది. బండి సంజయ్ ని తీసేస్తారు అనే వార్త తొలి సారి బయటకు వచ్చిన నాటి నుంచి బీజేపీ పతనం ప్రారంభం అయింది.

పది పదిహేను రోజుల్లోనే బీజేపీ పతనం అయిపోయింది. అంతకు ముందు ఎన్నో సంవత్సరాలుగా బీజేపీ తెలంగాణ లో స్తబ్దుగా ఉండిపోయింది. బండి సంజయ్ వచ్చిన తర్వాత పార్టీని పరుగులు పెట్టించిన మాట వాస్తవం. దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీ గెలవడంతో ఒక్క సారిగా ఊపు వచ్చింది. హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించిన బీజేపీ కొత్త ఆశలు రేపింది.

రెండు మూడేళ్లుగా ఉత్తుంగ తరంగంలా వచ్చిన బీజేపీ ఒక్క సారిగా….. కేవలం పది ఇరవై రోజుల్లోనే పతనం అయిపోయింది. అయితే పార్టీ నుంచి అందరూ వెళ్లిపోకుండా చూసుకునేందుకా అన్నట్లు ఈటల రాజేందర్ ను ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా తాజాగా నియమించారు. అదే విధంగా ఏపిలో అసలే అంతంత మాత్రంగా ఉన్న బీజేపీని సోము వీర్రాజు పడుకోబెట్టారు. అధికార వైసీపీకి బీ టీమ్ లాగా తయారైన ఏపి బీజేపీ నాయకులు ప్రజలపై ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు.

అరాచకం చేస్తున్న జగన్ కు బహిరంగంగా మద్దతు ఇస్తున్న బీజేపీ నాయకులను చూసి జనం ఈసడించుకుంటున్నారు. ఈ దశలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చుకున్న బీజేపీ కమ్మ కులానికి చెందిన వ్యక్తిని పెట్టడం ఘోరమైన రాజకీయ తప్పిదంగా చెబుతున్నారు. ఇప్పుడు ఏ కమ్యూనిటీ కూడా ఏపిలో బీజేపీకి సపోర్టు చేసేందుకు సిద్ధంగా లేదు. దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ కుదేలైపోయినట్లేనని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

పులిపాక సత్యమూర్తి, చీఫ్ ఎడిటర్, సత్యంన్యూస్.నెట్

Related posts

సూర్యాపేట జిల్లాలో బర్డ్ ఫ్లూపై చెలరేగుతున్న భయాందోళన

Satyam NEWS

హైదరాబాద్ లో అక్ర‌మ నిర్మాణాల‌ను కూల్చివేస్తాం

Satyam NEWS

మావోయిస్టు నంటూ ఓ ఆర్మీ ఉద్యోగి…5 కోట్ల డిమాండ్…!

Satyam NEWS

Leave a Comment