కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడిందట. సామెత అర్ధం కాకపోయినా ఫర్వేలేదు సర్దు కోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తున్నదో మాత్రం అర్ధం కావడం లేదు. అక్కడే వచ్చింది చిక్కు. విమాన ప్రమాదం జరిగిందని విమానాలన్నీ ఆపేస్తామా? రోడ్డు ప్రమాదం జరిగిందని బస్సుల్లో ఎక్కడం మానేస్తామా? రైలు పట్టాలు తప్పిందని రైళ్లు తిరక్కుండా చేసేస్తామా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అలానే చేసింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో కచ్చలూరు వద్ద గోదావరి నదిలో సెప్టెంబర్ 14న దురదృష్టవశాత్తూ ఒక పడవ ప్రమాదం జరిగింది.
చాలా మంది చనిపోయారు. కొందరు అదృష్టం కొద్ది బయటపడ్డారు. గోదావరికి వరద ఉధృతంగా ఉన్న సమయంలో లాంచి నదిలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం వల్లే ప్రమాదం జరిగిందని వార్తలు వెలువడ్డాయి. ఎక్కించాల్సిన వారికన్నా ఎక్కువ మందిని తీసుకెళ్లడం వల్ల ప్రమాదం జరిగిందని కూడా అనుకున్నారు. సురక్షిత మైన రూటు వదిలి ప్రమాదకరమైన రూటులో పోవడం వల్ల ప్రమాదం జరిగిందని అన్నారు.
మునిగి పోయిన పడవను బయటకు తీశారు. మరి కొన్ని మృతదేహాలు వెలికివచ్చాయి. ఇదంతా జరిగింది ఎవరి వల్ల? తెలియదు. ఎందుకు జరిగింది? తెలియదు.
ఏ లాంచి ప్రమాదానికి ఒక్క కారణం ఉండదు. ఆంధ్రప్రదేశ్ లో చాలా తీర ప్రాంతాలలో పర్యాటకులను ఆకర్షించేందుకు బోట్ విహారం ఎట్రాక్షన్ పెట్టారు. నదిలోనో సముద్రంలోనో చెరువులోనో బోటు షికారు వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు బోటు నడింపేందుకు లైసెన్సులు ఆ లైసెన్సులు ఇచ్చేందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. బోటు ఎక్కే వారికి విధిగా లైఫ్ జాకెట్టు ఇవ్వాలనే నిబంధన కూడా ఉంది. ఇవన్నీ అమలు చేయడానికి యంత్రాంగం కూడా ఉంది.
ఈ యంత్రాంగం ఇప్పటికే ఉన్న నిబంధనలు పాటించేలా చేయడం, లంచాలు తీసుకుని చట్ట విరుద్ధంగా అనుమతులు ఇచ్చేవారిని అదుపు చేయడం లాంటి పనులు చేస్తే చాలు. కొత్తగా ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. చేయాల్సిన పనులేం చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలోని అన్ని పర్యాటక కేంద్రాల్లో పడవలు, లాంచీలు, స్పీడ్ బోట్ లు అన్నింటిని ఆపేసింది.
మేం వచ్చి తనిఖీ చేసి ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఇచ్చేంత వరకూ తిప్పడానికి వీల్లేదని చెప్పేసింది. వారు రారు, తనిఖీ చేయరు. పడవలు తిరగడం లేదు. వందలాది మందికి ఉపాధి పోయింది. వేలాది మందికి ఆహ్లాదం పోయింది.