నిర్భయ పట్ల అమానుషంగా ప్రవర్తించిన నలుగురు దోషులు చట్టంతో కూడా అదే విధంగా ఆడుకుంటున్నారు. చట్టంలో ఉన్న లోపాలను ఉపయోగించుకుని వారు నిరభ్యంతరంగా ప్రాణాలతో జీవించి ఉంటున్నారు. సుదీర్ఘమైన న్యాయ ప్రక్రియ ఎంతకూ తెగడం లేదు. ఈ నేపథ్యంలోనే నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష అమలు వాయిదా పడటంపై దేశ ప్రజలు అసహనంతో ఉన్నారని కేంద్రం సుప్రీంకోర్టుకు విన్నవించింది. నిర్భయ కేసులోని దోషులకు ఉరి శిక్ష వాయిదా పడటంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది.
ఈ సందర్భంగా కేంద్రం తరపు లాయర్ తుషార్ మెహతా కోర్టులో వాదించారు. చట్టంలో ఉన్న లొసుగుల కారణంగా దోషులు న్యాయవ్యవస్థను అపహస్యం చేస్తున్నారని ఆయన కోర్టుకు విన్నవించారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ విషయంలో కలుగుజేసుకుని నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు జరిగే విధంగా చట్టాల్లో మార్పులు చేయాలని కోరారు. దోషులు ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్‌ను విడివిడిగా ఉరి తీయాలని అందుకు సుప్రీంకోర్టు అనుమతించాలని ఆయన కోరారు. ఈమేరకు దోషులకు నోటీసులు జారీ చేయాలని లాయర్ తుషార్ మెహతా విఙ్ఞప్తి చేశారు. మంగళవారంనాడు కేసును విచారిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది.