Slider ప్రత్యేకం

చెల్లుబోయినకు ఇక చెల్లుచీటీ

#ministerchelluboina

రాష్ట్ర ప్రభుత్వం పరువు మొత్తం తీసేసిన సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పదవి ఊడటం ఖాయంగా కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి జగన్ మంత్రి పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తక్షణమే ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించాలని సీఎం భావించగా ఒక్కరిని అలా చేయడం భావ్యం కాదని, త్వరలో మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ ముహూర్తం పెట్టుకుని చేద్దామని అధికారులు వారించినట్లు తెలిసింది.

మంత్రి పేషీలో పనిచేసే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి గత ఆరు నెలలుగా వేతనాలు చెల్లించక పోవడంతో పేషీ తాళాలు తీయకుండా వారు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన సచివాలయంలో కలకలం సృష్టించింది. మంత్రి  పేషీలో పనిచేస్తున్న ఏడుగురు సిబ్బందిలో అటెండర్‌లు, కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు. వీరికి కాపు కార్పోరేషన్, బీసీ కార్పోరేషన్లు నుంచి వేతనాలు అందేలా ఏర్పాటు చేశారు.

అయితే పేషీలో సిబ్బందికి 2022 డిసెంబర్ నుంచి జీతాలు రావడం లేదు. మంత్రికి, అధికారులకు సిబ్బంది జీతాల గురించి చెప్పినా ఫలితం కనబడలేదు. ఈ  నేపథ్యంలో ఉద్యోగులు సహాయ నిరాకరణకు దిగారు. తమ జీతాల విషయంలో అనేక మార్లు ఓఎస్డీ, మంత్రిని అడిగినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో వారు మంత్రి కార్యాలయం కూడా తెరవకుండా వారంతా వెళ్లిపోయారు.

జీతాలు లేవు అందువల్ల తమకు దారి ఖర్చులకు డబ్బులు లేవంటూ పేషీ సిబ్బందికి ఉద్యోగులు ఫోన్‌లోనే సమాచారం ఇచ్చారు. జీతాల చెల్లింపుల్లో ఎవ్వరూ బాధ్యతగా సమాధానం చెప్పకపోవడంతో  మనస్థాపంతో విధులకు హాజరు కామని అవుట్ సోర్సింగ్  ఉద్యోగులు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రి పేషీకి తాళాలు పడ్డ విషయం ప్రసార మాధ్యమాల్లో రావడంతో అధికారులు ఆఘమేఘాల మీద సెక్రెటరియేట్ కు వచ్చి మంత్రి  పేషీని మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తెరిచారు.

ఈ సంఘటనతో ముఖ్యమంత్రి జగన్ పరువు మొత్తం పోయింది. అసలే ఖజానా దివాలా తీసిందని వార్తలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మంత్రి పేషీ బంద్ కావడంతో ముఖ్యమంత్రి జగన్ కు తీవ్రంగా ఆగ్రహం వచ్చినట్లు తెలిసింది. మంత్రి అసమర్థత వల్లే అలా జరిగిందని సీఎం భావిస్తున్నారు. ఈ మొత్తం విషయంపై ప్రతిపక్షాలు ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో ప్రభుత్వం తన ప్రతిష్టను కాపాడుకోవడానికి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.

తన పేషీలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు డిసెంబర్  నెల నుంచి చెల్లించాల్సిన వేతనాలను వెంటనే చెల్లించాలని మంత్రి చెల్లుబోయిన  ఆదేశించారు. వేతనాల చెల్లింపులో సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని రెగ్యులర్ గా జీతాలు చెల్లించాలని ఆదేశాలు జారీచేశారు. సిబ్బంది వేతనాల చెల్లింపు బాధ్యతను కాపు కాపు కార్పొరేషన్ ఎండీ అర్జున రావుకు  అప్పగిస్తూ బిసీ వెల్ఫేర్  స్పెషల్ సిఎస్ అనంత రాములు ఆదేశాలు జారీ చేశారు.

బాధ్యతలను నిర్వర్తించడంలో ఘోరంగా విఫలం అయిన మంత్రి కనీసం తన సిబ్బందికి జీతాలు కూడా ఇప్పించుకోలేకపోవడం పై సీఎం తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వ పరమైన విషయాలను ఏ మాత్రం మంత్రి పట్టించుకోవడం లేదని, ప్రతిపక్షాల విమర్శలు తిప్పి కొట్టడంలో కూడా ఏ మాత్రం బాధ్యతగా వ్యవహరించడం లేదని సీఎం జగన్ ఇప్పటికే మంత్రి చెల్లుబోయిన పై కినుక వహించారు. ఈ సంఘటనతో ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

Related posts

పోలీస్ రిక్రూట్మెంట్ లో నిబంధనలు సడలించాలి

Satyam NEWS

నగరి మున్సిపాలిటీలో మంత్రి రోజాకు మంగళహారతులు

Satyam NEWS

భారీ వర్షాలపై కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్

Satyam NEWS

Leave a Comment