కామారెడ్డి జిల్లా కేంద్రంలో కరోనా కేసు కలకలం సృష్టించింది. జమ్మూకాశ్మీర్ లో సీఆర్పీఎఫ్ జవాన్ గా పని చేసి వచ్చిన జిల్లా వాసికి కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో అతను ఆస్పత్రికి వచ్చాడు. జిల్లాకు చెందిన ఆ జవాన్ మూడు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ నుంచి రైలులో వచ్చాడు.
అదే రైలులో ఇండోనేషియా నుంచి 8 మంది వచ్చారు. ఆ 8 మందికి కరోనా పాజిటివ్ రావడంతో వారితో పాటు వచ్చిన జవాన్ కు కూడా కరోనా వచ్చిందేమోనని భయపడ్డాడు. మూడు రోజులుగా గ్రామంలోనే ఉన్న అతను జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పితో బాధపడుతున్నాడు.
లక్షణాలు అన్ని కరోనా కు సంబంధించినవిగా ఉండటంతో నేడు ఉదయం జిల్లా ఆస్పత్రికి వచ్చి చికిత్సలు చేయించుకున్నాడు. అతడిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్సలు నిర్వహించారు. కరోనా పరీక్షల నిమిత్తం అతడిని హైదరాబాద్ చెస్ట్ ఆస్పత్రికి ప్రత్యేక అంబులెన్స్ లో తరలించారు.
ఈ విషయమై జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ మాట్లాడుతూ 13 వ తేదీన సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలులో ఆర్మీ నుంచి జవాను వచ్చాడని చెప్పారు. అతనితో పాటు వచ్చిన వారికి కరోనా సోకడంతో పరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి వచ్చాడని తెలిపారు.
అతడిని హైదరాబాద్ తరలించామని చెప్పారు. ప్రజలు కరోనా పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని కోరారు.