38.2 C
Hyderabad
May 1, 2024 20: 29 PM
Slider సంపాదకీయం

కోనసీమ జిల్లా వైసీపీలో అసమ్మతి జ్వాలలు

#Konaseema district

ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రభంజనంతో ఒకవైపు బెంబేలెత్తి పోతున్న అధికార వైకాపాకి మరోవైపు సొంత పార్టీ నేతల్లో పెరుగుతున్న అసమ్మతి, అసంతృప్తి దడపుట్టిస్తున్నది.

సీఎం జగన్ రెడ్డికి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం సీటు కోసం మంత్రి చెల్లుబోయిన, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాశ్‌ పోటీ పడుతున్నారు. వీరుభయులు శెట్టి బలిజ సామాజిక వర్గం కావడం గమనార్హం. ఇప్పటికే ఈ సీటును మంత్రి చెల్లుబోయినకు అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం.

రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా తన రెండో కుమారుడైన పిల్లి సూర్యప్రకాశ్‌ను ప్రకటించాలని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కొన్నాళ్లుగా జగన్ ను కోరుతున్నారు.

అయితే, ఈ విషయాన్ని పార్టీ పెద్దలు పెద్దగా పట్టించుకోలేదు.

రామచంద్రపురంలోని ఎంపీ క్యాంపు కార్యాలయం వద్ద వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మద్దతుదారుల ప్రకటన జిల్లాలో చర్చనీయాంశమైంది. శ్రావణ మాసంలో ఎంపీ తనయుడు సూర్యప్రకాశ్‌ రాజకీయ అరంగేట్రం చేస్తున్నారని, వైసీపీ అభ్యర్థిగా రామచంద్రాపురం నియోజకవర్గంలో గ్రామగ్రామానా పర్యటిస్తారని వారు ఎంపీ బోస్‌ సమక్షంలోనే ప్రకటించారు.

మంత్రి వేణుకు మళ్లీ టికెట్‌ ఇస్తే స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేస్తారని మద్దతుదారులతో ఎంపీ బోస్ చెప్పించారు.
ఈ వ్యాఖ్యలు ఆయనే చెప్పించినట్టు అయిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన్నే అభ్యర్థిగా పార్టీ ఇప్పటికే పరోక్షంగా ప్రకటించింది.

వేణుతో ఉన్న విభేదాల నేపథ్యంలో ఎంపీ బోస్‌ తన కుమారుడిని ఎన్నికల బరిలోకి దింపాలని భావిస్తున్నారు. ఒకవేళ వైసీపీ అధినేత మంత్రి వేణుగోపాలకృష్ణకే రామచంద్రపురం టికెట్‌ ఖరారు చేస్తే బోస్‌ స్వతంత్ర అభ్యర్థిగా అయినా బరిలోకి దిగుతారని ఆయన వర్గీయులు చెప్పడం ఇక్కడ సంచలనం కలిగించింది.

మంత్రి, ఎంపీ ఇద్దరూ శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో వారి మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది.మరోవైపు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, యానాంకు చెందిన మాజీ ముఖ్యమంత్రి మల్లాడి కృష్ణారావులను బోస్‌ ఇటీవల కలిసి ఈ విషయాన్ని వారికి కూడా తెలిపినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందే కోనసీమలో వైసీపీ నేతల మధ్య అంతర్గతంగా ఉన్న విభేదాలు బహిర్గతమైనట్టయింది.

ఇదిలావుంటే ఎంపీ మిథున్‌రెడ్డి కాకినాడ, కోనసీమ జిల్లాల పర్యటనకు బోస్‌ దూరంగా ఉన్నారు. దీనికి గల కారణాలేమిటని ఎంపీ మిథున్‌రెడ్డిని అమలాపురంలో పాత్రికేయులు ప్రశ్నించారు. అనారోగ్య కారణాల వల్ల ఆయన హాజరు కాలేదని ఎంపీ మిథున్‌రెడ్డి వివరణ ఇచ్చారు.

తన కుమారుడికి సీటు ఇవ్వడంపై వెనకడుగు వేస్తున్న వైసీపీ అధిష్టానంపై ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అలక బూనారని కూడా అంటున్నారు. కష్ట కాలంలో జగన్‍కు మద్దతుగా నిలిచిన బోసుకు అన్యాయం జరిగిందని ఆయన వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నియోజకవర్గంలో మంత్రి వేణు బోసు వర్గీయులను టార్గెట్ చేస్తున్నారని ఎంపీ బోస్ వర్గం ఆరోపిస్తోంది. పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని పిల్లి సుభాష్ వర్గం వాపోతోంది. ఈ వర్గ విభేదాలతో అమలాపురంలో జరిగిన పార్టీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. ఇలా వైసీపీ వర్గాలు బయటపడి కొట్టుకోవడం ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది. రాజమండ్రి మీటింగ్‍కి కూడా బోస్ వర్గం డుమ్మా కొట్టడం హాట్ టాపిక్ గా మారింది.

రామచంద్రపురంలోనే ఉన్నా బోస్ పార్టీ సమావేశాలకు దూరంగా వుండడం గమనార్హం. అవసరమైతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని అనుచరులకు చెప్పిన పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పినట్లు సమాచారం.మొత్తం మీద మంత్రి వేణు.. ఎంపీ బోస్ ల అంతర్గత విభేదాలు పార్టీ అధినేత జగన్ కు శిరో భారంగా మారిందనడంలో సందేహం లేదు.

Related posts

లిక్కర్ స్కాంలో సంచలనం

Murali Krishna

వేతనాలు పెంపు కోసం ఏప్రిల్ 5న సమగ్ర శిక్ష సదస్సు

Satyam NEWS

మే 1న ఉత్తరాంధ్ర ఇలవేల్పు దేవర ఉత్సవం

Satyam NEWS

Leave a Comment