ఉద్యోగ భద్రత, రెగ్యులరైజేషన్ సాధించడం కోసం ఉద్యోగులు నిరంతరం పోరాటం చేయాలని సమగ్ర శిక్షా అభియాన్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ పార్ట్ టైం ఎంప్లాయిస్ అనంతపురం జిల్లా ఉద్యోగుల సదస్సు పిలుపునిచ్చింది. అందులో భాగంగా వచ్చే నెల 5 వ తేదీన విజయవాడలో జరిగే సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సమగ్ర శిక్షా అభియాన్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ పార్ట్ టైం ఎంప్లాయిస్ అనంతపురం జిల్లా ఉద్యోగుల సదస్సుకు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏవి నాగేశ్వరావు, రాష్ట్ర అధ్యక్షులు ఎం.బాలకాశి హాజరయ్యారు. సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలు పై సుదీర్ఘంగా చర్చించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు నుండి సర్వ శిక్షా అభియాన్ సమస్యలపై జెఏసి చేసిన ప్రతిపాదనలను ఉద్యోగులకు వివరించారు.
అన్ని విభాగాలకు జీతాలు పెరిగే వరకు జేఏసీ చేసే ఐక్య పోరాటాల్లో ఉద్యోగులు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేసారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొంత మంది ఉద్యోగులను విభజిస్తున్నారని, ఇది ఉద్యోగ ఉద్యమానికి నష్టం అని తెలియజేశారు.
ఈ సమావేశంలో జిల్లా జెఏసి అధ్యక్షుడు కె.విజయ్ అన్ని విభాగాల నాయకులు దివాకర్, ఈశ్వర్, చౌడప్ప, నాగజ్యోతి, రమాదేవి, రాజేశ్వరి, శ్రీధర్, మాధవ్ ఆరిఫా,మల్లికార్జున్ రెడ్డి, జయమ్మ, భవాని, మనోహర్, ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్ర సదస్సు విజయవంతం చేయాలని సభ తీర్మానించింది.