23.2 C
Hyderabad
May 7, 2024 20: 11 PM
Slider ప్రత్యేకం

తాగి కారు నడిపి ఇద్దర్ని చంపిన కొడుకును కాపాడేందుకు….

#road accident

పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు మందలించాలి. అలా మందలిస్తే పిల్లలు తప్పు చేయకుండా ఉంటారు. పెద్దవారు అయిన తర్వాత కూడా తల్లిదండ్రులు నేర్పిన క్రమశిక్షణను పాటిస్తారు. తప్పు చేసిన పిల్లవాడ్ని దండించడం మాట అటుంచి ఎవరైనా నెత్తినెక్కించుకుంటారా? ఈ క్యాటగిరి వ్యక్తులు కూడా ఉంటే ఉండవచ్చు.

కానీ…….పీకలదాకా తాగి మద్యం మత్తులో యాక్సిడెంట్ చేసి ఇద్దరిని చంపిన వాడ్ని కూడా వెనకేసుకువచ్చిన ఆ తండ్రిని ఏమనాలి? ఏమని పిలుస్తారో మీ ఇష్టం. మాదాపూర్‌లోని మైహోం అబ్రా అపార్ట్‌మెంట్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఓ ఆడి కారు అతివేగంగా వచ్చి ఆటోను ఢీ కొట్టింది. దాని దెబ్బకు ఆటో ఒక్కసారి ముందుకు ఎగిరి… గింగిరాలు తిరుగుతూ దూరంగా పడిపోయింది.

సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు అత్యంత భయానకంగా ఉన్నాయి. ఈ విజువల్స్ ను సత్యం న్యూస్ ఉదయం పోస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఆటోలో ప్రయాణిస్తున్న ఉమేశ్ కుమార్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆటో డ్రైవర్ ఆ తర్వాత మరణించాడు. సీసీ కెమరాలను పరిశీలించి పోలీసులు కారు నడిపిన వ్యక్తి ఉప్పల్‌లోని విజయ్‌పురి కాలనీలో ఉండే వాకిటి రఘునందన్ రెడ్డి కుమారుడు సుజిత్ రెడ్డి(24)గా గుర్తించారు.

ఇతను గోవాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ కాలేజ్‌లో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం రాత్రి స్నేహితుడు పి.ఆశిష్‌తో కలిసి కారులో రాయదుర్గంలో వచ్చాడు. అక్కడే తెల్లవారుజాము వరకు మద్యం తాగి ఉదయం ఇంటికి బయలు దేరారు. మత్తులో కారు నడిపిన సుజిత్..  అతివేగంతో నిర్లక్ష్యంగా ఆటోను ఢీకొట్టాడు.

ఆధారాలు ఉండకూడదనే ఉద్దేశంతో కారు నంబర్ ప్లేట్లను తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఈ కేసులో తన కుమారుడిని తప్పించేందుకు తండ్రి సినీ ఫక్కీలో ప్రయత్నించాడు. తమ డ్రైవర్‌ను తీసుకు వెళ్లి పోలీసుల ముందు నిలబెట్టాడు.  కారు నడిపింది తన కుమారుడు కాదని తన వద్ద పనిచేసే డ్రైవర్ అని రఘునందన్ రెడ్డి డ్రైవర్ పోలీసులకు తెలిపాడు.

అయితే అతని మాటలను పోలీసులు అస్సలు పట్టించుకోలేదు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు అందులో దృశ్యాల ఆధారంగా సుజిత్ రెడ్డే కారు నడిపాడని, అతనితో పాటు కారులో ఉన్నది పి.ఆశిష్ అని నిర్ధారించారు. ఈ మేరకు నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Related posts

పోలీసుల ప్రేక్షకపాత్ర: తల్లీకూతుళ్ల ఆత్మహత్య

Satyam NEWS

స్టాటిట్యూటరీ వార్నింగ్: ప్రజలారా మంచి వాళ్లనే ఎన్నుకోండి

Satyam NEWS

కళలకు కాణాచి నగరంలో భోగీ ఉత్సవం…!

Satyam NEWS

Leave a Comment