42.2 C
Hyderabad
May 3, 2024 17: 26 PM
Slider ముఖ్యంశాలు

ఉపాధి హామీ పనులపై నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదు

#nagarkurnool

ఉపాధిహామీ పథకంలో కూలీల పని రోజులు లక్ష్యానికి అనుగుణంగా లక్ష్యం సాధించాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని నాగర్ కర్నూల్ జిల్లా జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు.  గురువారం కల్వకుర్తిలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యాలయంలో ఉపాధిహామీ పనులపై ఏ.పి.ఓ, పంచాయతి సెక్రెటరీలు, సాంకేతిక సహాయకులు, ఈ.సి లతో  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ ఉపాధిహామీ పని దినాలు తక్కువగా ఉన్న గ్రామ పంచాయితీ సెక్రెటరీలు, ఇతర సిబ్బందిని  నిలదీశారు. 

మార్చి 31 వరకు నిర్దేశించిన పనిదినాలు పూర్తి అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉదయాన్నే గ్రామాల్లో పర్యటించి మేట్ లతో మాట్లాడి ఉపాధి హామీ కూలీల సంఖ్య పెరిగే విధంగా చూడాలన్నారు.  గ్రామాల్లో సరిపడా పని ఉండి,  పని చేసే జాబికార్డు దారులు ఉండి లక్ష్యం మేరకు పనిదినాలు పూర్తి కాకపోవడం సిబ్బంది నిర్లక్ష్యంగానే పరిగణించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

ప్రతివారం శ్రమ శక్తి సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి పనులపై అవగాహన కల్పించాలని జాబ్ కార్డు ఉన్నవారందరూ పనికి వచ్చే విధంగా  సమాయత్తం చేయాల్సిందిగా ఆదేశించారు.  ఏ.పి.ఓ లు ఎంపిడిఓ తరచుగా సమీక్షలు నిర్వహించాలని, గ్రామాలను సందర్శించి అలసత్వం ప్రదర్శించే సిబ్బందిని  ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ చర్యలు తీసుకోవాలని సూచించారు.  టూర్ డైరీ, టూర్ ప్లాన్ తనకు పంపించాలని ఎంపిడిఓ ను ఆదేశించారు.  ఇక నుండి ఉపాధిహామీ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని, తరచుగా సమీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 

ఈ సమావేశానికి అనుకోకుండా విచ్చేసిన పార్లమెంట్ సభ్యులు పి. రాములు  మాట్లాడుతూ  గ్రామ అభివృద్ధికి సంబంధించి పంచాయతి సెక్రెటరీలపై గురుతర బాధ్యతలు ఉన్నాయని అన్నారు.  రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శి ఎంతనో గ్రామంలో పంచాయతి సెక్రెటరిది అదే బాధ్యత అని అన్నారు.  

ప్రభుత్వం ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జలుగుతుందని వాటిని పూర్తి చేసేందుకు పంచాయతి సెక్రెటరీలు కృషి చేయాలన్నారు.  ముఖ్యముగా జాతీయ ఉపాధి హామీ పథకమని ఇందులో నిధులకు కొదవ ఉండదన్నారు. ఖర్చు చేసేకొద్ది వస్తూనే ఉంటాయని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించి గ్రామాభివృద్ధి చేసుకోవాలన్నారు. 

ప్రభుత్వ భూములకు ట్రెంచింగ్ చేయడం, బండ్ల బాటలు వేయడం, పేద రైతుల భూమి అభివృద్ధి చేయడం,  రైతు కల్లాలు నిర్మించడం వంటి అనేక పనులు చేసుకోవచ్చన్నారు.  లేబర్ కాంపోనెంట్ ఎంత పెరిగితే మెటీరియల్ కాంపోనెంట్ కింద కోట్ల రూపాయలు సిసి రోడ్లకు మంజూరు అవుతాయని తెలిపారు.  అదేవిధంగా ఉపాధిహామీ కూలీలకు పనిచేసే చోట మౌళిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. 

తాగు నీరు, సేద తీరేందుకు టెంట్, ప్రథమ చికిత్స కిట్లు, గడ్డపారలు, ఇతర పనిముట్లు అందుబాటులో ఉంచాలని పంచాయతీ సెక్రెటరీలు సూచించారు.  మన ఊరు మన బడి అనే చక్కని కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారని, మీ గ్రామాల్లోని పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకునే విధంగా కృషి చేయాలని తెలియజేసారు.  ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 68వ  జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ  ఇకపై ఉపాధిహామీ లో లక్ష్యం మేరకు పనిచేయని పంచాయతి సెక్రెటరీలు, టి.ఏ లు, ఈ.సి లతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి నిలదీయడం  జరుగుతుందన్నారు.  ప్రతిరోజు పారిశుధ్య నివేదిక విధిగా పంపాలని, రోడ్ల పై ఎక్కడ ప్లాస్టిక్, చెత్త కనబడకుండా చూడాలన్నారు. 

ఇంటింటి నుండి చెత్త సేకరణ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.  రైతు కల్లాలు నిర్మించేందుకు ఇప్పుడు తగిన సమయమని, కొత్త రైతులు ఎవరైనా ముందుకు వస్తే వారి పేర్లపై ఎస్టిమేట్ జనరేట్ చేయాల్సిందిగా ఆదేశించారు.  హరితహారంలో  భాగంగా నాటిన మొక్కలకు నీరు పోయించి వంద శాతం బతికించుకోవాలని, వచ్చే హరితహారం లో ఎక్కడా ఖాళీ ప్రదేశం కనిపించకుండా మొక్కలు నాటేందుకు ఇప్పటి నుండే పక్కా ప్రణాళికలు రూపొందించుకోవలన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న కల్వకుర్తి జడ్పిటిసి భరత్ ప్రసాద్ మాట్లాడుతూ ఉపాధిహామీ లో పనిచేసే కూలికి సకాలంలో డబ్బు వారి ఖాతాలో జమ అయ్యేవిధంగా చూడాలని అట్టి  సమాచారం సంబంధిత కూలికి తెలియజేయాలన్నారు.  మండల సమావేశాల్లో ఉత్పన్నం అయ్యే అంశాలను జిల్లాపరిషత్ సమావేశంలో సైతం చర్చించే విధంగా చుస్తే బావుంటుందని కలెక్టర్ ను కోరారు.  మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పూర్వ విద్యార్థులు, ఎన్. ఆర్.ఐ లను భాగస్వాములను చేసి విరాళాలు సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఎంపిపి సునీత మాట్లాడుతూ గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనుల పై ఎంపిపి లకు సమాచారం ఉండటం లేదని తమకు సమాచారం ఇస్తే మా వంతుగా గ్రామ అభివృద్ధిలో సహకారం అందిస్తామని తెలియజేసారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాజేష్ కుమార్, పి.డి డిఆర్డీఏ నర్సింగ్ రావు,  వైస్ ఎంపిపి  గోవర్ధన్, ఎంపిడిఓ బాలచందర్, ఏపీఓ, పంచాయతీ సెక్రెటరీలు, టి.ఎ. లు,  ఈ.సి లు తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని పరామర్శించిన కొల్లాపూర్ ఎమ్మెల్యే

Satyam NEWS

రియల్లీ:కోవిడ్ అంత ప్రమాదకరం కాదట

Satyam NEWS

కూతురిపై కన్నేశాడు కొడుకు చేతిలో చచ్చాడు

Satyam NEWS

Leave a Comment