32.2 C
Hyderabad
May 13, 2024 22: 19 PM
Slider ప్రత్యేకం

అందరూ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఇది

#munugodu

మూడు నెలల పాటు హోరా హోరీగా సాగిన మునుగోడు ఉపఎన్నిక  ఫలితం రాజకీయ పార్టీలకు ఏమి నేర్పించిందో తెలుసుకోవాల్సిన సమయం ఇది. మునుగోడు ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మంగా స్వీకరించిన అధికార తెరాస, వైరి పక్షాలు బీజేపీ, కాంగ్రెస్ ల తో పాటు తెరాసకు మద్దతుగా నిలిచిన ఉభయ కమ్యునిస్ట్ పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకునే పరిస్థితిని ఈ ఎన్నిక ఫలితం కల్పించింది. ముందుగా తెరాస విషయానికి వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా మొత్తం మంత్రి మండలి, పార్టీకి చెందిన ఇతర ముఖ్యులు పార్టీ గెలుపుకోసం కంటే బీజేపీ ప్రభావాన్ని నియంత్రించే పనిపై ఎక్కువగా దృష్టి సారించాయి. అందులో భాగంగానే..   నలుగురు అధికార తెరాస ఎమ్మెల్యే లను అనైతికంగా కొనుగోలు చేయడానికి సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు కుట్ర చేసినట్లు తెరాస అధినేత, ఆ పార్టీ నేతలు ఎదురుదాడికి దిగడం వంటివి తెరపైకి వచ్చాయి.

అయితే ఈ విషయంలో చట్టం ఏవిధంగా నేరస్తులను శిక్షిస్తుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. ఇదిలా ఉండగా ఇదంతా కేసీఆర్ సృష్టించిన డ్రామా అని బీజేపీ అడ్డంగా కొట్టిపారేసింది. మునుగోడు ఉపఎన్నికలో ఓటమి తప్పదని గ్రహించి ఓటర్ల సానుభూతితో ఎలాగైనా గట్టెక్కాలని కేసీఆర్ బృందం, అధికారులు కలిసి ఆడిన నాటకం ఇదని ఆ పార్టీ విమర్శించింది. నిజానిజాలు ఎలా ఉన్నా ఈ ఉపఎన్నిక వల్ల తెరాస,ఆ పార్టీకి దన్నుగా నిలిచిన ఉభయ కమ్యూనిస్టులకు ఒక ఆయుధం చేతికి చిక్కినట్టు అయింది. అది తెరాస విజయానికి ప్రధాన కారణమైందని విశ్లేషకులు అంటున్నారు.

ఈ సందర్భంగా తెరాస నేర్చుకోవాల్సిన అంశం ఏమిటంటే… రానున్న సాధారణ ఎన్నికలలో బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా బరిలో నిలవడం ఖాయం అనేది. అంతే కాదు.. ఇప్పుడు సాధించిన గెలుపుకు  పార్టీ అభ్యర్థి కూసుకుంట్లపై ఉన్న సానుభూతితో పాటు  నియోజకవర్గంలో వామ పక్షాలకు ఉన్న దాదాపు 15 వేల ఓట్ల బదలాయింపు కూడా కలిసివచ్చిందని తెరాస గమనించాలి. ఇక 10 వేలకు పైగా ఓట్ల  తేడాతో తెరాస చేతిలో ఓడిన బీజేపీ ఈ ఉపఎన్నిక ఫలితంతో తన వ్యూహాలను మరింత పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలి. తెరాస పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బీజేపీ అభ్యర్థి రాజ గోపాల్ రెడ్డి కి లబ్ది చేకూరుస్తుందని ఆశించి భంగపడింది. తాజా మాజీ ఎమ్మెల్యేకి నియోజకవర్గంలో ఉన్న పలుకుబడి, కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వ పథకాలు తెరాసను సునాయాసంగా ఓడించేందుకు పనిచేస్తాయని ఊహించిన బీజేపీకి ఈ ఫలితం ఎదురుదెబ్బ తినిపించింది.

కేంద్రం నుంచి జాతీయస్థాయి నేతలను రంగంలోకి దించినా తెరాస విజయాన్ని నిలువరించడం బీజేపీకి సాధ్యపడలేదు. ఈ అంశంపై ఆ పార్టీకి చెందిన రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు నిజాయతీగా ఆత్మ విమర్శ చేసుకుంటే దిద్దుకునే అవకాశం ఉంది. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు కొందరు పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులదే నని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేయడం వంటి అంశాలు పార్టీకి ఏమాత్రం లాభం చేకూర్చేవికావు. ఓటమిని  అంగీకరించి,  గతంలో జరిగిన పొరపాట్లు రానున్న ఎన్నికల్లో పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలి తప్ప ఇలా సంకుచిత ధోరణిలో మాట్లాడడం పార్టీకి శ్రేయస్కరం కాదని నేతలు గుర్తించాలి.

ఇక కాంగ్రెస్ కు చావు దెబ్బ రుచి చూపించిన మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ఆ పార్టీ భవిష్యత్తుపై ప్రజలకు సానుకూల దృక్పథం లేదని రుజువుచేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని తిరిగి సాధించలేకపోవడం ఆ పార్టీ లో ఉన్న అంతర్గత కలహాలేనని మరోసారి తేటతెల్లమైంది. కాంగ్రెస్ పార్టీలో  మొదటినుంచీ   సహజంగా ఉన్న సొంత ఇంటి రచ్చ కారణంగా తెలంగాణలో మరొక స్థానం కోల్పోయిన పార్టీగా కాంగ్రెస్ అప్రతిష్ట పాలైంది. కనీసం డిపాజిట్ కూడా దక్కని దారుణస్థితి చూసి కూడా ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ఆ పార్టీ తెలంగాణ లో మన గలగడం అసాధ్యం అంటున్న విశ్లేషకుల మాటలు గమనార్హం.

ఇక చివరిగా … తెలంగాణ రాష్ట్రంలో ఉభయ కమ్యునిస్ట్ పార్టీలకు ఇప్పటికీ అంతో ఇంతో ఓట్ బ్యాంకు ఉందనేది కాదనలేని సత్యం. కానీ.. సీపీఐ, సీపీఎం , ఇతర వామ పక్ష పార్టీల మధ్య సిద్ధాంత పరమైన విభేదాలు ఉన్నా ఎన్నికల క్షేత్రంలో సమైక్యంగా నిలబడితే మంచి ఫలితాలు వస్తాయని పరిశీలకులు సూచిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికలో తెరాస సాధించిన విజయానికి వామ పక్షాల ఓట్లు బలమైన కారణం అనేది నిర్వివాదాంశం. మునుగోడు ఎన్నికల ఫలితం ఒక్కటే అంతిమ అంశంగా కాకుండా ఏ పార్టీకి ఆ పార్టీ  వాటి బలాలను, బలహీనతలను ఆత్మ వంచన లేకుండా సమీక్షించుకునే గొప్ప అవకాశం ఈ ఉపఎన్నిక కల్పించిందని నమ్మాలి.

పొలమరశెట్టి కృష్ణారావు, రాజకీయ సామాజిక విశ్లేషకుడు

Related posts

హుజూరాబాద్ లో పెట్రో ధరలపై వెల్లువెత్తిన నిరసన

Satyam NEWS

మహిళల్లో పెరుగుతున్న ఆత్మస్థైర్యం: ఎంపీ ఆదాల

Satyam NEWS

ఏలియన్స్‌ కోసం ఎర్త్ బ్లాక్‌ బాక్స్‌ రెడీ

Sub Editor

Leave a Comment