28.7 C
Hyderabad
May 5, 2024 10: 58 AM
Slider సంపాదకీయం

ప్రభుత్వ ప్రతిష్టను మంటగలిపిన ‘రైతు సంకెళ్లు’

#AmaravatiFarmers

పోలీసు వ్యవస్థ ద్వారా రాజ్యం నడపాలనుకున్న వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ వ్యవస్థ చేసే పనులతోనే తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నది. చాలా సందర్భాలలో పోలీసు వ్యవస్థ ద్వారా రాజకీయ ప్రత్యర్థులను అడ్డుకోవడానికి అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది.

పోలీసు వ్యవస్థ కూడా దీనికి పూర్తిగా సహకరించింది. ఈ క్రమంలోనే పోలీసు వ్యవస్థ తీసుకున్న నిర్ణయాలు, అతి జాగ్రత్తలు వికటించి ప్రభుత్వానికి దారుణమైన చెడ్డపేరు వచ్చింది. పలు సందర్భాలలో హైకోర్టు కూడా పోలీసు వ్యవస్థను తప్పుపట్టింది.

అధికార పార్టీ జోక్యంతో కరోనా కేసులు

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేయడం నుంచి రాజకీయ ప్రత్యర్థులపై కరోనా కేసులు పెట్టడం వరకూ పోలీసులకు అధికార పార్టీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి చేయించినట్లే కనిపించింది.

పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు, అందుకు వారు ఎలాంటి ప్రతిబంధకాలు లేకుండా పని చేసినట్లు అధికార పార్టీ చెప్పినా, అధికార పార్టీ చెప్పినందువల్లే ఇలాంటి కేసులు పెడుతున్నారని ప్రతిపక్షాలు తీవ్ర మైన ఆరోపణలు చేస్తున్నాయి.

అనకాపల్లికి చెందిన ఎనస్తటిస్టు డాక్టర్ సుధాకర్ కేసులో పోలీసు చర్యల కారణంగానే ప్రభుత్వానికి తిప్పుకోలేనంత చెడ్డపేరు వచ్చింది. డాక్టర్ సుధాకర్ కరోనా రోగులకు చికిత్స అందించేందుకు మాస్కులు లేవని చెప్పడంతో ఆయనపై ప్రభుత్వం కక్షగట్టినట్లు వ్యవహరించింది.

ముఖ్యమంత్రి దేవుడితో సమానం అన్న వరకూ వదల్లేదు

డాక్టర్ ను పిచ్చి ఆసుపత్రికి పంపడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలో పోలీసులు డాక్టర్ సుధాకర్ రెక్కలు వెనక్కి విరిచికట్టడి ఆటోలో లాగి పడేసి తీసుకెళ్లిన సంఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా తీరని నష్టం చేసింది.

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దేవుడులాంటి వాడు అని చెప్పే వరకూ డాక్టర్ సుధాకర్ ను పోలీసులు వేధిస్తూనే ఉన్నారు. డాక్టర్ సుధాకర్ విషయంలో జరిగిన తీరుగానే ఇప్పుడు అమరావతి రైతులను చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లడం కూడా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తీరని నష్టం కలిగిస్తున్నది.

అధికార పార్టీ వారిని అడ్డుకున్నారన్న కేసులు మోపి రైతులను అరెస్టు చేయడమే కాకుండా వారి చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లడం పెద్ద వివాదాన్ని రేపింది. రైతుల చేతికి బేడీలు వేసి తీసుకెళ్లిన అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు కూడా ఖండించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాము అధికారంలో ఉండి తమ పోలీసుల చర్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండించుకోవడం ఇదే మొదటి సారి.

జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిన రైతు సంకెళ్లు

రైతులకు బేడీలు వేయడం అనే అంశం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అమరావతి ఉద్యమంలో రాష్ట్ర ప్రభుత్వం అమానవీయంగా ప్రవర్తిస్తున్నదనే అంశాన్ని జాతీయ మీడియా ఫోకస్ చేసే స్థితికి చేరింది. ప్రభుత్వంపై వస్తున్న ఈ విమర్శలు సహజంగానే తెలుగుదేశం పార్టీకి లాభిస్తున్నాయి.

అమరావతి రైతుల ఆందోళనను పూర్తి స్థాయిలో సమర్థిస్తున్న తెలుగుదేశం పార్టీ రైతుల చేతికి బేడీలు వేసిన సంఘటనతో పూర్తి స్థాయిలో రాజకీయంగా ముందుకు వెళుతున్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలతో కలిసి ఏ కార్యక్రమం చేసినా చూసీ చూడటనట్లు ఉండే పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు పది మందితో కలిసి రాజకీయ కార్యక్రమం చేపట్టినా కరోనా కేసులు పెడుతున్నారు.

ఇది కూడా తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తున్న అంశం. అధికార పార్టీ పోలీసు వ్యవస్థపై ఆధారపడటం మానివేస్తే తప్ప రాజకీయంగా అడ్వాంటేజ్ రాదు.  

Related posts

జనచైతన్య ట్రస్ట్ అధ్వర్యంలో రక్తదానం

Satyam NEWS

ఆదిలాబాద్ డి సి సి బి చైర్మన్ గా దళిత నేత

Satyam NEWS

వచ్చే వారం భారత్ రానున్న అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి

Satyam NEWS

Leave a Comment