39.2 C
Hyderabad
May 3, 2024 14: 18 PM
Slider నిజామాబాద్

గ్రీన్ జోన్లో భూమి పోతుందని ఆవేదనతో గడ్డి మందు తాగిన రైతు

#kamareddy

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రైతుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. ఇప్పటికే సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు పయ్యావుల రాములు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే మరొక రైతు ఆత్మత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మర్రిపల్లి బాలకృష్ణ, సంతోష్ ఇద్దరు అన్నదమ్ములు. వీరికి గ్రామంలో సర్వే నంబర్ 89 లో ఎకరం భూమి ఉంది. అయితే బాలకృష్ణకు ఇద్దరు ఆడపిల్లలు(కవలలు) మిధున, మేఘన ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరు తాడ్వాయి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు.

అయితే ఇద్దరు పిల్లలు డాక్టర్ చదువు కోసం ప్రయత్నిస్తున్నారు. దానికోసం తన భాగం భూమిని బాలకృష్ణ అమ్మడానికి ప్రయత్నించగా గతంలో 70 లక్షలు పలికిన భూమి ధర ఇప్పుడు మాస్టర్ ప్లాన్ లో గ్రీన్ జోన్లో రావడంతో 20 లక్షలకు కూడా అమ్ముడు పోలేదు. దాంతో తన పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుందని మనస్తాపం చెందిన బాలకృష్ణ గ్రామంలోని ఎల్లమ్మ టెంపుల్ వద్ద గడ్డి మందును ఆపిల్ ఫిజ్జా బాటిల్ లో కలుపుకుని ఆత్మహత్యాయత్నం చేసి ఇంటికి వచ్చి విషయం చెప్పాడు. దాంతో వెంటనే బాలకృష్ణను జిల్లా ఆస్పత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి, రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు ఆస్పత్రికి వెళ్లి బాలకృష్ణను పరామర్శించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అతన్ని ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా రైతు బాలకృష్ణ భార్య లక్ష్మీ మాట్లాడుతూ.. తమ భూమి మాస్టర్ ప్లాన్ లో గ్రీన్ జోన్లో పోతుందని తెలిసి తన భర్త ఆవేదనకు గురయ్యాడన్నారు. గత నెల రోజులుగా రైతులతో కలిసి ఉద్యమంలో కూడా పాల్గొంటున్నాడని తెలిపింది. తమ భూమి మాస్టర్ ప్లాన్ లో పోకుండా చూడాలని ఆమె వేడుకుంది.

Related posts

రైతుల పంట రుణాలను రద్దు చేయాలి

Satyam NEWS

Shock to AP BJP: పార్టీని వదిలిన కన్నా లక్ష్మీనారాయణ

Satyam NEWS

ఫర్ సేల్: కామారెడ్డి కాంగ్రెస్ లో టిక్కెట్ల లొల్లి

Satyam NEWS

Leave a Comment