28.7 C
Hyderabad
May 6, 2024 09: 44 AM
Slider ఆదిలాబాద్

స్నేహితుల చేతుల్లోనే జ్ఞానేశ్వర్ హత్య

#Adilabad Police

ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన రైతు బగ్నురే జ్ఞానేశ్వర్ (30) హత్య కేసును పోలీసులు ఛేదించారు. అతనికి బాగా తెలిసిన వారే అతడిని హత్య చేసినట్లు తేల్చారు.

6 వతేదీ రాత్రి ఇచ్చోడ మండల కేంద్రంలోని ప్రైవేట్ గోల్డెన్ లీఫ్ స్కూల్ ప్రాంగణంలో ప్రణాళిక ప్రకారమే హత్య జరిగినట్లు జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు.

బుధవారం ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్ లోని పోలీస్ సమావేశ మందిరంలో పాత్రికేయుల సమావేశంలో సంచలనమైన హత్య కేసు వివరాలను వెల్లడించారు. ఎస్పి తెలిపిన వివరాల ప్రకారం పొన్న గ్రామానికి చెందిన వ్యవసాయ రైతు బగ్నురే జ్ఞానేశ్వర్ ను పాత కక్షలను దృష్టిలో ఉంచుకొని అదే గ్రామానికి చెందిన అతని స్నేహితులే ప్రణాళిక ప్రకారం హత్య చేశారు.

ముగ్గురికి పగతో నాలుగోవాడు కలిశాడు

పొన్న గ్రామానికి చెందిన సిందే అచ్యుత్ (29) సిందే గోవిందరావు (43) సిందే రామకిషన్ (47) లకు గత కొన్ని రోజులుగా జ్ఞానేశ్వర్ తో పాత కక్షలు ఉండేవి. ఈ నేపథ్యంలోనే ముగ్గురు కలిసి అతన్ని మట్టుపెట్టాలని ప్రణాళిక ప్రకారం ఇచ్చోడ పట్టణంలో  మీ సేవ కేంద్రం యజమాని జాదవ్ శ్రీనివాస్ (28) తో కలిసి హత్యకు పథకం వేశారు.

జాదవ్ శ్రీనివాస్ కు సైతం జ్ఞానేశ్వర్ తో పాత కక్ష ఉండడంతో హత్య చేయడానికి 10 లక్షలు ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో అడ్వాన్స్ తీసుకు పథకం ప్రకారం శుక్రవారం ఉదయం శ్రీనివాస్ ఫోన్ చేసి జ్ఞానేశ్వర్ ను ఇచ్చోడ కు రప్పించి ఇరువురు కలిసి మందు తాగారు.

మందు తాగి తగాదా ఆడి ఆపై హత్య

దాబా హోటల్ నుండి భోజనం తెప్పించుకొని సాయంత్రం 5 గంటల వరకు అక్కడే ఉండి, అనంతరం ఆదిలాబాద్ కు బయల్దేరారు. మార్గమధ్యంలో హత్య చేయడానికి ఎలాంటి అవకాశం దొరకనందున తిరిగి రాత్రి ఇచ్చోడకు వచ్చి 8 బీర్ బాటిళ్లు తీసుకొని కొత్తగా నిర్మాణంలో ఉన్న గోల్డెన్ లీఫ్ స్కూల్ ప్రాంగణంలో కూర్చొని మందు సేవిస్తుండగా ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

బాధితుడు జ్ఞానేశ్వర్ కు సంతానం లేని కారణం, మగతనం లేకపోవడమేనని శ్రీనివాస్ నిలదీయగా కోపంతో జ్ఞానేశ్వర్ శ్రీనివాస్ భార్యను కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. తీవ్ర ఆవేశంలో ఉన్న జాదవ్ శ్రీనివాస్ రాడ్ తో జ్ఞానేశ్వర్ తలపై కొట్టగా తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

 వెంటనే పథకం ప్రకారం ఫోన్ ద్వారా పొన్న గ్రామస్తులైన నిందితులు ముగ్గురిని పిలిపించాడు. ముగ్గురు కలిసి ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని మహారాష్ట్ర సరిహద్దులో పాడేసి రావాలని శ్రీనివాస్ కు సూచించారు. కారులో మృతదేహాన్ని తీసుకొని వెళ్లి మహారాష్ట్ర మాండవి తాలూకా  పీప్పల్ గావ్ ఘాట్ సెక్షన్ లో 50 ఫీట్ల లోతు లోయలో పడేశాడు.

కేసు ఛేదించిన ఉట్నూర్ డిఎస్పి ఎన్. ఉదయ్ రెడ్డి టీమ్

ఇచ్చోడ పోలీస్ స్టేషన్ లో ఈ నెల 8న అతని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వివరించారు. అనంతరం ఉట్నూర్ డిఎస్పి ఎన్. ఉదయ్ రెడ్డి, ఇచ్చోడ సీఐ రవీందర్ ఆధ్వర్యంలో లోతుగా దర్యాప్తు చేయగా పక్కా ప్రణాళిక ప్రకారమే నలుగురు నిందితులు కలిసి జ్ఞానేశ్వర్ ను హత్య చేసినట్లు నిర్ధారణ అయినట్లు ఎస్పీ తెలిపారు.

 హత్యకు పథకం వేసిన ప్రధాన నిందితుడు జాదవ్ శ్రీనివాస్ ను అరెస్టు చేసి హత్యకు గురైన జ్ఞానేశ్వర్ మృతదేహాన్ని కనుగొని పోస్ట్ మార్టం చేసినట్లు  ఎస్పీ వెల్లడించారు. మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, విచారణ చేపట్టి న్యాయస్థానంలో హాజరు పరుస్తామని తెలిపారు.

హత్య మిస్టరీ నాలుగు రోజుల్లోనే చేదించిన దర్యాప్తు బృందం ఉట్నూర్ డిఎస్పి ఎన్. ఉదయ్ రెడ్డి, సీఐ రవీందర్, ఎస్సైలు సూర్య ప్రకాష్, కృష్ణ కుమార్, ఫరీద్ లను అభినందిస్తూన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఉట్నూర్ డీఎస్పీ ఎన్. ఉదయ్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ సయ్యద్ సుజా ఉద్దీన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ జి. వేణు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

అసంఘటిత రంగ కార్మికులను ఆదుకోవాలి

Satyam NEWS

ఎద్దును కోల్పోయిన రైతులకు కెడిసిసి రూ.25వేలు సాయం

Sub Editor

ప్రతి ఒక్కరూ ఓటర్ గా పేరు నమోదు చేసుకోవాలి

Satyam NEWS

Leave a Comment