42.2 C
Hyderabad
May 3, 2024 16: 54 PM
Slider మెదక్

భారీ వర్షాల నేపథ్యంలో ఆరోగ్య శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలి

#harishrao

రాష్ట్రంలో కొనసాగుతున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. వర్షాల కారణంగాఎదురయ్యే ఆరోగ్య సమస్యల నుండి ప్రజల్ని కాపాడేందుకు వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో సన్నద్ధతతో ఉండాలని సూచించారు. ఆయా ఆసుపత్రుల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి, ఎలాంటి కేసులు వచ్చినా అడ్మిట్ చేసుకొని వెంటనే వైద్యం అందించాలని స్ప‌ష్టం చేశారు. 

సోమవారం అన్ని జిల్లాల వైద్యాధికారులు, అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, విభాగాధిపతులు, వైద్యులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయా జిల్లాల్లోని పరిస్థితుల గురించి ఆరా తీశారు. తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి వివరించారు.

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో సమీక్షలు  నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులు తెల్సుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. ఎలాంటి ప‌రిస్థితినైనా ఎదుర్కొవ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉండాలని సూచించారని, ఈ మేరకు వైద్యారోగ్య శాఖ సైతం పూర్తి స్థాయిలో అప్రమత్తతో ఉండాలన్నారు.

సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, దీన్ని ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్దంగా ఉండాలన్నారు. మలేరియా, డెంగీ, చికెన్ గున్యా, డయేరియా తదితర రోగాల పట్ల అవగాహన పెంచాలని, రోగ నిర్దారణ పరీక్షలు వెంటనే నిర్వహిస్తూ అవసరం అయిన వారికి చికిత్స అందించాలన్నారు.

సబ్ సెంటర్ స్థాయి నుండి జిల్లా ఆసుపత్రి వరకు వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, పంచాయతీ రాజ్ మున్సిపల్ తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంలో, స్థానిక ప్రజా ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు.

108 వాహ‌నాలు వెళ్ళలేని ప్రాంతాలు ముందే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలన్నారు. వాగులు పొంగటం, రోడ్లు చెడి పోవడం వల్ల కొన్ని గిరిజన ప్రాంతాల‌కు రోడ్ కనెక్టివిటీ పోయే అవకాశం ఉంటుందన్నారు. అలాంటి చోట్ల రోగులతో పాటు గర్భిణుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలనీ,. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. బర్త్ వెయిటింగ్ రూముల‌ను సద్వినియోగం చేసుకోవాల‌ని అన్నారు.

అనంతరం డిఎంఇ పరిధిలోని ఆసుపత్రుల పనితీరుపై మంత్రి నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ హౌస్ సర్జన్లు, జూనియర్ డాక్టర్స్, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు సహా డైట్, పారిశుద్ధ్య విభాగాల్లో పని చేసే వారికి వేతనాలు సకాలంలో పొందే విధంగా బిల్స్ త్వరిత గతిన సబ్ మిట్ చేయాలన్నారు.

ప్ర‌సూతి, ఆర్థోపెడిక్, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీ, కంటి, గుండె స‌హా అన్ని విభాగాల్లో ఆరోగ్య శ్రీ సేవ‌లు మ‌రింత ఎక్కువ‌గా చేయాలన్నారు. ప్ర‌ణాళిక రూపొందించుకొని ఆప‌రేష‌న్ థియేట‌ర్ వినియోగం పెంచాలన్నారు. రోగుల‌కు త్వరిత గతిన సేవలు అందించాలనీ, ఈ విషయంలో మంచి పనితీరు నమోదు చేసిన ఎంజీఎం, నిజామాబాద్, ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రులను అభినందించారు. జిల్లా స్థాయిలోనే నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో కేసులను అనవసరంగా హైదరాబాద్ కు రిఫర్ చేయవద్దన్నారు. సాధారణ ప్రసవాలు పెరిగేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ఉచితంగా అందించే మందుల సంఖ్య‌ను తెలంగాణ ప్ర‌భుత్వం గ‌ణ‌నీయంగా పెంచింది. ఇప్ప‌టి వ‌ర‌కు 720 గా ఉన్న జాబితాను 843కు పెంచింది. దీంతో కొత్త‌గా 123 ర‌కాల మందులు ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో అందుబాటులోకి రానున్నాయి. ప్రతి వైద్యుడికి ఈ జాబితాలోని మందుల వివరాలు తెలిసేలా బుక్ లేట్ ఇవ్వనున్నట్లు తెలిపారు.దీని ప్రకారం జనరిక్ మెడిసిన్ సూచించాలనీ, బ్రాండెడ్ మందులు రాయడం అనేది ఉండొద్దనీ చెప్పారు.

అత్య‌వ‌స‌ర సేవ‌లు అన్ని వేళ‌లా అందించేందుకు వీలుగా అన‌స్థీషియా విభాగం క్రియాశీలకంగా ఉండాలనీ, వారానికి ఒక విభాగం వారీగా సూప‌రింటెండెంట్లు స‌మీక్షలు నిర్వ‌హించాలనీ, వారం వారం పురోగ‌తిని మెరుగుప‌డేలా చూడాలనీ ఆదేశించారు.

Related posts

శాస్త్రవేత్త హత్యలో ఎవరా యువకుడు?

Satyam NEWS

మిడతల దాడి నుంచి రక్షణ ఏర్పాట్లతో సన్నద్ధం

Satyam NEWS

సంగారెడ్డిలో రాలిపోయిన మరో ఆర్టీసీ కార్మికుడి ప్రాణం

Satyam NEWS

Leave a Comment