23.7 C
Hyderabad
May 8, 2024 06: 27 AM
Slider హైదరాబాద్

అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్న అక్రమ షెడ్లు

#illegalbuildings

హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ పరిధిలోని ఏ ఎస్ రావు నగర్ డివిజన్ లో అక్రమ షెడ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. బహుళ అంతస్తుల భవనాల పై వెలుస్తున్న ఈ షెడ్ లపై అధికారులకు ఫిర్యాదు చేసిన ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. ముఖ్యంగా ఈసీఐఎల్, ఏఎస్ రావు నగర్ ప్రధాన రహదారి మహేష్ నగర్ లోని బాంటియా ఫర్నిచర్ షోరూమ్ పైన అక్రమంగా నిర్మించిన షెడ్డు పై ఆన్ లైన్ లో అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది.

అదే విధంగా దమ్మాయిగూడ రోడ్డు లోని పరిమళ నగర్ కమాన్ పక్కన రాయ్ చంద్ భవనంపై అక్రమంగా షెడ్డు నిర్మిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నా పట్టించుకోని మున్సిపల్ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి. దీనిపై మున్సిపల్ అధికారులకు చాలా ఫిర్యాదులు వెళ్లాయి.

కానీ మున్సిపల్ అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. డివిజన్ పరిధిలోని పరిమళ నగర్, శ్రీ నగర్ కాలనీ, విరాట్ నగర్ కాలనీ, హన్స్ ఎన్ క్లేవ్  లలో జరుగుతున్న అక్రమ షెడ్ల నిర్మాణం వలన ప్రభుత్వ ఖజానాకు లక్షల రూపాయలు గండి పడుతున్న మున్సిపల్ అధికారులు మాత్రం ఏమీ తెలియనట్లు పట్టించుకోకుండా వదిలేశారు. అయితే కాప్రా సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా మున్సిపల్ అధికారులు మాత్రం నామమాత్రంగా కూల్చివేతలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు.

కొన్ని చోట్ల పేదవాళ్ళు చిన్న చిన్న రూములు, షెడ్డు నిర్మించుకుంటే ఫిర్యాదులు రాకున్నా తక్షణమే మందీమార్బలంతో జేసీబీల సహాయంతో నేల మట్టం చేసే అధికారులు మరికొందరి పట్ల మాత్రం తెలియని ప్రేమను ఒలకబోసి వారివైపు కూడా వెళ్లడం లేదని పలువురు అనుకుంటున్నారు. పేద ప్రజలకు ఒక న్యాయం, డబ్బు, పలుకుబడి ఉన్న బడాబాబులకు మరొక న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు ఇదెక్కడి న్యాయమని మున్సిపల్ అధికారులచే కూల్చివేయబడ్డ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మున్సిపల్ అధికారులు డబ్బున్న బడాబాబుల దగ్గర డబ్బులు తీసుకుని ఇలా అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు తేరుకుని అక్రమ షెడ్డును తొలగించి తమ నిజాయితీని నిరూపించుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగి అవినీతి మున్సిపల్ అధికారులను నిలదీసి, పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని తాజాగా ఈ మధ్య నష్టపోయిన పలువురు బాధితులు ఆవేదనను వ్యక్తం చేసారు.

Related posts

తిరుమలలో సామాన్య భక్తులకు పెద్దపీట

Satyam NEWS

లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Bhavani

‘ఆకాశ‌వాణి’ ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల

Satyam NEWS

Leave a Comment