26.7 C
Hyderabad
May 3, 2024 08: 09 AM
Slider నిజామాబాద్

అంతర్ రాష్ట్ర నేరస్తుడు అరెస్ట్: 51 బైకులు స్వాధీనం

#thief

ఒక హత్య కేసుతో పాటు రెండు రాబరీ కేసులలో నిందితునిగా ఉంటూ జైలు నుంచి పెరోల్ పై బయటకు వచ్చి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతూ బైకు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర నేరస్తున్ని కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మహారాష్ట్రకు చెందిన జుల్ఫీ సింగ్ జిల్లాలోని బాన్సువాడకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వివిధ నేరాలకు పాల్పడుతున్నాడన్నారు.

2013 లో మహారాష్ట్రలోని అమరావతి పోలీస్ పరిధిలోని ఓ నగల దుకాణంలో చోరీకి పాల్పడిన ఘటనలో దుకాణంలో పనిచేసే విజయ్ తోకర్ అనే వ్యక్తి మరణించాడని, ఈ కేసులో జుల్ఫీ సింగ్ రెండేళ్లు జైలుకు వెళ్లి కోవిడ్ సమయంలో పెరోల్ పై వచ్చాడన్నారు. పెరోల్ పై వచ్చి జైలుకు వెళ్లకుండా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతూ వివిధ ప్రాంతాల్లో బైకు దొంగతనాలకు పాల్పడుతున్నాడని తెలిపారు.

కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, సైబరాబాద్, మెదక్ జిల్లాలో వివిధ నేరాలకు పాల్పడ్డాడన్నారు. జిల్లా కేంద్రంలో కస్తూర్బా ఆస్పత్రి ప్రాంతంలో వాహనాల తనిఖీలు చేపడుతుండగా ఐదుగురు వ్యక్తులు మూడు బైకులపై వెళ్తూ సరైన పత్రాలు చూపించకపోవడంతో అనుమానం వచ్చి విచారించగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన 51 బైకులను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ప్రధాన నెరస్తుడు జుల్ఫీ సింగ్ తో పాటు షేక్ యూనుస్, షేక్ సోహెల్, సోహెల్ అలీ, చాపల అంజప్పలను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.

జుల్ఫీ సింగ్ ఒక్కడే 12 బైకులు దొంగతనాలు చేశాడని, మిగతా నలుగురు ఇతనికి సహకరిస్తారన్నారు. విలువైన బైకులు చోరీ చేసి తక్కువ ధరకు విక్రయిస్తారన్నారు. వీరికి సహకరిస్తున్న మరొక నలుగురు పరారీలో ఉన్నారని ఎస్పీ వెల్లడించారు. హత్య కేసులో పెరోల్ పై బయటకు వచ్చి తప్పించుకుని తిరిగే నేరస్తున్ని పట్టుకోవడం ఆషామాషీ విషయం కాదని, ఈ కేసులో కీలకంగా పని చేసిన పోలీస్ సిబ్బందికి రివార్డు, ప్రశంసా పత్రాలు అందేలా పై అధికారులకు నివేదిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, డిఎస్పీ ప్రకాష్, బాన్సువాడ, కామారెడ్డి టౌన్, రూరల్ సిఐలు నరేష్, శ్రీనివాస్ గౌడ్, ఎస్బి సిఐ చంద్రశేఖర్ రెడ్డి, సీసీఎస్ పోలీసులు పాల్గొన్నారు.

Related posts

బాలయ్య, చిరంజీవి చిత్రాల టిక్కెట్ ధరల పెంపునకు అనుమతి

Satyam NEWS

పోలీసుల ఉక్కుపాదం:కేశినేని నాని గృహనిర్బంధం

Satyam NEWS

పేదల చెంతకు కార్పొరేట్ వైద్యం చేరువ చేస్తున్నాం

Satyam NEWS

Leave a Comment