తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిందని, దాన్ని బ్రహ్మదేవుడు కూడా బతికించలేడని హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక మరొక్క మారు రుజువు చేసింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో ఆ పార్టీకి 1826 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ నియోజకవర్గంలో సెటిలర్ల ఓట్లు దాదాపుగా 30 నుంచి 40 వేల ఓట్లు ఉంటాయి. వారంతా తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారని ఆ పార్టీ నాయకులు ఆశించారు. అది అత్యాశే అయినా వారి టార్గెట్ అదే. అందుకే సెటిలర్లతో టిఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి సమావేశం పెడితే అక్కడకు వెళ్లి తెలుగుదేశం అభ్యర్ధి చావా కిరణ్మయి భంగపడ్డారు కూడా. సెటిలర్ల ఓట్లు రాకపోవడం తెలుగుదేశం పార్టీ అంచనాలు తప్పని తేలింది. సెటిలర్ల ఓట్లు తీసి పక్కన పెట్టినా కమ్మ సామాజిక వర్గం ఓట్లు దాదాపుగా 10 నుంచి 15 వేలకు పైనే ఉంటాయని ఒక అంచనా. పైగా ఈ 10 వేల మందిలో చాలా మంది ధనవంతులే. వారంతా తలచుకుంటే ఆ పార్టీ అభ్యర్ధికి కనీసం లో కనీసం 20 వేల ఓట్లు రావాలి. వారు పక్క ఓటుపై ప్రభావం చూపకపోయినా 10 వేల ఓట్లు రావాలి. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లు చూస్తే కమ్మ సామాజిక వర్గం వారు కూడా ఆ అభ్యర్ధికి ఓట్లు వేయలేదని అర్ధం అవుతున్నది. తెలంగాణలో బిసి వర్గాలలో బలంగా ఉండే తెలుగుదేశం పార్టీ ఆ ఓట్లు కోల్పోయింది. తర్వాత సెటిలర్లు తమ ఓటు బ్యాంకుగా భావించి ఆ తర్వాతి కాలంలో ఆ ఓట్లు కోల్పోయింది. ఈ ఎన్నికతో కమ్మ సామాజిక వర్గం వారు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడం లేదని అర్ధం అయిపోతున్నది. అందువల్ల ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇక తెలంగాణ నుంచి సంపూర్ణంగా నిష్ర్కమించడం మంచిది.
previous post
next post