పోలీసులు సరదాకు ఎన్ కౌంటర్ చేస్తారా? దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై మానవ హక్కుల సంఘాలు చేస్తున్న రాద్ధాంతం చూస్తుంటే ఈ ప్రశ్న వేయడం సబబు అనిపిస్తున్నది. ఎన్ కౌంటర్ చేయడం వల్ల అందరి కన్నా ఎక్కువగా పోలీసులకే సమస్యలు వస్తాయి.
దిశ సంఘటన పై తీవ్రంగా ప్రతిస్పందించిన ప్రజలు గానీ, ఎన్ కౌంటర్ ను సమర్థించిన రాజకీయ నాయకులు గానీ, (ముందస్తు ప్లాన్ ప్రకారం జరిగిందని అనుకుంటే) అందుకు అనుమతిచ్చిన ప్రభుత్వం కానీ ఎన్ కౌంటర్ జరిగిన తర్వాత పోలీసులను ఆదుకోలేరు. వారు చేసిన చర్యకు వారే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది.
ఒక దశలో వారు చేసిన పనిని వారు సమర్ధంగా సమర్ధించుకోలేకపోతే ఉద్యోగాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. దిశ నిందితుల ఎన్ కౌంటర్ కు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోకుండా మానవ హక్కుల సంఘాల పేరుతో కొందరు విచిత్రమైన వాదనలు వెలికి తెస్తున్నారు. ఇది మానవ హక్కుల ఉలంఘన అంటున్నారు.
మానవ హక్కులు ఆ మృగాల కేనా? దిశకు ఉండవా? అని సాధారణ ప్రజలు వేస్తున్న ప్రశ్నలు ఇప్పుడు సమాజంలో ప్రతిధ్వనిస్తున్నాయి. సమాజంలో భయం భయంగా బతకాల్సిన పరిస్థితులు వచ్చినందుకు ఎందరో యవతులు లోలోన ఏడుస్తున్నారు. కుమిలిపోతున్నారు. ఆ అసహనం దిశ విషయంలో రెట్టింపయింది.
దిశ నిందితులను కాల్చేసినప్పుడు, అదీ కూడా దిశ కు అన్యాయం జరిగిన ప్రదేశంలోనే అయినందుకు కోట్లాది మంది సంతోషించారు. కనీసం ఈ ఘటన భయం కలిగిస్తుందని, ఆడదానిపై చేయివేయాలంటే ఆకతాయిలు భయపడతారని అనుకున్నారు. ఇది తప్పా? ఈ నలుగురు మాన మృగాలు ఈ సమాజానికి అవసరమా? ఇప్పుడు మాట్లాడుతున్న మానవహక్కుల సంఘాల వారే దిశ ఘటన జరిగినప్పుడు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు?
మహిళలకు రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పోలీసులు తమదైన శైలిలో తమ ఉద్యోగాలను పణంగా పెట్టి మరీ సమాధానం ఇచ్చారు. ఈ ఎన్ కౌంటర్ నేరస్తులను శిక్షించడానికి కాదు. సమాజానికి భరోసా ఇచ్చేందుకు. మానవహక్కుల సంఘానికి చెందిన ఒక మహిళ ఈ ఎన్ కౌంటర్ తర్వాత ఒక పత్రికలో వ్యాసం రాస్తూ ‘‘ఇలా చంపుకుంటూ పోతే సమాజంలో సగం మగాళ్లు ఉండరు’’ అని వ్యాఖ్యానించారు.
మంచిదే కదా? ఇలాంటి మగవాళ్లు సమాజానికి అవసరమా? ఇలా ఆడది వంటరిగా కనిపిస్తే చిత్తకార్తె కుక్కల్లా వెంటపడే మగవాడు లేకపోతే సమాజానికి ప్రమాదమా? ఈ మానవ హక్కుల సంఘాలు, ‘‘ప్రజాస్వామ్యవాదులు’’ పేరుతో పుట్టుకొచ్చిన వారు ప్రశ్నిస్తున్నది ఏమిటంటే – పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే ఎలా? అని. నిజమే పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదు.
మరి న్యాయస్థానాలు త్వరగా తీర్పులు చెప్పాలి కదా? న్యాయస్థానాలకు ఉండే ఇబ్బందులపై ఈ మానవ హక్కుల సంఘాలు ప్రశ్నించాయా? న్యాయ స్థానాలు ఎంత జాప్యం చేస్తే ఈ మానవ హక్కుల సంఘాలకు అంత పకడ్బందిగా కేసు నడిచినట్లు భావించడం కరెక్టా? ఆసిఫాబాద్ ప్రాంతంలో జరిగిన టేకు లక్ష్మి అనే వివాహిత ను ముగ్గురు దుర్మార్గులు రాక్షసంగా, అత్యంత కిరాతకంగా రేప్ చేసి మర్డర్ చేశారు.
భర్త ఇద్దరు పిల్లలతో బతకడానికే కష్టంగా ఉన్న ఆ అతి పేద కుటుంబం రోజూ పని చేసుకుంటే తప్ప దిక్కులేదు. అలా పనికి వెళ్లిన టేకు లక్ష్మి (మీడియా నిబంధనల ప్రకారం బాధితురాలి పేరు చెప్పకూడదు. అయితే ఈ కేసులో చెప్పక తప్పదు. ఆమె కుటుంబం పరువు కోసం ఆక్రోశించే మధ్యతరగతి కుటుంబం కాదు.
రోజువారీ బతుకును వెతుక్కునే అత్యంత పేద కుటుంబం. దళిత కుటుంబం. ఆమెకు న్యాయం చేయాలేనే ఉద్దేశ్యంతోనే ఆమె పేరును సత్యం న్యూస్ ప్రస్తావిస్తున్నది) ని ఎత్తుకెళ్లి అత్యంత క్రూరంగా లైంగికంగా హింసించి ఆ తర్వాత పాశవికంగా బ్లేడుతో గొంతు కోసి చంపేశారు. అత్యంత దుర్మార్గమైన నేరానికి పాల్పడిన ఈ ముగ్గురు ఈ సమాజంలో మనతో పాటు కలిసి ఉండాలా? ఉండేందుకు వీరికి అర్హత ఉందా?
కోర్టులో కేసులు నడిచినప్పుడు అత్యాచారానికి గురైన ఆడవారిని అడ్వకేట్లు అడిగే ప్రశ్నలు అత్యంత క్రూరంగా ఉంటాయని ఆ ప్రశ్నలకు ఏ ఆడదీ సమాధానం చెప్పలేదని ఇదే మానవహక్కుల సంఘాలకు చెందిన ఒక మహిళా నాయకురాలు అంటున్నారు. మరి అడ్వకేట్లు అడిగే ప్రశ్నలకు సజీవంగా లేని టేకు లక్ష్మి సమాధానం చెప్పలేదు.
అక్కడ ఆ ముగ్గురు నరహంతకులు తప్ప వేరే సాక్ష్యం లేదు. మారుమూల గ్రామమైనందువల్ల అక్కడ పోలీసులు సాంకేతిక సహాయం తీసుకోలేరు. తీసుకున్నా కోర్టులో చెల్లదు. మరి ఆ ముగ్గురు రాక్షసులకు శిక్ష పడేదెలా? అందుకే జనం ఎన్ కౌంటర్ కోరుకుంటున్నారు. ఎక్కువ మంది ప్రజలు కోరుకునేదే చట్టం.