30.7 C
Hyderabad
April 29, 2024 05: 10 AM
Slider ముఖ్యంశాలు

Black Day: కామారెడ్డిలో మీడియాపై ఎఎస్పీ దురుసు ప్రవర్తన

#kamareddydist

కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాస్టర్ ప్లాన్ పై వివరాలు వెల్లడించేందుకు మధ్యాహ్నం ఒంటి గంటకు కలెక్టర్ మీడియాతో మాట్లాడతారని డిపిఆర్వో సిబ్బంది మీడియాకు సమాచారమిచ్చారు. దాంతో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లారు. రేవంత్ రెడ్డి వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు కలెక్టరేట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో కలెక్టరేట్ ప్రధాన గేటును పోలీసులు మూసివేసి కలెక్టరేట్ సిబ్బందిని రెండవ గేటు ద్వారా పంపిస్తున్నారు. మీడియా ప్రతినిధులు కలెక్టరేట్ వెళ్ళడానికి గేటు వద్దకు వెళ్లగా ఎఎస్పీ అన్యోన్య అడ్డుకున్నారు. లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు అని మీడియాకు తెలిపారు. కలెక్టర్ ప్రెస్ మీట్ ఉందని చెప్పినా వినిపించుకోకుండా మీడియా ప్రతినిధులపై దురుసుగా ప్రవర్తించారు.

దాంతో జర్నలిస్టులు కలెక్టర్ ప్రెస్ మీట్ బైకాట్ చేస్తున్నట్టు ప్రకటించి ఎఎస్పీ అన్యోన్య తీరుకు నిరసనగా ప్రధాన గేటు ముందు కూర్చుని నిరసన తెలిపారు. కలెక్టర్ బయటకు వచ్చి ఇక్కడే ప్రెస్ మీట్ నిర్వహించాలని, తాము లోపలికి వచ్చేది లేదని భీష్మించారు. దాంతో డిఎస్పీ సోమనాథం, సిఐ, ఎస్సైలు వచ్చి జర్నలిస్టులను సముదాయించే ప్రయత్నం చేసినా వినిపించుకొలెదు.

విషయం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ దృష్టికి వెళ్లడంతో వెనక దారి నుంచి కారులో జర్నలిస్టుల వద్దకు చేరుకుని మాట్లాడారు. జరిగిన విషయం చెప్పడంతో ఏఎస్పీని పక్కకు పిలుచుకుని క్లాస్ తీసుకున్నారు. ముఖ్యమైన విషయం మీద ప్రెస్ మీట్ పెడితే రానివ్వకుండా ఎలా అడ్డుకున్నారు అంటూ నిలదీశారు. అనంతరం మీడియా ప్రతినిధుల వద్దకు వచ్చి ఎఎస్పీ విషయం తాను ఎస్పీతో పర్సనల్ గా మాట్లాడతానని, ప్రెస్ మీట్ కి రావాలని నచ్చజెప్పారు. స్వయంగా కలెక్టర్ వచ్చి జర్నలిస్టులకు నచ్చజెప్పడంతో కలెక్టర్ తో పాటు లోపలికి వెళ్లారు.

జర్నలిస్టుపై రెండవ సారి

ఎఎస్పీ అన్యోన్య తీరును జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. గత సంవత్సరం రామాయంపేటకు చెందిన తల్లి కొడుకులు సూసైడ్ చేసుకున్న ఘటనలో నిందితులకు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో రాచమర్యాదలు చేసిన విషయంపై మీడియా ప్రశ్నించడంతో ఎఎస్పీ జర్నలిస్టులపై మాట తూలారు. ఇక్కడ ఎవరిని ఉంచొద్దు. అందరిని బయటకు పంపించేయండి అంటూ హుకుం జారీ చేశారు.

ఆరోజు కూడా జర్నలిస్టులు ఇదే తీరులో ఏఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. ప్రజలకు, అధికారులకు వారధిగా పని చేస్తున్న జర్నలిస్టుల పట్ల పోలీసులు సంయమనం పాటించాల్సింది పోయి మీడియాపై చిర్రుబుర్రులాడటం ఎఎస్పీ అన్యోన్యకే దక్కిందన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో ఏ పోలీసు అధికారి కూడా ఇలా మీడియాపై దురుసుగా ప్రవర్తించలేదని చెబుతున్నారు.

Related posts

రాబిన్ శర్మ టీంతో “ఇదేం కర్మ మన రాష్ట్రానికి” శిక్షణా కార్యక్రమం

Bhavani

ప్రకృతి వనంలో పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య

Satyam NEWS

అమరావతిని నాశనం చేసేందుకు నాన్ స్టాప్ కుట్రలు

Satyam NEWS

Leave a Comment