33.2 C
Hyderabad
May 14, 2024 13: 18 PM
Slider కవి ప్రపంచం

చప్పట్లు కొట్టలేను

#Aruna Naradabhatla

కవిత్వం కాదు

అతని గద్గద స్వరం నుండి ప్రపంచపు శవాలకుప్పలు వర్షిస్తున్నాయి

నాలుగు గోడల నడుమన

విషవాయువు నాట్యం కనబడుతుంది

గుండె లయతప్పిన

తీగల అపశృతి వినపడుతుంది

అతనొక్కడే కాదు

ఆ మూల మట్టిలో ఇంకెన్నెన్నో బంధాలు

అరుపులతో బైటికెగబాకుతున్న జనం

విధ్వంసపు అంచుల వెంట చీమలైపాకుతున్న ప్రాణులు

విత్తమొక్కటే అక్కడి నినాదం

మానవ విలువలతో పనిలేదు

రోజుకో ప్రకటనలో

కుప్పకూలి మార్చురీల్లోనో…

భూసొరంగాల్లోనో…గుమిగూడి

శాశ్వతంగా నిద్రిస్తున్న జనం…

అతనింకా మెలకువతోనే ఉన్నాడు

ఓవర్ టైం డ్యూటీలో

పదహారు గంటలు లెక్కిస్తూ…

చేతిపై వాలుతున్న నిర్జీవజీవులకు మలాంపూస్తూ…మత్తు మందద్దుతూ

నిద్రిస్తున్న కాలపు నీడను గమనిస్తూ

బిక్కుబిక్కుమంటూ

కవర్లు కప్పుకుని పడుకున్న దేహాలను చూస్తూ…

అతను పనిగంటల్లో పలవరిస్తూ…

ఎరుకలోనే ఉన్నాడు

కాలాలు మారి విరబూసిన రంగుల పువ్వుల నవ్వులలో

తనను తాను ఇనుమడించుకుని

అతను కాసింత ధైర్యంగానే ఉన్నాడు…

***

జాగ్రత్త తప్ప ఏం చెప్పగలం?

తోచినంత ప్రార్థించడం తప్ప

ప్రకృతిని చీరలా మడతబెట్టి ఇస్త్రీ చేసి వెంటనే

ముడతలు విదిలించలేము

ఎగురుతున్న ఇనుప రెక్కల పక్షులూ ఆగిపోయాయి

సముద్రాలు దాటి

చిలుక ప్రాణాలను ఈమట్టిన చేర్చలేమిప్పుడు…

ఐనా

ఏ పుష్పక విమానమో ఉన్నా…

భూగోళాన్ని చుట్టుకున్న గాలిపొరలకు

ఏ ఆక్వా ఫిల్టర్లనో బిగించి

తక్షణమే ఆక్సీజనందించలేను

ఎవరి డబ్బాలో వాళ్ళం నిలబడటం తప్ప ఇప్పుడేం చేయగలం?

అరుణ నారదభట్ల, హైదరాబాద్

Related posts

ఈ అధికారులకు కనువిప్పుకలిగేదెప్పుడు?

Bhavani

అపర భగీరథుడు కాటన్ కు జనసేన అధినేత నివాళి

Satyam NEWS

గవర్నర్ వ్యవస్థ పరువు తీస్తున్న తమిళసై

Satyam NEWS

Leave a Comment