33.2 C
Hyderabad
May 3, 2024 23: 30 PM
Slider సంపాదకీయం

ఈ అధికారులకు కనువిప్పుకలిగేదెప్పుడు?

#Jagan government

జీవో నెంబరు ఒకటి ని రాష్ట్ర హైకోర్టు ఈ నెల 23 వరకూ నిలుపుదల చేయడం జగన్ ప్రభుత్వానికి తీరని దెబ్బగానే చెప్పాలి. హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు ఎన్ని వచ్చినా చలించకపోవడం జగన్ ప్రభుత్వ ప్రత్యేకత. రాష్ట్రంలో కుప్పలు తెప్పలుగా కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఫైల్ అవుతున్నా చలించకపోవడం కూడా జగన్ ప్రభుత్వం ప్రత్యేకతే.

కోర్టులు ఇచ్చిన తీర్పులను ఎన్ని రకాలుగా మార్చి చూసుకోవచ్చు అనే అంశంపై మాత్రమే దృష్టి సారిస్తున్నారు తప్ప తీర్పులు అమలు చేద్దామనే ఆలోచన ఇప్పటికీ చేయకపోవడం ఎందుకో ఎంత తరచి చూసినా అర్ధం కాదు. కోర్టుల్లో తీర్పులు వ్యతిరేకంగా రావడానికి చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడమే కారణం అని గతంలో కొద్ది రోజుల పాటు వైసీపీ నేతలు చెప్పే వారు. ఇప్పుడు ఎందుకో ఆ మాట చెప్పడం లేదు.

కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రావడానికి ఒక వ్యక్తి కారణం కావడానికి అస్సలు అవకాశమే ఉండదు. ఉన్న చట్టాలకు లోబడి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడుతుంటే న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉండదు. చట్టాలకు లోబడి ప్రభుత్వం జీవోలు జారీ చేస్తుంటేనే న్యాయస్థానాలలో చిక్కులు వస్తుంటాయి. ఈ చిన్న లాజిక్ ను ఉన్నతాధికారులు మర్చిపోతున్నారో లేక పాలకులు చెప్పినట్లు చేయడం తప్ప తమ లాజిక్ ను ఉపయోగించకపోవడం వల్లో ఇలా జరిగిపోతున్నది. పాలకులు ఏవైనా ఆదేశాలు జారీ చేస్తే అవి చట్టపరంగా నిలబడే విధంగా చర్యలు తీసుకోవడం అధికారుల బాధ్యత అవుతుంది.

ఒక వేళ పాలకులు ఇచ్చే ఆదేశాలు ఉన్న చట్టాలకు విరుద్ధంగా ఉంటే వాటిని అమలు చేయరాదని చెప్పడం కూడా అధికారుల బాధ్యతే. పాలకులు ఏదైనా చెబితే దాన్ని గుడ్డిగా అనుసరించే అధికారులు ఉన్నంత కాలం న్యాయస్థానాలు ఇలాంటి తీర్పులే ఇస్తుంటాయి. మంత్రిగానీ ముఖ్యమంత్రిగానీ ఏ విషయమైనా చెప్పినప్పుడు అది రాజ్యాంగ విరుద్ధంగానో, చట్ట విరుద్ధంగానో ఉంటే అలాంటి పనులు చేయం అని అధికారులు చెప్పగలగాలి.

ఇలా చేయడం ద్వారా ఉన్నత స్థానంలో ఉన్న ఏ ప్రభుత్వ అధికారికి ఉద్యోగం పోదు. వారి ఉద్యోగం వారికే ఉంటుంది. మహా అయితే మంచి పోస్టింగ్ రాదు. అలాంటి పరిస్థితుల్లో కూడా మంత్రి లేదా ముఖ్యమంత్రి చెప్పే తలాతోకా లేని విషయాలను కూడా అమలు చేసేందుకే ప్రయత్నిస్తున్నారంటే కచ్చితంగా అది అధికారుల లోపమే. జీవో నెంబర్ ఒకటి అలాంటిదే. చట్టం ముందు ఇలాంటి ఆదేశాలు నిలబడవని ఎవరిని అడిగినా చెబుతారు. అయినా సరే అధికారులు జీవో జారీ చేసేశారు… పోలీసులు వాటిని అమలు చేసేశారు. పోనీ జీవో ను కచ్చితంగా అమలు చేశారా అంటే అదీ లేదు.

ఒక వైపు వైసీపీ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి యథేచ్ఛగా బహిరంగ సభలు, మెయిన్ రోడ్లపై ర్యాలీలు, గ్రామాలలో గుంపులుగా తిరగడం చేసేస్తున్నా పోలీసులు అదేమని అడగడం లేదు. ముఖ్యమంత్రి, మంత్రులను అడ్డుకోకూడదని అనుకున్నా వైసీపీకి చెందిన ఛోటా మోటా నాయకులు కూడా రోడ్లపై యథేచ్ఛగా సభలు నిర్వహించుకుంటున్నారు. కేవలం తెలుగుదేశం, జనసేన, వామపక్షాల వారు బయటకు వస్తేనే అడ్డుకుంటున్నారు.

జీవోను కచ్చితంగా అమలు చేసి ఉన్నట్లు అయితే ప్రతిపక్షాలు ఇంతగా రియాక్టు అయి ఉండేవి కాదేమో. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల ప్రతిష్ట మసకబారి పోతున్నది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి పోలీసులపై గౌరవం తగ్గుతూ వస్తున్నది ఈ కారణం వల్లనే. నిన్న మొన్నటి వరకూ ఎస్ సి ఎస్ టి కేసుల సెక్షన్లను విస్తృతంగా వాడిన పోలీసులు ఇప్పుడు హత్యాయత్నం కేసులను ఉపయోగిస్తున్నారు.

నిబంధనల ఉల్లంఘన లేదా చట్ట వ్యతిరేక చర్యలకు ఎవరైనా పాల్పడితే సంబంధిత సెక్షన్లు నమోదు చేస్తే న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. అలా కాకుండా నిరసన తెలిపే ప్రజలపై పోలీసులు హత్యాయత్నం కేసులు పెడితే ఎలా? ప్రజలు అందరూ కలిసి వచ్చి పోలీసులను చంపేందుకు ప్రయత్నిస్తారా? ఇలాంటి కేసులను కోర్టులు ఎలా సమర్థిస్తాయి? ఇదే ఏపిలో జరుగుతున్నది.

దీన్నుంచి పోలీసులు తమంత తాముగా బయటకు రావాల్సి ఉంటుంది. తెలుగుదేశం లేదా ఇతర ప్రతిపక్షాల నాయకులను జైల్లోనే ఉంచేలా కేసులు పెట్టాలి అని ఎవరైనా చెబితే దాన్ని గుడ్డిగా అమలు చేయడం కాదు, సాధ్యం అవుతుందో కాదో చూసుకుని అవసరమైన సెక్షన్లు మాత్రమే ప్రయోగించాలి. అప్పుడు కోర్టుల జోక్యం చేసుకోవు. ప్రజలలో కూడా పోలీసుల ప్రతిష్ట పెరుగుతుంది.

Related posts

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన మాగుంట

Bhavani

న్యూ ట్రెండ్: కొల్లాపూర్ రాజకీయం మారుద్దాం రండి

Satyam NEWS

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి జగన్ కు చెడ్డపేరు

Satyam NEWS

Leave a Comment