38.2 C
Hyderabad
May 2, 2024 20: 34 PM
కవి ప్రపంచం

ఓ నల్లనయ్యా

#sembhu damodarrao

మమత పెంచని మతము

స్ఫూర్తి నివ్వని గతము

జలధి నీటితొ సమము

ఓ నల్లనయ్యా .

దొంగ స్వాములు నేడు

మాయ మాటల తోడ

మతము చెరపిరి చూడ

ఓ నల్లనయ్యా .

అన్ని రంగము లందు

ఆడ వారే ముందు

అబల అబద్ధ మందు

ఓ నల్లనయ్యా ,

మత్తు మందున యువత

దారి తప్పగ భవిత

మాసి పోయెను చరిత

ఓ నల్లనయ్యా .

సర్దుక పోవు గుణము

కనుటె నేడది ఘనము

ఛిద్ర మాయెను గృహము

ఓ నల్లనయ్యా.

మాతృ భాషకు సమము

జగతి యందున కనము

మరువ కూడదు మనము

ఓ నల్లనయ్యా.

తల్లి దండ్రుల బ్రదుకు

తోడు కొరకు వెదుకు

ఆశ్రమాలే దొరకు

ఓ నల్లనయ్యా .

మామ కోడలు తోడ

ప్రేమ సరాగ మాడ

కొడుకును చంపె నేడు

ఓనల్లనయ్యా .

సంకుచిత భావమది

పెరుగగ అనుపద మది

బంధము తెగి పడినది

ఓ నల్లనయ్యా .

ధనముపై అత్యాశ

మోసపోయి నిరాశ

రోజు వారి తమాష

ఓ నల్లనయ్యా .

అక్రమార్కుల నీతి

అడుగు జాడను రీతి

పొందు చుండెను ఖ్యాతి

ఓ నల్లనయ్యా .

జనులు ధనమునె జూడ

బంధు ప్రీతియు నేడు

సన్న గిల్లెను చూడ

ఓ నల్లనయ్యా .

వారసత్వపు గరిమ

తెలియ జెప్పని ఫలము

అనుభవించగ మనము

ఓ నల్లనయ్యా .

వృక్ష సంపద తరుగ

భూమి తాపము పెరుగ

శీత నగములు కరుగ

ఓ నల్లనయ్యా .

భార్య భర్తల మధ్య

తగ్గి పోయె సయోధ్య

బ్రతుకు మారెను మిథ్య

ఓ నల్లనయ్యా .

మితము జీవిత మందు

మంచి బ్రతుకుకు మందు

ఆచరించుడి ముందు

ఓ నల్లనయ్యా .

మోసగించుట నేడు

నిత్యకృత్యము చూడ

దేశ ప్రగతికి చీడ

ఓ నల్లనయ్యా

వేష భాషల యందు

అనుకరణె పసందు

మార్పు రావలె ముందు

ఓ నల్లనయ్యా

మనిషి మనిషికి తోడు

మనిషె కానగ పరుడు

మంచి కాదిది వినుడు

ఓ నల్లనయ్యా .

కష్ట పడకయె యున్న

కలల బ్రదుకది యన్న

శాంతి బ్రదుకున సున్న

ఓ నల్లనయ్యా .

పెద్ద మేడలు నేడు

మనసు గువ్వల గూడు

బ్రతుకు యొంటరి కాడు

ఓ నల్లనయ్యా .

కాలు చంద్రుని పైన

ఎరుగము పొరుగు నైన

జగతి చిత్రపు కోన

ఓ నల్లనయ్యా .

శంభు దామోదర రావు (వశిష్ఠ), హైదరాబాద్, ఫోన్ నెం: 8074830704

Related posts

బోధనం

Satyam NEWS

పంద్రాగస్టు

Satyam NEWS

వేయిపడగలెత్తిన మేధావి

Satyam NEWS

Leave a Comment