రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు నిజామాబాద్ మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత ససేమిరా అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడం అటుంచి నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో కూడా ప్రచారం చేసేందుకు కవిత రావడం లేదని తెలిసింది. నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో ఓటమి పాలైన నాటి నుంచి ఒక్క సారి కూడా నియోజకవర్గానికి కవిత రాలేదు. నిజామాబాద్ టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులే హైదరాబాద్ వచ్చి ఆమెను కలిసేందుకు ప్రయత్నించేవారు.
అయితే మునిసిపల్ ఎన్నికల హడావుడి ప్రారంభం అయిన నాటి నుంచి ఆమె స్థానిక నాయకులను కలిసేందుకు కూడా ఇష్టపడటంలేదు. స్థానిక నాయకులు తమకు అన్యాయం చేస్తున్నారని, జోక్యం చేసుకుని తమకు టిక్కెట్లు ఇప్పించాలని కొందరు కోరినా కూడా కవిత జోక్యం చేసుకోలేదు. టిక్కెట్లతో తనకు సంబంధం లేదని కవిత స్పష్టం చేశారని అంటున్నారు. నిజామాబాద్ పార్లమెంటు ప్రాంతంలో బిజెపిపై వ్యతిరేకత పెరుగుతున్నా కూడా దాన్ని ఉపయోగించుకోవడానికి కవిత ప్రయత్నించడం లేదు. ఇది స్థానిక నాయకులకు తీవ్ర అసంతృప్తి కలిగిస్తున్నది.