39.2 C
Hyderabad
May 4, 2024 21: 39 PM
Slider సంపాదకీయం

ఏపిలో అసంతృప్తనేతల చూపు కేసీఆర్ పార్టీ వైపు?

#kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన భారత రాష్ట్ర సమితి పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఆదరణ లభిస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడే చెప్పడం కష్టమే కానీ ఈ కొత్త పార్టీకి అభ్యర్ధుల కొరత మాత్రం ఉండదు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు అసంతృప్తనేతలు కేసీఆర్ పార్టీ వైపు చూస్తున్నట్లు తెలిసింది.

తొలి సారి అధికారంలోకి వచ్చిన వైసీపీ లో ఇప్పటికే లెక్కకు మించిన నాయకులు తయారయ్యారు. అసెంబ్లీ నియోజకవర్గాలలో కాకుండా పార్లమెంటు స్థానాలలో కూడా ‘‘పోటీ అభ్యర్ధులు’’ లెక్కకు మించి తయారయ్యారు. ఒక అంచనా ప్రకారం దాదాపు 10 పార్లమెంటు స్థానాలలో సిట్టింగ్ ఎంపిలను సవాల్ చేసే స్థాయికి అసంతృప్త నేతలు ఎదిగిపోయారు.

ప్రశాంత్ కిషోర్ బృందం చేస్తున్న సర్వేలలో దాదాపు 10 పార్లమెంటు స్థానాలలో ప్రస్తుత ఎంపిల పనితీరు సక్రమంగా లేదనేతేలింది. దాంతో ఎమ్మెల్యేలనే కాకుండా ఎంపిలను కూడా మారిస్తే తప్ప వైసీపీ గట్టెక్కేలా కనిపించడం లేదు. ఈ విషయం సిట్టింగ్ ఎంపిలకు కూడా తెలిసింది. ఈ కారణంతో సిట్టింగ్ ఎంపిలను సవాల్ చేసే అభ్యర్ధుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతున్నది.

ఈ మూడున్నర సంవత్సరాలలో నేతలందరూ ఆర్ధికంగా బలపడటంతో కొందరు పార్లమెంటు స్థానాలపై కన్నేశారు. కొందరు ఎమ్మెల్యేలను ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో నిలబెట్టాలని ఇప్పటికే వైసీపీ అధిష్టానం భావిస్తున్నది. అదే విధంగా మంత్రి వర్గంలో స్థానం కోసం ఆశతో ఉన్న సిట్టింగ్ ఎంపిలలో కొందరు ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారు.

ఈ కారణంగా ఎంపి సీటు ఖాళీ అవుతుందని భావించిన ‘‘పోటీ అభ్యర్ధులు’’ తమ కార్యకలాపాలను ఎక్కువ చేశారు. ఇన్ని రకాలుగా సిట్టింగ్ ఎంపిలను సవాల్ చేసే అభ్యర్ధులు పెరిగిపోవడంతో రాబోయే రోజుల్లో వైసీపీ అధినేత పార్టీ ఎంపి అభ్యర్ధులను ఎంపిక చేయడానికి ఎంతో కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎంతో డబ్బు ఖర్చు చేసుకుంటూ తిరుగుతున్న అభ్యర్ధులు ఆఖరు నిమిషంలో తమకు టిక్కెట్ దక్కకపోతే పక్క చూపులు చూడటం ఖాయంగా కనిపిస్తున్నది.

అభ్యర్ధులు ఎక్కువగా ఉన్న వైసీపీకి ఇది విజయావకాశాలను కూడా దెబ్బతీసే అవకాశం ఉన్నది. వైసీపీ లో టిక్కెట్ దొరకని వారు ఇప్పటి వరకూ బీజేపీ వైపు చూశారు. బీజేపీకి ఏమాత్రమైనా విజయావకాశాలు ఉంటాయా అని లెక్కలు వేసుకున్నారు.

బీజేపీ పరిస్థితి అంతగా ఆశాజనకంగా లేకపోవడం, తెలుగుదేశం పార్టీలో అవసరమైన అభ్యర్ధులు ఉండటం తదితర కారణాలతో ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితుల్లో వారు మౌనంగా ఉన్నారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించడంతో వైసీపీ అసంతృప్తుల్లో కొత్త ఆశ కనిపిస్తున్నది. వైసీపీ టిక్కెట్ రాకపోతే కొత్త పార్టీలోకి జెంప్ అయ్యేందుకు వారికి వీలుచిక్కింది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పుడున్న సిట్టింగ్ ఎంపిలకు పోటీగా నలుగురైదుగురు అభ్యర్ధులు రెడీగా ఉన్నారు. సిట్టింగ్ ఎంపిలకు సమాంతరంగా పలు నియోజకవర్గాలలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వైసీపీ నేతల సంఖ్య కూడా బాగానే ఉన్నది. అందరికి టిక్కెట్ వచ్చే అవకాశం లేదు కాబట్టి తెలంగాణ సీఎం కేసీఆర్ పంట పండినట్లే కనిపిస్తున్నది.

Related posts

అగ్నిపథ్ కు వ్యతిరేకంగా నేడు భారత్ బంద్

Satyam NEWS

వనపర్తిలో ఏసీబీకి పట్టుబడిన జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్

Satyam NEWS

సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్న వైసీపీ రౌడీలు

Satyam NEWS

Leave a Comment