త్వరలో గుంటూరు జిల్లా నరసరావుపేటలో కొప్పరపు కవుల విగ్రహాల ప్రతిష్ఠ నిర్వహించనున్నారు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొప్పరపు కవుల మొట్టమొదటి అవధానం, అవధాన యాత్ర సుమారు 120ఏళ్ళ క్రితం నరసరావుపేటలోనే ప్రారంభమైందని అన్నారు.
కవుల సంస్కృత విద్యాభ్యాసం కూడా ఇక్కడే జరిగిందని, ఈ వివరాలన్నీ నరసరావుపేట వాసులకు ఆనందం కలిగించే అంశాలని అన్నారు. ఇక్కడికి కాస్త దూరంలోనే కొప్పరపు కవుల స్వగ్రామం కొప్పరం ఉందని ఆయన తెలిపారు. కొప్పరపు కవులు పలనాడు, కొండవీడు ప్రాంతానికి చెందినవారు కావడం విశేషమని, తెలుగు జాతికి చెందిన ఇంతటి మహనీయుల విగ్రహాలు నరసరావుపేటలో ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు.
కవుల సీమ నరసరావుపేటలో వారి విగ్రహాలు స్థాపించుకోవడం గర్వకారణమని అన్నారు. నరసరావుపేట మున్సిపల్ కమీషనర్, కొప్పరపు కవుల మనుమలు మాశర్మ, వేంకటసుబ్బరాయశర్మ (బాలకవి )ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలో జరిపే ఈ ఉత్సవానికి ఉప సభాపతి కోన రఘుపతి ముఖ్య అతిధిగా హాజరు అవుతారని డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు, అధికారభాషాసంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రఖ్యాత నటుడు బ్రహ్మానందం, ప్రభుత్వ సలహాదారుడు సీనియర్ జర్నలిస్ట్ కె. రామచంద్రమూర్తి తదితరులు పాల్గొంటారని ఆయన తెలిపారు.