29.7 C
Hyderabad
May 2, 2024 03: 57 AM
ఆధ్యాత్మికం

బుడి బుడి అడుగులతో నడచి రావా చిన్ని కృష్ణా….

Krishnastami Two

చేతవెన్నముద్ద చెంగల్వపూదండ

బంగారు మొలతాడు పట్టుదట్టి

సందె తావీదులు సరిమువ్వ గజ్జెలు

చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతు

ఇది వినగానే చదవగానే ఆ చిన్ని కృష్ణుని రూపం కళ్లముందు సాక్షాత్కరించక మానదు. ముద్దులు మూటగట్టే ఏ చిన్నారిని చూసినా కృష్ణుడితోనే పోలుస్తాం కదా!!

బాలుడిగా ఉన్నప్పుడే ఈ వెన్నదొంగ చేసిన అల్లర్లు, మాయలు,  లీలలు అంతా ఇంతా కాదు పిల్లలు,  పెద్దలు అందర్నీ ఎప్పటికీ ఉర్రూతలూగిస్తుంటాయి . మరి ఆ కన్నయ్య గురించి ఆయన పుట్టినరోజు విశేషాల గురించి తెలుసుకుందామా మరి!!

రోహిణి నక్షత్రంలో జన్మించిన కృష్ణుడు

ద్వాపరయుగంలో  శ్రీ ముఖనామ సంవత్సరం శ్రావణ మాసంలో అష్టమినాడు అర్థరాత్రి  రోహిణి  నక్షత్రంలో  కంసుడి చెరలో ఉన్న దేవకి వసుదేవుల అష్టమ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీమహావిష్ణువు అవతారాల్లో శ్రీకృష్ణావతారం విశిష్టమైనది అందుకే కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్యతిథినే కృష్ణాష్టమిగా జరుపుకుంటారు.

కృష్ణాష్టమిని జన్మాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. భక్తి శ్రధ్దలతో శ్రీ కృష్ణ జయంతి ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండపురాణం చెప్తోంది. పండుగ రోజు ఉదయాన్నే స్నానాదులు పూర్తిచేసి  కృష్ణుడి విగ్రహాన్ని పూజా మందిరాన్ని పువ్వులతో అలంకరిస్తారు.

ప్రతి ఇంటా బాలకృష్ణుని చిన్ని చిన్ని పాదాలు లోగిళ్లలో వేసి కృష్ణుడు ఇంట్లోకి రావాలని భక్తులు కోరుకుంటారు.  పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు ఉయ్యాలలో కృష్ణుణ్ణి పడుకోబెట్టి ఊపుతూ రకరకాల కీర్తనలు పాటలు పాడుతూ ధూపదీపాలతో స్వామివారిని పూజించి ఆయనకు ఎంతో ఇష్టమైన అటుకులు వెన్న, పాలు, పెరుగు మీగడ ,తినుబండారాలు మొదలైనవన్నీ నైవేద్యంగా సమర్పిస్తారు.

భక్తులకు జ్ఞానోపదేశం చేసిన కృష్ణుడు

పూజాక్రతువు పూర్తయిన తరువాత శ్రీకృష్ణ లీలా ఘట్టాలను చదవాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి కృష్ణాష్టమి నాడు కేవలం భగవానుని పూజించడమే కాదు ఆయనలోని  మంచి లక్షణాలను కూడా అలవర్చుకోవాలని, ప్రతి విషయంలోనూ స్వార్థం ఈర్ష్య అసూయలు కొంతైనా విడనాడి మానవజన్మకు సార్థకతను ఏర్పరుచుకోవాలని తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు.

ఆయన చేసిన అన్ని పనులలోను అర్థం , పరమార్థం కనిపిస్తాయి ధర్మ పరిరక్షణలోను రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాడాయన. ఈ రోజు కృష్ణుని అర్చిస్తే సకలపాపాలు పోతాయని ప్రగాఢ నమ్మకం ధర్మార్థ, కామ మోక్షాలు కలుగుతాయని స్కాందపురాణం చెబుతోంది సంతానం లేనివారు సంతాన గోపాల మంత్రంతో కృష్ణుణ్ణి పూజిస్తే సంతానం కలుగుతుందని అదేవిధంగా వివాహం కానివారు రుక్మిణి కళ్యాణం చేయడం వల్ల వారికి వివాహయోగం కలుగుతుందని నమ్మకం.

పురవీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి పగులగొడతారు ఇది చూసే వాళ్లకు పాల్గొనేవారికీ కూడా ఉత్కంఠ భరితంగా ఆనందోత్సాహాలతో ఆద్యంతం కొనసాగుతుంది అందుకే ఈ పండుగను ఉట్టి పండుగ లేదా ఉట్ల తిరునాళ్ళు అని కూడా  పిలుస్తారు. కలియుగంలో కల్మషాల్ని హరించి పుణ్యమును ప్రసాదించే పర్వదినం ఇది.

దుష్టశిక్షణ, శిష్టరక్షణ అన్న గీతోపదేశంతో మానవాళికి దిశా నిర్దేశం చేసిన కృష్ణభగవానుని భక్తి శ్రధ్దలతో సేవించి భగవంతుని దయకు కృపకు పాత్రులయ్యి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆశిస్తూ ఈ కరోనా మహమ్మారి నుండి సకల జనులెల్లరు సురక్షితంగా బయటపడాలని  ఆ కృష్ణ భాగవానుడుని మరోమారు అర్థిస్తూ సత్యం న్యూస్ పాఠకులందరికి జన్మాష్టమి శుభాకాంక్షలతో

మంజుల సూర్య, హైదరాబాద్

Related posts

భగవద్గీతను శవయాత్రలలో వినిపించడం నిషేధం

Satyam NEWS

ఉజ్జయినిలో శ్రీ మహాకాల్ లోక్‌ ప్రారంభం

Satyam NEWS

తిరుమలలో త్వరలో సామూహిక వివాహాలకు అనుమతి

Satyam NEWS

1 comment

Yuddandi Siva Subramanyam August 11, 2020 at 3:25 AM

చాలా బాగుంది మీ రచనా శైలి. మీ కవితలు కూడా.

Reply

Leave a Comment