30.7 C
Hyderabad
April 29, 2024 03: 43 AM
ఆధ్యాత్మికం

కృష్ణాష్టమి – కృష్ణతత్వం – ఒక పరిశీలన

#Radha Krishna

హిందూ సాంప్రదాయంలో జరుపుకొనే అనేకానేక పండగలలో శ్రీకృష్ణాష్టమి ఒకటి. దుష్టసంహారానికై ఆ శ్రీమన్నారాయణుడు సాధారణ మానవుని వలె జన్మించిన రోజే కృష్ణాష్టమి. కృష్ణ జననం ఒక అద్భుతం.

ద్వాపరయుగంలో శ్రీముఖ నామ సంవత్సరం,శ్రావణ బహుణాష్టమి,రోహిణీ నక్షత్రాన,అర్ధరాత్రి ఉరుముల వర్షంలో కృష్ణ జననం జరిగింది. శ్రీమన్నారాయుణుని అవతారాలలో అత్యంత విశిష్టమైనది, నేటి మానవాళికి ఆదర్శ ప్రాయమైనది కృష్ణావతారం.

మానవుడు ఎలా జీవించాలో,ఎలా జీవించకూడదో, ఏది స్వధర్మం, ఏది పరధర్మం, ఎక్కడ ఎవరిని  శిక్షించాలి, ఎవరిని రక్షించాలి, అసలు మనిషి విజయాన్ని ఎలా కైవసం చేసుకోవాలి  ఇవన్నీ మనకు కృష్ణావతారంలో కనపడతాయి. చెరసాలలో కఠిన శిలల మీద జన్మించి, మన పుట్టుక మన ఉన్నతికి అవరోధం కాదు అనే సందేశాన్ని మనకు అందించాడు.

కృష్ణుడు నేర్పిన జీవిత పాఠాలు

ఆత్మస్థైర్యం ఉంటే ఎంతటి కష్షాన్నయినా అవలీలగా, దూదిపింజెని లేపినట్లు, అధిగమించవచ్చు అని గోవర్ధన గిరిని చిటికెన వ్రేలుపై నిలపడం ద్వారా నిరూపించాడు. శరణాగతి కోరిన వారిని ఎటువంటి సందేహం లేకుండా కాపాడాలని గజేంద్ర మోక్షము, వస్త్రాపహరణ సమయంలో ద్రౌపది కి వలువలు ఇవ్వడం ద్వారా తెలియజేశాడు.

అమలిన ప్రేమ ఎలా ఉండాలో రాధామాధవ తత్వం తెలుపుతుంది. యుధ్ధం అనివార్యమని తెలిసినా కౌరవ పాండవుల మధ్య సయోధ్య కదిలించే నేపధ్యంలో,ఆ పరమాత్మలో  నేటికి ఆదర్శంగా తీసుకోగలిగే ఒక ఆదర్శ ప్రాయుడైన  రాయబారిని మనం చూస్తాం.

ఇవన్నీ ఒక ఎత్తయితే కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి చేసిన గీతోపదేశం మానవాళికి ఒక గొప్ప వరం. కర్తవ్య నిర్వహణలో భీరువై పారిపోక, విజయం ఎలా సాధించాలో చెప్పిన ఓ విశ్వగురువు ఆ శ్రీ కృష్ణ పరమాత్మ. అనంత సాగరం లాంటి కృష్ణ తత్వం గురించి తెలుసుకోవడమంటే, ఎడారిలో ఇసుక రేణువులు లెక్కపెట్టటం వంటిది.

దేశవ్యాప్తంగా జరిగే పండుగ ఇది

కృష్ణాష్టమి వేడుకలు దేశమంతా అత్యంత భక్తి శ్రధ్ధలతో జరుపుకుంటారు. భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి బాలకృష్ణుడిని ఆరాధిస్తారు. పాలు, పెరుగు, వెన్న, మీగడ, అటుకులు, కాయం (రకరకాల మూలికలు, బెల్లం, నేయి వగైరాలతో చేసే పదార్థం దీనిని కొన్ని ప్రాంతాల్లో మోడీకారం అని కూడా అంటారు)

ఇలా వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. తదనంతరం బాలకృష్ణుడిని ఊయలలో వేసి నృత్యగానాలతో పవళింపు సేవ చేస్తారు. మరునాడు కృష్ణుని కొంటె పనులను గుర్తు చేసుకుంటూ’ ఉట్టిమహోత్సవం’ నిర్వహిస్తారు.

నిజానికి కృష్ణుడిని భగవంతునిగా కంటే మన ఇంట్లో  పసిబిడ్డగా,అల్లరి పిల్లవాడిగా, ఒక స్నేహితుడిగా, ఒక ప్రేమికుడిగా, ఒక శ్రేయోభిలాషిగా, ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిగా మన ఇంట్లో మనిషే అనిపిస్తుంది. అదే కృష్ణతత్వం.

కృష్ణుడిని ఆరాధిస్తే సకల పాపాలు పోయి ధర్మార్ధ కామ మోక్ష ప్రాప్తి లభిస్తుంది.

అనన్యాశ్ఛిన్తయన్తోమాం యేజనాఃపర్యుపాసతే

తేషాంనిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం

పరిత్రాణాయ సాధూనాం వినాశాయదుష్క్రుతాం

ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగేయుగే!

సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు

పీ.వీ.యస్. కృష్ణ కుమారి, 9494520994

Related posts

ఎక్లిప్స్ ఎఫెక్ట్: నీళ్లలో నిలబడ్డ రోకలి

Satyam NEWS

చిన్న‌శేష వాహ‌నంపై శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

Satyam NEWS

బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయంలో చండీహోమం

Satyam NEWS

Leave a Comment