36.2 C
Hyderabad
May 12, 2024 17: 05 PM
Slider ప్రత్యేకం

‘బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ’పై రాష్ట్ర ప్రజలకు లేఖ

#TDP

‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ’ పై రేపటి నుంచి 45 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది టీడీపీ. పార్టీ కార్యకర్తలు, నేతలు 3 కోట్ల మందిని కలిసే కార్యక్రమంలో ప్రజల సహకారం, భాగస్వామ్యం కోరుతూ రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబునాయుడు. ఆయన రాసిన బహిరంగ లేఖ పూర్తి పాఠం

ప్రియమైన ప్రజలకు నమస్కారం!

తెలుగుదేశం పార్టీ మొదటి నుండి బలమైన సంక్షేమ పునాదులపై ప్రగతి రథాలను నడిపించింది. పార్టీ చిహ్నమైన సైకిల్ రెండు చక్రాల్లో ఒకటి సంక్షేమానికి, మరొకటి అభివృద్ధికి ప్రతీకగా నిలిచాయి.2014-19 మధ్య రెండంకెల వృద్ధితో ప్రతి రంగంలో దేశంలో అగ్రగామిగా ఉన్న నవ్యాంధ్రను నేటి పాలకులు నాలుగున్నరేళ్లలో సర్వ నాశనం చేశారు.

నాడు అద్భుతంగా పురోగమించిన రాష్ట్రం ..నేడు అధ:పాతాళానికి పడిపోయింది. భస్మాసుర పాలనలో అన్ని వర్గాల ప్రజలు అల్లాడిపోతున్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. మహిళా సాధికారత, భద్రత అటకెక్కింది. పెట్టుబడుల మాటే లేదు. నిరుద్యోగం పెరిగిపోయింది. బడుగు బలహీన వర్గాలపై దాడులు నిత్యకృత్యం అయ్యాయి. ప్రభుత్వ దోపిడీతో పేదలు మరింత పేదలు అయ్యారు.

సహజ వనరులను, ప్రభుత్వ, ప్రజల ఆస్తులను దోచేస్తూ సైకో ప్రభుత్వం రాష్ట్ర ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది. వైసీపీ మాఫియా రాజ్యంలో మీ భవిష్యత్తు… మరీ ముఖ్యంగా మీ పిల్లల భవిష్యత్తు నాశనం అయ్యింది. ఈ పరిస్థితుల్లో మళ్లీ నవ్యాంధ్రలో మీ అందరి సహకారంతో వెలుగులు నింపడానికి టీడీపీ తలపెట్టిన “బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ” కార్యక్రమంలో మీ భాగస్వామ్యం, సహకారం కోరుతూ ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను.

రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యలకు పరిష్కారం చూపేందుకు…. మీ కష్టాలు, బాధలు, సమస్యలు దృష్టిలో పెట్టుకుని “భవిష్యత్తుకు గ్యారెంటీ” పేరుతో పథకాలను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. సెప్టెంబరు 1 నుంచి 45 రోజుల పాటు “బాబు ష్యూరిటీ భవిష్యత్ కు గ్యారెంటీ” కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యకర్తలు, నేతలు ప్రతి ఇంటికి వస్తారు. ‘‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ’’ అనే పేరుతో ప్రజా సాధికార చైతన్య కార్యక్రమంలో పాల్గొంటారు.

45 రోజుల పాటు కొనసాగే ఈ ప్రచార కార్యక్రమంలో మీ ఆర్థిక పరిపుష్టి, రక్షణ, భవిష్యత్తు కోసం రూపొందించిన సూపర్ సిక్స్ పథకాల ఉద్దేశ్యాలను, వాటి వలన కలిగే ప్రయోజనాలను మీకు వివరిస్తారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వాటి పూర్తిస్థాయి అమలుకు నా హామీని స్వయంగా మీ ఇంటికి వచ్చి అందిస్తారు. మీ సమస్యలపై వారితో చర్చించండి…వారిని ఆదరించండి…ఆశీర్వదించండి. మన రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశంతో కలిసి అడుగులు వేయండి.

భవిష్యత్తుకు గ్యారెంటీ పథకాలు :
1.మహాశక్తి పథకం:

రాష్ట్ర నిర్మాణంలో మహిళలు కీలక పాత్రను పోషిస్తున్నారు. అయినా ఆర్థిక స్వయం పరిపుష్టి లేక వారి శక్తి యుక్తులు పూర్తిస్థాయిలో వినియోగ పడటం లేదు. మహిళలు తమ కాళ్ళపై తాము నిలబడేటట్లు చేస్తూ….వారి బిడ్డలను ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి వీలుగా ఈ పథకాన్ని రూపొందించాము. ఇందులో భాగంగా నాలుగు పథకాలు అందిస్తున్నాం.

i) తల్లికి వందనం: ప్రతి బిడ్డను చదివించేందుకు ఒక్కొక్కరికి రూ 15,000 చొప్పున… ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఆర్థిక సహాయం అందిస్తాం.

ii) ఆడబిడ్డ నిధి: 18 పైబడి 60 సంవత్సరాల లోపు వయసున్న ప్రతి మహిళకు నెలకు రూ.1,500ల ఆర్థిక సహాయం అందజేస్తాం.

iii) ఉచిత బస్సు ప్రయాణం: ఉద్యోగ, ఉపాధి, ఇతర అవసరాల నిమిత్తం ప్రయాణించేందుకు ఆడపడుచులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తాం.

iv) ఉచిత గ్యాస్ సిలిండర్లు: నిత్యావసర వస్తువుల ధరలతో సతమతం అవుతున్న గృహిణులకు భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు మరింత భారం అయ్యాయి. వారికి ఆ భారం తగ్గించడానికి ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తాం. అవసరం అయితే నాలుగో సిలిండర్ కూడా ఉచితంగా ఇచ్చేందుకు సిద్దమవుతున్నాం.

2.అన్నదాత: రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. సబ్సిడీలు దూరమై… సాగు భారమై రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రేయింబవళ్లు శ్రమించి, విపత్తులు ఎదుర్కొంటూ అన్నం పెట్టే ప్రతి రైతన్నకు అండగా ఉండేందుకు సంవత్సరానికి రూ. 20,000ల ఆర్థిక సహాయం చేస్తాం.

  1. యువగళం: పరిశ్రమలు రాక, ఉద్యోగాలు లేక నిర్వీర్యం అవుతున్న యువతను అదుకునేందుకు యువగళం పథకం ద్వారా నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3,000/- ఆర్థిక సహాయం చేస్తాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.
  2. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం: జనాభాలో సగానికి పైగా ఉన్న వెనుకబడిన తరగతుల వారి రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తాం.
  3. ఇంటింటికి రక్షిత తాగునీటి కుళాయి: పలు అనారోగ్య సమస్యలకు కలుషిత తాగునీరే ప్రధాన కారణం. ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఇంటికీ రక్షిత తాగునీటి కుళాయి ఉచితంగా ఏర్పాటు చేస్తాం.
    6.పూర్ టు రిచ్ (పేదలను ధనికులుగా చేయడం): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంస్కరణలతో, పిపిపి వంటి విధానాలతో రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చాం. దార్శనికతతో తీసుకున్న నిర్ణయాలతో ప్రజల జీవితాల్లో పెనుమార్పులు తెచ్చాం. తదనంతరం రాజకీయ, విధానపరమైన ఒడిదుడుకుల వల్ల పేదల స్థితిగతుల్లో ఆశించిన మార్పు కొనసాగలేదు. ఈ పరిస్థితిని సమూలంగా మార్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం కుటుంబ స్థాయిలో సమగ్ర సర్వే చేసి ప్రతి ఒక్కరికి తగు విధంగా ఉద్యోగ, ఉపాధి, ఆదాయ అవకాశాల కల్పనకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి పీ-4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్ట్నర్షిప్) విధానాన్ని రూపొందించాం. అధికారంలోకి వచ్చిన తరువాత దీన్ని పటిష్టంగా అమలు చేసి అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేసి అందరికీ తగు అవకాశాలు కల్పిస్తాం. తద్వారా పేదరికం లేని సమాజం వైపు రాష్ట్రాన్ని తీసుకువెళతాం.
    భరోసా నాది….భవిష్యత్తు మీది:
    ‘‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ’’ కార్యక్రమంలో భాగంగా ఈ పథకాల కింద ప్రతి కుటుంబానికి ఎంత ఆర్థిక ప్రయోజనం కలుగుతుందో పార్టీ కార్యకర్తలు, నేతలు మీతో చర్చిస్తారు. ఆ వివరాలన్నింటినీ ఒక కార్డు పైన నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేయిస్తారు. ఆయా పథకాల అమలుకు సంబంధించి నా సంతకంతో కూడిన ఆ హామీ పత్రాన్ని మీకు ఇస్తారు. మీరిచ్చే సమాచారం ఆధారంగా… తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత, ఆయా పథకాల అమలుకు ప్రణాళికలను రూపొందించడంతో పాటు మీకు ఆ పథకాల ప్రయోజనాలు నేరుగా అందించగలుగుతాం.
    కనుక రానున్న 45 రోజుల్లో తెలుగుదేశం పార్టీ చేపట్టనున్న ‘‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ’’ కార్యక్రమం మీ భవిష్యత్తుకు, రాష్ట్ర ప్రగతికి ఎంతో కీలకమైనది. మీ జీవితాలకు, రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాట వేసే తొలి అడుగు ఈ కార్యక్రమం. వచ్చే 45 రోజుల్లో మూడు కోట్ల మందిని కలుసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రభుత్వ ఏర్పాటుకు ముందే కుటుంబాల వారీగా సంక్షేమ పథకాల కింద కలిగే ఆర్థిక ప్రయోజనాలను లబ్ధిదారులతో సంప్రదించి వాస్తవికంగా పరిగణనలోకి తీసుకునే ప్రయత్నం చేయడం దేశంలో ఇదే మొదటిసారి.
    దసరా పర్వదినం నాడు సమగ్ర మేనిఫెస్టో ప్రకటించబోతున్నాను. మనందరి బాగుకోసం మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం మన రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడం కోసం..ఇంకా ఏమేం చేయమంటారో కూడా మీ ఇంటికి వచ్చే మా పార్టీ ప్రతినిధులకు తెలియజేయండి. మీ అందరి సలహాలతో మేనిఫెస్టో రూపొందిస్తాను. అందరి భాగస్వామ్యం, మద్దతు, సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం. మీకోసం మీ ఇంటికి, మీ ప్రాంతాలకు వచ్చే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, బృందాలకు పూర్తిగా సహకరించాలని మరోసారి కోరుతున్నాను.
    మీ
    నారా చంద్రబాబు నాయుడు

Related posts

కాంట్రవర్సీ నేచర్: తీరు మారని బైంసా నిత్యం ఘర్షణలే

Satyam NEWS

రేవంత్ రెడ్డికి మల్లు రవి అభినందన

Satyam NEWS

పోలీసులు అధికారులు ప్రతిపక్షాలను భయపెడుతున్నారు

Satyam NEWS

Leave a Comment