మహబూబాబాద్ జిల్లాలోని అమనగల్ గ్రామంలో గత మూడు రోజుల క్రితం మహిళపై 9 మంది అత్యాచారం చేసిన ఘటనలో ఎనిమిది మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి కేసుకు సంబంధించిన వివరాలు మీడియాకు వెళ్లడించారు. నిందితుల్లో ఆరుగురు మైనర్లు కాగా, ముగ్గురు మేజర్లు ఉన్నారు.
సంఘటన వివరాల్లోకి వెళితే ఈనెల 6వ తేదీన మహిళ హైదరాబాద్ నుంచి ఇల్లెందు వెళ్లడానికి రైలులో బయలుదేరింది. 7వ తేదీన ఉదయం మహబూబాబాద్ చేరుకున్న మహిళ తన దగ్గర ఇంటికి వెళ్లడానికి డబ్బులు లేకపోవడంతో అక్కడే ఉండిపోయింది. రాత్రి 8 గంటల సమయంలో తనకు పరిచయస్తుడైన అమనగల్‌కు చెందిన అంగోతు చందుకు ఫోన్ చేసి డబ్బులు అడిగింది. చందు మహిళను అమనగల్ రమ్మనగా ప్యాసింజర్ ఆటోలో ఆ గ్రామానికి చేరుకుంది. అదే అదనుగా భావించి 1) అంగోతు చందు(16), 2) ఇస్లావత్ వెంకట్(16), కలోతు నెహ్రూ(17), ధరావత్ ప్రభు(16) బాదవత్ శంకర్(16), లకావత్ శ్రీకాంత్(14), గూగులోతు హుస్సెన్(20), ఇస్లామత్ రఘు(25), ఇస్లావత్ కిషన్(21)లు యువతిని అమనగల్ సెంటర్ నుంచి మహబూబాబాద్ వెళ్లే మార్గంలో కొంతదూరం డబ్బులు ఇస్తామని తీసుకువచ్చారు.
రోడ్డు పక్కనే ఉన్న మామిడి తోటలోకి ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. రాత్రి 9:30 గంటల నుంచి 11:00 గంటల వరకు ఈ సంఘటన జరిగింది. అదే సమయంలో అమనగల్ నుంచి మహబూబాబాద్ వెళుతున్న బలరాం తండ గ్రామ సర్పంచ్ హరి మామిడితోటలో అరుపులు విని అక్కడికి వెళ్లి చూడగా, సర్పంచ్‌ను చూసిన నిందితులు యువతిని విడిచిపెట్టి ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. సర్పంచ్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న 9 మంది నిందితుల్లో 8 మందిని అదుపులోకి తీసుకోగా ఇంకొక నిందితుడు ఇస్లావత్ కిషన్ పరారీలో ఉన్నాడు. కేసు విచారణలో వేగంగా దర్యాప్తు చేసి నిందితులను త్వరితగతిన అరెస్టు చేసిన డిఎస్పీ నరేష్ కుమార్ , మహబూబాబాద్ రూరల్ సీఐ వెంకటరత్నం, ఎస్సైలు సీహెచ్ రమేశ్‌బాబు, శంర్‌రావు, సిబ్బందిని ఎస్పీ కోటిరెడ్డి అభినందించారు.