40.2 C
Hyderabad
April 26, 2024 12: 21 PM
Slider ప్రత్యేకం

NTR: దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మూడక్షరాలు

#ntramarao

ఎన్ టీ ఆర్ .. ఈ మూడు అక్షరాలు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనం సృష్టించిన ఒక చరిత్రకారుని నామధేయం. అప్పటికే కాంగ్రెస్ అసమర్థ పాలనతో విసిగి, వేసారిన ఆంధ్రప్రదేశ్  ప్రజలకు ఒక ఆశా జ్యోతిలా ఎన్టీ రామారావు కనిపించారు.

వరుస తప్పిదాలతో అన్ని వర్గాల వారికి దూరమవుతున్న రాజకీయ శూన్య వాతావరణంలో ఎన్టీఆర్ తెలుగుభాషపై ఉన్న అచంచల మమకారంతో తెలుగుదేశం పార్టీ స్థాపించడం, తొమ్మిది నెలల అతితక్కువ కాలంలోనే కాంగ్రెస్ పునాదుల్ని పెకలించి అధికారం సాధించడం ఆనాటి దేశ రాజకీయాలలోనే ఒక సంచలనం. ముఖానికి రంగులు వేసుకునేవారు రాజకీయాలకు పనికిరారు అని ఎగతాళి చేసిన వారిని తన అనూహ్య విజయంతో కోలుకోలేని దెబ్బ కొట్టారు.

పలు ప్రాంతీయ పార్టీలకు స్ఫూర్తి ఎన్టీఆర్

దేశంలో పలుచోట్ల  విజయం సాధించిన కాంగ్రెస్ ను ఒంటిచేత్తో మట్టి కరిపించిన మల్ల యోధునిగా చరిత్రకెక్కిన ఎన్టీ రామారావు ఒక ప్రాంతీయపార్టీ సత్తాను దేశానికి ప్రదర్శించారు. ఆనాడు ఆయన వేసిన బాటలోనే అనేక ప్రాంతీయ పార్టీలు దేశంలో పుట్టుకొచ్చాయి. ఈనాడు దేశ రాజకీయాలను ప్రభావితం చేయడంలో ప్రాంతీయ పార్టీల పాత్రను తక్కువ అంచనా వేయడం అసాధ్యం.

రాజకీయాలలో అటువంటి పెనుమార్పుకు ఎన్టీర్  మార్గదర్శకుడు అని విశ్లేషకుల అభిప్రాయం. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ సైతం ఎన్టీఆర్ ను ఎంతో గౌరవించే వారని, ఆయనను స్వామీజీ అని సంబోధించేవారని అంటూ ఉంటారు. ముఖ్యమంత్రి స్థాయి నుంచి జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్ హోదా వరకు.. దేశరాజకీయాలలో చక్రం తిప్పిన తెలుగు వ్యక్తిగా ఎన్టీ రామారావు సృష్టించిన చరిత్ర చిరస్మణీయం.

ఏకతాటిపైకి కాంగ్రెస్ వ్యతిరేకుల సమీకరణ

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆనాటి జాతీయ స్థాయినాయకులను ఏక తాటిపైకి తీసుకురావడంలో ఆయన చూపిన చొరవ అనితరసాధ్యం. అటువంటి రాజకీయ ప్రస్థానానికి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చేసిన అనేక పాలనాపరమైన సంస్కరణలు బీజాలు వేశాయి.

రైతులకోసం రుణమాఫీ, ఆడపిల్లలకు ఆస్తి హక్కు కల్పించడం,చిన్న,సన్నకారు రైతులకు బ్యాంకుల ద్వారా ఆర్థిక సహకారం అందించడం, ఒక రూపాయికి కిలో బియ్యం.. వంటి అనేక ప్రజోపయోగ పథకాలు ప్రవేశపెట్టడం ఆయనకే చెల్లింది. అలాగే చాలాకాలంగా ఉన్న పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం వంటి సాహసోపేత నిర్ణయాలు అనేకం ఆయన పాలనలో చోటు చేసుకున్నాయి.

“సమాజమే దేవాలయం. ప్రజలే దేవుళ్ళు” అనే నినాదం  ప్రజల్లోకి చాలా బలంగా చొచ్చుకుపోయి, తెలుగుదేశం పార్టీకి ఘన విజయాలు అందించింది. బలహీనవర్గాలకు, విద్యావంతులకు రాజకీయాలలో సముచిత ప్రాధాన్యం కల్పించి ఎన్టీఆర్ ఒక నూతన అధ్యాయాన్ని  ఆవిష్కరించడం విశేషం. అలాగే..ఆంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేత నీలం సంజీవరెడ్డి భారత దేశానికి రాష్ట్రపతిగా ఎంపిక కావడంలో ఎన్టీఆర్ పాత్ర కీలకం.

ఆనాడు నంద్యాల నుంచి లోక్ సభకు పోటీ చేసిన నీలం సంజీవరెడ్డిపై ఎవరినీ పోటీ అభ్యర్థిగా నిలబెట్టకుండా ఒక ఆదర్శవంతమైన రాజకీయానికి  దారిచూపడంలో ఆయనకు సాటి ఎవరూ లేరు. తెలుగుదేశం పార్టీని అప్రతిహతంగా నడపడంలో ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షునిగా ఎన్టీఆర్ శైలి విభిన్నంగా ఉండేది. కాంగ్రెస్ పార్టీ తప్పిదాల వల్ల ఏర్పడిన రాజకీయ శూన్యత  తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఆక్రమించి, ఒక దశలో శాసన సభలో కాంగ్రెస్ పార్టీకి కనీస ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన ఘనత ఆయనదే.

తెలుగు ఆత్మగౌరవానికి సూచిక

అప్పటికే రాజకీయాలలో ప్రవేశించి విజయం సాధించిన సినీ ప్రముఖులు రోనాల్డ్ రీగన్ మొదలుకొని తమిళనాడుకు చెందిన కరుణానిధి, ఎంజీ రామచంద్రన్.. ఇంకా చాలా మంది వరకు వేసిన బాటలో ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొలినాళ్ళలో నడిచినా.. క్రమంగా తనకు తెలుగుభాషపై ఉన్న పట్టుతో ప్రసంగాలను రంగరించి అన్ని వర్గాల వారి మద్దతు పొందడంలో ఎన్టీఆర్ విజయం సాధించారు.

ఒక విధంగా ఆయన నోట పలికిన తెలుగువారి ఆత్మ గౌరవం నినాదం ఖండాంతరాలలో ఉన్నతెలుగువారికి నైతిక బలాన్ని ఇచ్చిందనడం అతిశయోక్తి కాదు. అయితే.. ఎన్టీ రామారావు తన రాజకీయ ప్రస్థానం మొత్తం పూర్తి సాఫీగా సాగిందని చెప్పకూడదు.

ఆయన తన రాజకీయ గమనంలో ఎన్నో ఉత్థాన పతనాలు చవి చూశారు. రామ్ లాల్  వంటి అనైతిక గవర్నర్ కారణంగా పదవీచ్యుతి పొందినా కాంగ్రెసేతర రాజకీయ పార్టీల సహకారంతో తిరిగి ముఖ్యమంత్రి గా పదవీ స్వీకారం చేయడం ఒక చారిత్రాత్మక ఘట్టం. ఆ సంఘటనతో ఎన్టీఆర్ రాజకీయ ప్రభ తార స్థాయికి చేరుకుంది.

ఆనాటి జాతీయ నేతలు వీపీ సింగ్, దేవీలాల్, జార్జ్ ఫెర్నాండజ్ వంటి అనేక మంది ఆయనతో దేశ రాజకీయాలు నెరపడానికి ఉత్సాహం చూపడం ఆనాటి రాజకీయ వర్గాలకు ఆశ్చర్యం కలిగించేది. ఎన్నికల ప్రచార సమయంలో కాకీ దుస్తుల ధారణ, అధికార పగ్గాలు చేపట్టాక కాషాయ వస్త్రాలు ధరించడం, కొన్ని సందర్భాలలో తలపాగతో కనిపించడం ఇవన్నీ ఎన్టీఆర్ ప్రత్యేక శైలికి ఉదాహరణలు.

తరువాత కాలంలో.. రాజకీయాలలో ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి సహజం అన్నట్లు..తెలుగుదేశం పార్టీ కూడా దానికి అతీతం కాదని తేలిపోయింది. పార్టీలో, ప్రభుత్వంలో అల్లుళ్ళ హవా పెరగడంతో ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో పెను మార్పులు వచ్చాయి.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కు భార్యావియోగం, జీవితచరిత్ర రాయడానికి వచ్చిన లక్ష్మీ పార్వతని ఆయన పుర్వివాహం చేసుకోవడం, విధాన నిర్ణయాలలో ఆమె జోక్యం ఎక్కువైన కారణం చూపి తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ చేతి నుంచి చిన్నల్లుడు చంద్రబాబు బలవంతంగా లాక్కోవడం, కుటుంబం మొత్తం ఎన్టీఆర్ ను బహిష్కరించడం.. ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఎన్టీఆర్ మనో వ్యథకు గురై పరమపదించడం  నాటకీయంగా జరిగిపోయాయి.

వంటరిగా రాలిపోయిన ధృవతార

సినీ, రాజకీయరంగాలలో ఒకనాడు ధ్రువతారగా వెలిగిన ఎన్టీ రామారావు చివరి రోజుల్లో ఒంటరిగా నిష్క్రమించడం విషాదం. ప్రస్తుతం.. ఎన్టీఆర్ శత వసంతాల సంబరాలు జరుగుతున్న నేపథ్యం సంకుచిత  రాజకీయాలకు వేదిక కాకూడదని రాజకీయ విమర్శకులు అంటున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న రాజకీయ ప్రముఖులకు రాజకీయ తిలకం దిద్దిన ఎన్టీఆర్ కారణ జన్ముడు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లాకి ఆయన పేరు పెట్టడం, ఆయనకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని తీర్మానాలు చేయడం వంటివి ఎన్టీ రామారావు వంటి మేరు నగ ధీరునికి చంద్రునికో నూలు పోగు లాంటివి. అంతటి గొప్ప మహనీయుని శతజయంతి సంధర్భంగా రాజకీయాలకు అతీతంగా సమున్నత గౌరవం ప్రదర్శించడం సంస్కారం అంటున్న రాజకీయ పరిశీలకుల అభిప్రాయం అనుసరణీయం.

పొలమరశెట్టి కృష్ణారావు, రాజకీయ, సామాజిక విశ్లేషకుడు

Related posts

నోబుల్ కాజ్: ప్లాస్టిక్ రహితంగా మేడారం జాత‌ర‌

Satyam NEWS

Tribute: రససిద్ధుడు మంగళంపల్లి బాలమురళి

Satyam NEWS

హుజూర్ నగర్ లో బిజెపి శక్తి కేంద్రాల స్ట్రీట్ కార్నర్ కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment