30.7 C
Hyderabad
May 5, 2024 06: 45 AM
Slider నిజామాబాద్

కామారెడ్డిలో ఉద్రిక్తత: మాస్టర్ ప్లాన్ బాధిత రైతు మృతదేహంతో ఆందోళన

#kamareddy

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం ఓ రైతు జీవితాన్ని బలిగొంది. మాస్టర్ ప్లాన్ లో భాగంగా భూములు కోల్పోతున్న రైతులు సుమారు నెల 15 రోజులుగా మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఏర్పాటు చేసిన గ్రీన్, ఇండస్ట్రియల్ జోన్ లలో లింగాపూర్, ఇల్చిపూర్, అడ్లూర్, అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామాల నుంచి సుమారు 1200 ఎకరాల భూమి రైతులు కోల్పోతున్నారు.

అయితే సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు పయ్యావుల రాములు(38) తన భూమి ఇండస్ట్రియల్ జోన్ లో పోతుందని, భూమికి డబ్బులు ప్రభుత్వం ఇస్తుందో లేదోనన్న బెంగతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మృతదేహంతో కామారెడ్డి మున్సిపాలిటీ ముట్టడికి పిలుపునిచ్చారు.

దాంతో ఒక్కొక్కరుగా కామారెడ్డి మున్సిపాలిటీ వద్దకు రైతులు చేరుకోవడంతో పోలీసులు మున్సిపల్ కార్యాలయం వద్దకు వచ్చి గేటుకు తాళం వేశారు. అడ్లూర్ ఎల్లారెడ్డి నుంచి మృతదేహం రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని తెలుసుకున్న రైతులు మున్సిపల్ కార్యాలయం నుంచి వెళ్ళడానికి బయలుదేరగా పోలీసులు మున్సిపల్ కార్యాలయం గేటుకు తాళం వేశారు. కాసేపటికి మృతదేహం కామరెడ్డికి వచ్చిందని తెలుసుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దాంతో పోలీసులు గేటు తాళం తీయడంతో రైతులు కొత్త బస్టాండ్ వద్దకు చేరుకున్నారు.

మున్సిపల్ కమిషనర్ ఘెరావ్

మున్సిపల్ కార్యాలయంలో రైతులు ఉన్న సమయంలో మధ్యాహ్నం భోజనం చేయడానికి కారులో వెళ్తున్న కమిషనర్ ను రైతులు ఘెరావ్ చేశారు. కమిషనర్ కారును అడ్డుకుని అన్నం పెట్టే రైతు భూమి దక్కదని ఆత్మహత్య చేసుకుంటే ఆ భూములు లాక్కోవడానికి మాస్టర్ ప్లాన్ చేసిన మీరు ఎక్కడికి వెళ్తారంటు కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో చేసేదేమిలేక కమిషనర్ కార్యాలయం లోపలికి తిరిగి వెళ్లిపోయారు

మూడు గంటల ఆందోళన

అడ్లూర్ ఎల్లారెడ్డి నుంచి ట్రాక్టర్ లో రాములు మృతదేహాన్ని తీసుకుని పోలీసుల కళ్లుగప్పి కామారెడ్డి వరకు తీసుకువచ్చారు రైతులు. కామారెడ్డి కొత్త బస్టాండు వద్ద కామారెడ్డి పోలీసులు మృతదేహంతో మున్సిపల్ కార్యాలయానికి వెళ్తున్న ట్రాక్టర్ ను కామారెడ్డి పోలీసులు అడ్డుకున్నారు. దాంతో మున్సిపల్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులు పెద్దఎత్తున కొత్త బస్టాండ్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు.

సుమారు గంట పాటు పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో రైతులు నడిరోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మున్సిపల్ వద్ద ఆందోళన చేయడానికి అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. దాంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు మున్సిపల్ వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వకపోతే ఇటునుంచి మృతదేహాన్ని ఎమ్మెల్యే ఇంటికి తరలించి ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరించారు. దాంతో కేవలం 5 నిమిషాల పాటు మున్సిపల్ వద్ద ఉంచడానికి కామారెడ్డి, సదాశివనగర్ సిఐలు అనుమతి ఇచ్చారు. దాంతో మున్సిపల్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు రైతులు

అడ్డుకున్న డిఎస్పీ

సిఐల అనుమతితో మృతదేహాన్ని మున్సిపల్ వద్దకు తీసుకుని వెళ్తున్న రైతులను డిఎస్పీ సోమనాథం అడ్డుకున్నారు. మున్సిపల్ వద్దకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు. రైతులు ఎంత వేడుకున్నా అనుమతి ఇచ్చేది లేదని, వెనక్కి తిరిగి రైల్వే గేటు నుంచి జిల్లా ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తీసుకెళ్లాలని డిఎస్పీ సూచించారు. అయినా రైతులు వినిపించుకోలేదు. మున్సిపల్ వద్దకు వెళ్ళనివ్వకపోతే ఇక్కడినుంచి కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించారు. సుమారు రెండు గంటల పాటు రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగినా పోలీసులు అనుమతివ్వలేదు

పోలీసులకు ఝలక్ ఇచ్చిన రైతులు

రెండు గంటల పాటు ఆందోళన చేసినా డిఎస్పీ అనుమతి ఇవ్వకుండా మొండిగా వ్యవహరించడంతో పోలీసులు రైతులకు ఉహించని ఝలక్ ఇచ్చారు. మృతదేహాన్ని నడిరోడ్డుపై వదిలేసి ‘మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి.. మృతదేహంతో మాకేం సంబంధం లేదు. ఏమైనా చేసుకోండి’ అంటూ కుటుంబ సభ్యులను తీసుకుని రైతులు అక్కడినుంచి మున్సిపల్ వద్దకు వెళ్లిపోయారు. దాంతో ట్రాక్టర్ వద్ద పోలీసులు బందోబస్తుగా ఉండిపోయారు. ట్రాక్టర్ ను వదిలేసి రైతులు, కుటుంబ సభ్యులు వెళ్లిపోవడంతో ఏం చేయాలో పోలీసులకు పాలుపోక తికమకపడ్డారు. చుట్టుపక్కల పోగైన జనాలను అక్కడినుంచి పంపించేశారు.

బందోబస్తు మధ్య పోస్టుమార్టంకు మృతదేహం

తమకేం సంబందం లేదంటూ మృతదేహాన్ని నడిరోడ్డుపై వదిలి వెళ్లడంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. అరగంట పాటు హైడ్రామా మధ్య పోలీసులు రూట్ మార్చారు. మృతదేహాన్ని మున్సిపల్ ముందు నుంచి తీసుకుని వెళ్తే రైతులు అడ్డుకుంటారని భావించిన పోలీసులు.. ట్రాక్టర్ ను వెనక్కి తిప్పి ముందు రెండు పోలీస్ వాహనాలు, మధ్యలో మృతదేహం ఉన్న ట్రాక్టర్, వెనక ఒక పోలీసు వాహనం ఎస్కార్ట్ తో రైల్వే గేటు మీదుగా పాత బస్టాండ్ నుంచి జిల్లా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.

జిల్లా ఆస్పత్రి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు రైతులంతా మున్సిపల్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. భార్యకు తెలియకుండానే మృతదేహాన్ని పోస్టుమార్టంకు జిల్లా ఆస్పత్రికి తరలించడంతో మృతుని భార్య శారద, కుమారులు అభినంద్, నితీష్ కుమార్ లతో కలిసి రైతులు మున్సిపల్ కార్యాలయం వద్దగల అంబెడ్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు

ఆత్మహత్యలు వద్దు. భూముల కొసం పోరాడుదాం-మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి

రైతు మృతి విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కామారెడ్డికి చేరుకున్నారు. అంబెడ్కర్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులు, కుటుంబ సభ్యుల వద్దకు చేరుకుని వివరాలు కనుక్కున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. దైర్యంగా ఉండాలన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్టా భూములు లాక్కుని వ్యాపారం చేస్తోందని, తద్వారా రైతులు ఆత్మహత్యల బాట పడుతున్నారని  అన్నారు. ఇండస్ట్రియల్ జోన్ పేరుతో భూములను లాక్కుంటుంధని ఆరోపించారు. భూములను తిరిగి దక్కించుకోవడం కోసం ఉద్యమించాలని, పిరికితనంతో ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటుతో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు.

Related posts

విజయనగరం పోలీసు శాఖకు అవార్డుల పంట…!

Satyam NEWS

దేశానికి అన్నం పెట్టే రైతులకు ప్రోత్సాహం కరవు

Satyam NEWS

Flash News: రేపు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్‌

Satyam NEWS

Leave a Comment