28.7 C
Hyderabad
April 28, 2024 06: 11 AM
Slider ముఖ్యంశాలు

గిరిజనులకు అండగా నిలిచేందుకు మెగా వైద్య శిబిరం

#medical camp

విజయనగరం జిల్లా, మెంటాడ మండలం, కొండ లింగాలవలస గ్రామంలో జిల్లా పోలీసుశాఖ ఆధ్యర్యంలో తిరుమల మెడికవర్ మరియు రోటరీ క్లబ్ వారి సహకారంలో ఉచిత మెగా వైద్య శిబిరంను  నిర్వహించారు. ఈ మెగా వైద్య శిబిరానికి విజయనగరం జిల్లా ఎస్పీ  ఎం. దీపిక, ఐపిఎస్ ముఖ్య అతిధిగా హాజరు కాగా, గిరిజనులు జిల్లా ఎస్పీకి హారతులు పట్టి, థింసా నృత్యంతో ఘనంగా స్వాగతం పలికారు.

జిల్లా ఎస్పీ ఎం. దీపిక ఉచిత మెగా వైద్య శిబిరంను ప్రారంభించి, మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాలకు సహాయపడుతూ, గిరిజనులకు అండగా నిలిచేందుకు కమ్యూనిటీ పోలీసింగులో భాగంగా మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించామన్నారు. ఈ వైద్య శిబిరం నిర్వహించాలనే ఆలోచన రాగానే తిరుమల మెడికవర్, స్వామి కంటి ఆసుపత్రి రోటరీ సభ్యులు తమవంతు సహాయాన్ని, సేవలను అందించేందుకు ముందుకు వచ్చారని కొనియాడుతూ, కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ వైద్యం అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం కూడా జగనన్న సురక్ష పథకంను ప్రారంభించిందన్నారు.

ప్రతీ ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అలా చూపడంతోనే భవిష్యత్తులో ఆరోగ్యం జీవించగలమన్నారు. మెగా వైద్య శిబిరంలో కంటికి సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఆప్తమాలజిస్టు, గుండెకు సంబంధించి కార్డియాలజీ, గైనకాలజిస్టు, కేన్సర్ నిపుణులు, జనరల్ సర్జన్, ఫిజీషియన్ వైద్యులు ఉన్నారని, వీటితోపాటు బ్లడ్ ప్రజర్, సుగర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

ఈ వైద్య పరీక్షల్లో ఎవరికైనా శస్త్రచికిత్సలు లేదా స్పెషలిస్టుల పర్యవేక్షణలో చికిత్స అందించాల్సిన అవసరం ఉన్నట్లుగా గుర్తిస్తే, వారికి కూడా ఆయా వైద్యం, శస్త్ర చికిత్సలను ఉచితంగా నిర్వహించేందుకు తిరుమల మెడికవర్ ఆసుపత్రి సహకారంతో పోలీసుశాఖ చొరవ చూపుతుందన్నారు. వైద్యులు వ్రాసిన మందులను కూడా ఉచితంగా అందిస్తామని, వాటిని సక్రమంగా వాడి, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి, జాగ్రతలు పాటించినట్లయితేనే ఈ వైద్య శిబిరం నిర్వహించిన ఉద్దేశ్యం, లక్ష్యం నెరవేరుతుందన్నారు.

రోటరీ అధ్యక్షులు, గైనకాలజిస్టు డా. కృష్ణశాంతి మాట్లాడుతూ తమ ఆరోగ్యం పట్ల ఎవరికి వారు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని, ఆధునిక వైద్యం అందుబాటులో ఉన్నందున ప్రాధమిక స్థాయిలోనే ఆరోగ్య సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తగిన వైద్య సహాయాన్ని పొందాలన్నారు.

బొబ్బిలి డిఎస్పీ పి. శ్రీధర్ మాట్లాడుతూ మారుమూల గిరిజనులు ఆరోగ్యపరమైన ఇబ్బందులతో జీవిస్తూ, తగిన వైద్యం పొందేందుకు అవసరమైన ఆర్థిక పరిస్థితులు లేని కారణంగా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని గుర్తించి, గిరిజనులు ప్రధానంగా ఎదుర్కొంటున్న కంటి సమస్యలు, హృద్రోగం, కేన్సర్, గర్భాశయ సమస్యలు పరిష్కారానికి ఆయా రంగాల్లో నిపుణులను ఈ మెగా వైద్య శిబిరంలో పాల్గొనే విధంగా జిల్లా ఎస్పీ చర్యలు చేపట్టారని, ప్రతీ ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

గజపతినగరం సీఐ లెంక అప్పలనాయుడు మాట్లాడుతూ ఈ మెగా వైద్య శిబిరం నిర్వహణతో కొండ లింగాలవలస గ్రామంతోపాటు చుట్టు ప్రక్కలగల మరో 14 గ్రామాలకు చెందిన గిరిజనులు చికిత్స పొందే వెసులుబాటు కలిగిందన్నారు. ఈ మెగా వైద్య శిబిరంలో సుమారు 500మంది గిరిజనులు మారుమూల గిరిజన గ్రామాల నుండి హాజరుకాగా, వారికి ఆప్తమాలజిస్టు, గైనిక్, క్యాన్సర్, కార్డియాక్, జనరల్ సర్జన్ లు వివిధ రకాల పరీక్షలను ఉచితంగా నిర్వహించి, వారికి ఉచితంగా మందులను పంపిణీ చేసారు. ఈ మెగా వైద్య శిబిరంలో పాల్గొని వైద్యులను, రోటరీ సభ్యులు సేవలందించిన వారిని జిల్లా ఎస్పీ ఎం. దీపిక ప్రత్యేకంగా అభినందించి, జిల్లా పోలీసుశాఖ తరుపున జ్ఞాపికలను అందజేసారు.

అనంతరం, జిల్లా ఎస్పీ సవరివిల్లి లో ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల ను సందర్శించి, విద్యార్థులతో మమేకమై, వారికి బిస్కెట్స్, స్టేషనరీ వస్తువలను పంపిణీ చేసి, వారి చదువు, లక్ష్యాలు గురించి ప్రశ్నలు వేసి, వారిలో జిల్లా ఎస్పీ ఎం.దీపిక స్ఫూర్తి నింపారు.

గిరిజన మహిళలకు చీరలు, పురుషులకు దుప్పట్లు, యువతకు వాలీబాల్ కిట్లు పంపిణీ

గిరిజన యువతలో క్రీడా స్ఫూర్తి నింపేందుకు చుట్టు ప్రక్కల గ్రామాలైన కూనేరు, మామిడివలస, దిగువ మిర్తివలస, పుల్లేటివలస, కొండ లింగాలవలస, సవరవిల్లి గిరిజన యువతకు ఉచితంగావాలీబాల్ కిట్లను జిల్లా ఎస్పీ ఎం.దీపిక అందజేశారు. అదే విధంగా గిరిజన మహిళలకు చీరలు, పురుషులకు దుప్పట్లును జిల్లా ఎస్పీ ఎం. దీపిక అందజేసారు.

ఈ వైద్య శిబిరానికి హాజరైన గిరిజనులకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో భోజన, వసతులను కల్పించారు. జిల్లా ఎస్పీ ఎం. దీపిక గిరిజనులకు స్వయంగా భోజనాలను వడ్డించి, ప్రతీ ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి, ప్రతీ ఒక్కరూ భోజనం చేసి, వెళ్ళాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు డా. కృష్ణశాంతి, బొబ్బిలి డీఎస్పీ పి.శ్రీధర్, ఎఆర్ డీఎస్పీ యూనివర్స్, ట్రైనీ డీఎస్పీ ఎస్.మహేంద్ర, రోటరీ సభ్యులు నరసింహారావు, నీతా, కార్డియాలజిస్టు డా.జ్యోతి, క్యాన్సర్ నిపుణులు డా. దివ్య, జనరల్ సర్జన్ డా. హేమచందర్, స్వామి కంటి ఆసుపత్రి పీఆర్వో బాబీ, గజపతినగరం సిఐ ఎల్. అప్పల నాయుడు, మయూర బాబూరావు, ఆండ్ర ఎస్ఐ సిద్ధార్ద్, పెద మానాపురం ఎస్ఐ శిరీష, బొండపల్లి ఎస్ఐ ఎస్.రవి, ప్రసన్నకుమార్, ఆర్ఎస్ఎస్ఐలు నారాయణ రావు, ప్రసాదరావు, తిరుమల మెడికవర్ పీఆర్వోలు మురళి, సత్తిబాబు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, వైద్యులు, పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.

Related posts

పెండింగ్‌ స్కాలర్‌ షిప్‌లు వెంటనే విడుదల చేయాలి

Satyam NEWS

ఆచార్య` సెట్లో కాజ‌ల్ – గౌత‌మ్ కిచ్లు జంటకు మెగా శీస్సులు

Satyam NEWS

పట్టుబడ్డ ఉగ్రవాదులు: భారీ ఎత్తున పేలుడు పదార్ధాలు

Satyam NEWS

Leave a Comment