29.7 C
Hyderabad
May 3, 2024 03: 05 AM
Slider ప్రత్యేకం

లాక్ డౌన్ కారణంగా ముంచుకొస్తున్న మరో ముప్పు

medical shop

కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో మరో పెను ప్రమాదం ముంచుకువస్తున్నది. రెండు తెలుగు రాష్ట్రాలలో మందుల (మెడిసిన్స్) నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. రాబోయే 15 రోజుల్లో రిటైల్ మెడికల్ షాపుల్లో మందుల స్టాకులు అయిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది.

ఆ తర్వాత మరో 15 రోజులకు అంటే వచ్చే నెలాఖరు కల్లా స్టాకిస్టుల వద్ద స్టాక్ పూర్తిగా అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని మెడికల్ షాపు నిర్వాహకులు అంటున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా మందులు అయిపోతాయనే కారణంగా నెల రోజులకు తీసుకోవాల్సిన మందులను రెండు మూడు నెలలకు తీసుకుని అందరూ ఇళ్లలో పెట్టుకోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది.

లేకపోతే స్టాకిస్టుల వద్ద ఉండే మందులతో కనీసం రెండు నెలల వరకూ మందుల కొరత వచ్చే అవకాశం ఉండేది కాదని మెడికల్ షాపు నిర్వాహకులు అంటున్నారు. మందుల తయారీ కంపెనీలు చాలా వరకూ మూతపడ్డాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మందుల తయారీ కంపెనీలు మూసి ఉంచాల్సిన అవసరం లేకపోయినా లాక్ డౌన్ కారణంగా కార్మికుల రావడం లేదు.

పోలీసుల నిర్భందం, రవాణా సౌకర్యాలు లేకపోవడం తదితర కారణాలతో కార్మికులు పనికి రావడం లేదు. దాంతో చాలా వరకూ ప్రొడక్షన్ కంపెనీలు మూతపడిపోయాయి. దేశంలో చాలా రాష్ట్రాలలో తయారయ్యే మందులన్నీ ముంబయిలోని ప్రధాన కార్యాలయాలకు వెళ్లి అక్కడ నుంచి ఆర్డర్ ప్రకారం దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళతాయి.

ముంబయి పూర్తి లాక్ డౌన్ పాటిస్తున్నందున దేశంలో మందులు సరఫరా నిలిచిపోయింది. అహ్మదాబాద్, ఇండోర్ లాంటి ప్రాంతాల నుంచి తక్కువ కంపెనీలు ఆపరేట్ అవుతుంటాయి. పది లారీల లోడు డిమాండ్ ఉంటే ఒక లారీ లోడ్ మాత్రమే వస్తున్నదని స్టాకిస్టులు చెబుతున్నారు. ఎక్కువ మందులు కొనుగోలు చేయడం, తక్కువ సరఫరా ఉండటం వల్ల మందుల కొరత ఏర్పడబోతున్నది. ఈ సమస్యపై తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలు సత్వర చర్యలు తీసుకోకపోతే మందుల కొరత ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది.

Related posts

అడిటర్ బుచ్చిబాబుపై ఈడీ ప్రశ్నల వర్షం

Bhavani

అమలుకు నోచుకోని 93% జగన్ రెడ్డి హామీలు

Satyam NEWS

నిరాశ నిస్పృహ‌ లలో కొట్టుమిట్టాడుతున్న సీఎం కేసీఆర్

Satyam NEWS

Leave a Comment